Ferran Torres: మెస్సీ కలని ముంచేసిన కుర్రాడు.. ఎవరీ ఫెర్రాన్ టోర్రెస్? ఇండియాతో ఉన్న స్పెషల్ కనెక్షన్ ఏంటి?

Published : Jul 20, 2026, 02:49 PM IST

Who Is Ferran Torres: మెస్సీ టీమ్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్‌కు వరల్డ్ కప్ 2026 అందించిన హీరో ఫెర్రాన్ టోర్రెస్. ఈ బార్సిలోనా స్టార్ సంచలన ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 హీరోకు ఇండియాతో ఉన్న స్పెషల్ కనెక్షన్ ఏంటి?

PREV
16
ట్రోల్స్ నుంచి ట్రెండింగ్ దాకా.. అర్జెంటీనా గుండెల్ని పిండేసిన స్పెయిన్ గన్ టోర్రెస్

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ ఓ రేంజ్‌లో సాగింది. స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో ఎవరూ ఊహించని ఒక సంచలన హీరో తెరపైకి వచ్చాడు. అతడే సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఫెర్రాన్ టోర్రెస్. ఎక్స్‌ట్రా టైమ్‌లో అతడు కొట్టిన ఆ ఒక్క గోల్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లింది.

లియోనెల్ మెస్సీ మరోసారి వరల్డ్ కప్ గెలవాలనే కలను ముక్కలు చేస్తూ.. స్పెయిన్‌కు 1-0 తేడాతో ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో స్పెయిన్ తన రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. మ్యాచ్‌ 90 నిమిషాల పాటు ఎంత ప్రయత్నించినా గోల్ పడలేదు. కానీ ఎక్స్‌ట్రా టైమ్ సెకండ్ పీరియడ్ మొదలైన కేవలం 37 సెకన్లలోనే (106వ నిమిషంలో) టోర్రెస్ బంతిని నెట్‌లోకి పంపి చరిత్ర సృష్టించాడు.

26
ఊహించని గోల్‌తో అర్జెంటీనా డిఫెన్స్ క్లోజ్

ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించారు. పెడ్రో పోర్రో అందించిన సూపర్ క్రాస్‌ను నికో విలియమ్స్ చాకచక్యంగా హెడర్ ద్వారా గోల్ పోస్ట్ వైపు మళ్లించాడు. కరెక్ట్ టైమ్‌కి దూసుకొచ్చిన ఫెర్రాన్ టోర్రెస్, తన లెఫ్ట్ ఫుట్‌తో బంతిని బలంగా నెట్‌లోకి బాదాడు. అంతవరకు అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ సూపర్ సేవ్స్‌తో స్పెయిన్‌ను అడ్డుకున్నా, టోర్రెస్ షాట్‌కు మాత్రం బదులివ్వలేకపోయాడు. మ్యాచ్‌లో స్పెయిన్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది.

నిర్ణీత సమయంలో స్పెయిన్ 15 షాట్లు కొడితే, అర్జెంటీనా ఒక్కటంటే ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. కాగా, సెకండ్ హాఫ్ స్టాపేజ్ టైమ్‌లో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ తెచ్చుకుని మైదానాన్ని వీడటంతో అర్జెంటీనా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఈ విజయంతో స్పెయిన్ ఒకే సమయంలో అటు మెన్స్, ఇటు ఉమెన్స్ ఫిఫా వరల్డ్ కప్ టైటిల్స్ రెండింటినీ కలిగి ఉన్న మొదటి దేశంగా హిస్టరీ క్రియేట్ చేసింది.

36
అసలు ఎవరీ ఫెర్రాన్ టోర్రెస్?

26 ఏళ్ల ఫెర్రాన్ టోర్రెస్ గార్సియా ప్రస్తుతం బార్సిలోనా క్లబ్, అలాగే స్పెయిన్ నేషనల్ టీమ్ తరఫున ఫార్వర్డ్‌గా ఆడుతున్నాడు. వింగర్‌గా, సెంట్రల్ స్ట్రైకర్‌గా ఆడటంలో ఇతడు దిట్ట. 2000 ఫిబ్రవరి 29న వాలెన్సియాలో జన్మించిన టోర్రెస్, కేవలం ఏడేళ్ల వయసులోనే వాలెన్సియా అకాడమీలో చేరి ఫుట్‌బాల్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు.

2017లో సీనియర్ టీమ్ తరఫున అరంగేట్రం చేసి, 21వ శతాబ్దంలో లా లిగాలో ఆడిన మొదటి వాలెన్సియా ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 2020లో మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు మారిన టోర్రెస్, పెప్ గార్డియోలా కోచింగ్‌లో ప్రీమియర్ లీగ్, EFL కప్ గెలుచుకున్నాడు.

46
బార్సిలోనాలో విమర్శల నుండి వరల్డ్ కప్ హీరోగా..

