అరటి పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ ఒక అరటి పండును తింటే బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు రోజూ ఒక అరటిపండును ఖచ్చితంగా తినాలని చెప్తుంటారు.
అరటి పండును తిన్నంత సులువుగా అరటికాయను ఎవరూ తినలేరు. నిజానికి అరటికాయలో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
వీటిని తిన్నా మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అరటికాయలోని అవసరమైన ఖనిజాలు, పోషకాలు మనకు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అసలు వీటిని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరటికాయలోని పోషకాలు
అరటికాయలో కార్బోహైడ్రేట్లు, కోలిన్, డైటరీ ఫైబర్, ఫోలేట్, కొవ్వు, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, పాంతోతేనిక్ ఆమ్లం, నియాసిన్, ఫాస్ఫరస్, ప్రోటీన్, పొటాషియం, రిబోఫ్లేవిన్, సోడియం, థయామిన్, చక్కెరలు, విటమిన్ సి, జింక్ లు మెండుగా ఉంటాయి.
అరటికాయలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అరటికాయల్లో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అరటికాయను తింటే ప్రేగు కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి మలబద్దకం సమస్య తొందరగా తగ్గిపోతుంది.
పచ్చి అరటి లోని ఫైబర్ కంటెంట్ సమతుల్య గట్ మైక్రోబయోమ్ ను నిర్వహిస్తుంది. అలాగే పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అరటికాయను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు బాగా తగ్గిపోతాయి.
గుండె ఆరోగ్యం
అరటి కాయలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్, పొటాషియం, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన గుండెను రక్షిస్తాయి. అందుకే గుండెకు అరటికాయలు మంచి ఆహారమంటారు డాక్టర్లు.
అరటికాయల్ని తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. ఈ అరటికాయల్లో ఉండే పొటాషియం గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది.
అంతేకాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి, హృదయనాళ వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. మొత్తంలో అరటికాయ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయం
అరటికాయల్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ కడుపును తొందరగా నింపుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.
అలాగే మీరు హెవీగా తినే అవకాశాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అరటికాయలోని సహజ చక్కెరలు ప్రాసెస్ చేసిన స్వీట్లకు పోషకమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. వీటిని తింటే మీరు అనవసరమైన స్వీట్లను, చిరుతిండిని తినకుండా ఉంటారు.