నోటి, దంత ఆరోగ్యానికి రెగ్యులర్ గా బ్రష్ చేయాలి. కొంతమంది రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తే.. కొందరు మాత్రం పొద్దున్న, రాత్రి రెండు సార్లు బ్రష్ చేస్తుంటారు. నిజానికి రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. దీనివల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసనకు కారణం నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడమే. అందుకే పళ్లను సరిగ్గా తోమాలి. అయితే పళ్లను మరీ ఎక్కువ సేపు తోమడం కూడా అస్సలు మంచిది కాదు. మరి ఏయే సమయాల్లో బ్రష్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తిన్న వెంటనే
కొంతమంది తిన్న వెంటనే పళ్లను తోముతుంటారు. కానీ ఇలా తోమడం అస్సలు మంచిది కాదు. నిపుణుల ప్రకారం.. మనం ఆహారం తినేటప్పుడు మన నోరు ఆమ్లంగా మారుతుంది. ఈ ఆమ్ల స్థితిలో మీరు బ్రష్ చేస్తే అది దంతాల ఎనామెల్ ను నాశనం చేస్తుంది. అందుకే తిన్న వెంటనే బ్రష్ చేయకూడదని నిపుణులు, డాక్టర్లు చెప్తారు.
brushing
వాంతులు అయిన వెంటనే
వాంతులు అయిన వెంటనే కూడా పళ్లను తోముకోవడం మంచిది కాదు. నిపుణుల ప్రకారం.. మనం వాంతులు చేసుకున్నప్పుడు మన కడుపులోని చాలా ఆమ్లాలు నోట్లోకి వస్తాయి. అందుకే ఈ సమయంలో పళ్లను తోముకోకూడదు. ఒకవేళ తోమితే దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకే దీనికి బదులుగా వాంతులు అయినప్పుడు కేవలం మీ నోటిని మాత్రమే కడగండి. 30 నిమిషాల తర్వాతే పళ్లను తోముకుంటే సరిపోతుంది.
కాఫీ తాగిన వెంటనే
కాఫీ తాగిన వెంటనే కూడా పళ్లను తోమకూడదు. ఎందుకంటే కాఫీ తాగడం వల్ల నోటిలో ఆమ్లంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ దంతాలను తోమితే దంత ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకే ఈ సమయంలో కూడా బ్రష్ చేయకండి. కావాలనుకుంటే 20-30 నిమిషాల తర్వాత పళ్లను తోమండి.