belly fat
నిజానికి బరువు పెరగడం, పొట్టను పెంచడం చాలా అంటే చాలా ఈజీ. వీటిని తగ్గించడమే చాలా కష్టమన్న సంగతి ప్రయత్నిస్తున్నప్పుడు తెలుస్తుంది. పొట్టను తగ్గించడానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా లాభం ఉండదు. పొట్ట కరగకపోవడానికి మీరు చేసే కొన్ని పొరపాట్లే కారణం. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మీరు చేయాల్సిన మొదటి పని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఫాలో అవ్వడం. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పెంపొందించుకోవడం. బెల్లీ ఫ్యాట్ తగ్గాలనుకునే వారు రాత్రిపూట అన్నం అసలే తినకూడదు. బదులుగా మీరు తినాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటంటే..?
ఆపిల్
రోజుకో ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్న మాటను వినే ఉంటారుగా. అవును ఆపిల్ మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. యాపిల్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండు. ఆపిల్ పండును తింటే మీ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. అలాగే హెవీగా తినకుండా ఉంటారు. దీంతో మీ బరువు తగ్గడం మొదలవుతుంది. పెక్టిన్ ఎక్కువగా ఉండే ఆపిల్ ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది. అందుకే రాత్రిపూట అన్నం తినకుండా ఒకటి లేదా రెండు యాపిల్స్ తిని పడుకోండి.
జామకాయ
జామకాయ పోషకాలకు మంచి వనరు. ఇది కూడా మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. జామకాయలో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో పెక్టిన్ కూడా ఉంటుంది. పెక్టిన్ కణాలు కొవ్వును గ్రహించకుండా నిరోధిస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయడుతుంది. అందుకే రాత్రిపూట ఆహారంలో జామపండును చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.
ఓట్స్
ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని రాత్రిపూట అన్నానికి బదులుగా తినడం ఉత్తమం. ఇది మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి రాత్రిపూట అన్నానికి బదులుగా ఓట్స్ ను తినండి.
చపాతీలు
అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ కూర రుచిగా అయితే అన్నాన్ని ఎక్కువగా తింటుంటారు. ఇది మీ బరువును మరింత పెంచుతుంది. అందుకే రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీలు, వెజిటబుల్ కర్రీ తినడం అలవాటు చేసుకోండి. ఇది మీ బరువును నియంత్రిస్తుంది.
బెర్రీలు
బెర్రీలు పోషకాలకు మంచి మూలం. ఈ పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి బెర్రీలను తినడం వల్ల మీ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీ బరువు తగ్గడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.