ఒంట్లో వేడిని పెంచే ఫుడ్స్ ఇవి.. ఎండాకాలంలో అస్సలు తినకండి

First Published Apr 3, 2024, 4:40 PM IST

ఎండాకాలంలో శరీరంలో ఉన్న వాటర్ మొత్తం చెమట రూపంలో బయటకు పోతుంది. దీనివల్ల మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఎండాకాలంలో డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే నీళ్లను ఎక్కువగా తాగాలి. అయితే  ఈ సీజన్ లో కొన్ని ఆహారాలను తింటే ఒంట్లో వేడి బాగా పెరుగుతుంది. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 


ఎండాకాలంలో ఫ్యాన్లు వేసినా, ఏసీ ఆన్ చేసినా వేడిగా అనిపిస్తుంటుంది. అందుకే శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలా మంది మజ్జిగ, పుచ్చకాయ, పండ్ల జ్యూస్ లు అంటూ ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. ఇవి వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. ఈ కాలంలో మన ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇది మన ప్రాణాలను కూడా తీసేయగలదు. అందుకే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి నీళ్లను ఎక్కువగా తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోసకాయ వంటి ఆహారాలను కూడా తినాలి. ఇవి మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అయితే కొన్ని ఆహారాలు మాత్రం శరీరంలో మరింత వేడిని పెంచుతాయి. అందుకే వీటిని ఎండాకాలంలో అస్సలు తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వేరుశెనగ

వేరుశెనగలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పల్లీలను తింటే మన శరీరంలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అలాగే మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. కానీ ఈ సీజన్ లో వీటిని తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎండాకాలంలో పల్లీలను ఎక్కువగా తినకూడదు. 
 

క్యారెట్లు

క్యారెట్లు ఎన్నో పోషకాలను కలిగున్న కూరగాయ. దీన్ని పచ్చిగా లేదా కూరగా చేసుకుని తినొచ్చు. దీన్ని ఎక్కువగా శీతాకాలంలో తింటుంటారు. క్యారెట్ లో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. క్యారెట్ ను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చర్మం కూడా మంచి గ్లో వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కానీ క్యారెట్లకు శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ సీజన్ లో వీటిని ఎక్కువగా తినకండి. 
 

అల్లం

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అల్లం కూడా మన శరీర వేడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎండాకాలంలో అల్లాన్ని మరీ ఎక్కువగా తినకండి. 
 

గుడ్లు

గుడ్లు మంచి పోషకాహారం. సంపూర్ణ ఆహారం కూడా. గుడ్లు ప్రోటీన్లకు భాండాగారం. దీనిలో విటమిన్లు, ఖనిజాలు మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. గుడ్లను తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ గుడ్లను ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. 
 

బాదం 

బాదం పప్పుల్లో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి. వీటిని నానబెట్టి తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. విటమిన్లు పుష్కలంగా ఉండే బాదం శరీరానికి ఎంతో మేలు చేసే గింజల్లో ఒకటి. కానీ బాదం పప్పులను ఎక్కువగా తింటే కూడా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

click me!