జనవరి 2022లో టోర్రెస్ బార్సిలోనా క్లబ్‌లో చేరాడు. అయితే మొదట్లో ఇతడి పర్ఫార్మెన్స్‌పై భారీగా విమర్శలు వచ్చాయి. చాలా ఈజీ ఛాన్స్‌లను మిస్ చేస్తున్నాడంటూ ట్రోల్ చేశారు. కానీ హన్సి ఫ్లిక్ కోచింగ్ కింద టోర్రెస్ రేంజ్ మారిపోయింది. 2024-25 సీజన్‌లో బార్సిలోనా డొమెస్టిక్ ట్రెబుల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాతి సీజన్‌లో ఏకంగా 21 గోల్స్ చేసి బార్సిలోనా మళ్లీ లా లిగా టైటిల్ గెలవడానికి హెల్ప్ చేశాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో స్పెయిన్ తరఫున యూరో 2020, 2022 వరల్డ్ కప్, యూరో 2024 (ఇందులో స్పెయిన్ విజేతగా నిలిచింది) టోర్నీల్లో ఆడాడు. ఇప్పుడు ఏకంగా అర్జెంటీనాపై విన్నింగ్ గోల్ కొట్టి స్పెయిన్ ఫుట్‌బాల్ హిస్టరీలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నాడు.

56
సౌదీ మ్యాచ్ ట్రోల్స్ నుండి పర్ఫెక్ట్ రివెంజ్

ఈ వరల్డ్ కప్ టోర్నీ మొదట్లో టోర్రెస్ పరిస్థితి అస్సలు బాలేదు. సౌదీ అరేబియాతో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆల్రెడీ 4-0తో లీడ్‌లో ఉంది. మ్యాచ్ చివర్లో టోర్రెస్ గోల్ కొట్టి 5-0 చేశాడు. కానీ వీడియో అసిస్టెంట్ రెఫరీ చెకింగ్‌లో అది ఆఫ్‌సైడ్ అని తేలి గోల్ క్యాన్సిల్ అయింది. ఆ సమయంలో కెమెరాలు టోర్రెస్ ముఖాన్ని చూపిస్తే, "ప్లీజ్ ఇది గోల్ అవ్వాలి" అని అతడు తనలో తానే అనుకోవడం కనిపించింది.

ఎందుకంటే అంతకుముందు మ్యాచ్‌లలో చాలా ఛాన్సులు మిస్ చేయడంతో నెటిజన్లు అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. మీమ్స్ క్రియేట్ చేశారు. అసలు ఇతడు టీమ్‌లో ఎందుకున్నాడంటూ ప్రశ్నించారు. సరిగ్గా నెల రోజుల తర్వాత, అదే ప్లేయర్ వరల్డ్ కప్ ఫైనల్లో ఎలాంటి వీఏఆర్ సాయం లేకుండా పర్ఫెక్ట్ గోల్ కొట్టి అందరి నోళ్లు మూయించాడు. ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు అతడిని దేవుడిలా చూస్తున్నారు.

66
టోర్రెస్‌కు భారత్‌తో ఉన్న ఆ స్పెషల్ కనెక్షన్ తెలుసా?

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ వరల్డ్ కప్ హీరో ఫెర్రాన్ టోర్రెస్‌కు ఇండియాకు ఒక క్రేజీ కనెక్షన్ ఉంది. అవును, టోర్రెస్ టాలెంట్‌ను ప్రపంచం కంటే ముందే భారత్ చూసింది.. 2017లో ఇండియాలో జరిగిన ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్‌లో స్పానిష్ టీమ్ తరఫున టోర్రెస్ ఆడాడు. ఆ టోర్నీలో రైట్ వింగర్‌గా ఆడిన అతడు 2 గోల్స్, 2 అసిస్ట్‌లతో స్పెయిన్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

కోల్‌కతా, కొచ్చి స్టేడియాల్లోని వేలాది మంది ఇండియన్ అభిమానుల ముందు ఆనాడే టోర్రెస్ తన సత్తా చాటాడు. ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో స్పెయిన్ ఓడిపోయి సిల్వర్ మెడల్ సాధించినా, ఆ టోర్నీ టోర్రెస్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. విశేషం ఏంటంటే, ప్రస్తుత స్పెయిన్ వరల్డ్ కప్ టీమ్‌లోని డిఫెండర్ ఎరిక్ గార్సియా కూడా అప్పుడు ఇండియా వచ్చిన అండర్ 17 టీమ్‌లో సభ్యుడే. అప్పుడే భారత్‌లో రన్నరప్‌గా నిలిచిన కుర్రాడు.. ఇప్పుడు ప్రపంచాన్నే జయించి రియల్ హీరోగా నిలిచాడు.

Read more Photos on
click me!

Recommended Stories