వేసవి కాలం వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. ఈ సీజన్‌లో రుచికరమైన, రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. నిజానికి మామిడి పండ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ అసలు విషయం ఏమిటంటే, సహజంగా పండిన మామిడి పండ్ల కంటే, కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్లే ఎక్కువగా మార్కెట్ లోకి వస్తాయి.
ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతోనే కృత్రిమ మామిడి పండ్లను తయారుచేస్తారు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా పండిన మామిడి పండ్లు ఎలా కొనాలి? అసలు వాటిని ఎలా గుర్తించాలి? ఇతర విషయాలు మీకోసం.
నీటిలో వేసి చూడండి:
కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండును గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మొదటగా మామిడి పండ్లను కొనుక్కుని రాగానే ఒక బకెట్‌లో నీళ్లు నింపి, అందులో మామిడి పండ్లను వేయండి. మామిడి పండ్లు మునిగితే అది సహజంగా పండించిన పండు. అదే మామిడి పండ్లు మునగకుండా తేలుతూ ఉంటే అది కృత్రిమంగా పండించిన పండు అని అర్థం.
మామిడి పండు తొక్క రంగు:
కృత్రిమంగా పండిన మామిడి పండ్లు ఒకే రంగులో ఉంటాయి. అదే సహజంగా పండించిన మామిడి పండ్లు కాస్త పసుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. అంతేకాకుండా అవి కాస్త మెరిసేలా కూడా ఉంటాయి.
మామిడి పండు వాసన:
సహజంగా పండిన మామిడి పండ్లు ఒక విధమైన తియ్యటి వాసనను కలిగి ఉంటాయి. అదే కృత్రిమంగా పండిన మామిడి పండ్లలో రసాయనం లేదా వేరే వాసన వస్తుంది.
పండు స్వభావం:
సహజంగా పండిన మామిడి పండ్ల కంటే కృత్రిమంగా పండిన మామిడి పండ్లు చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. కృత్రిమంగా పండించే ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు పండు కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. దీని కారణంగా అది మెత్తగా అవుతుంది.
డ్యామేజ్‌లు:
కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండ్ల పైభాగంలో డ్యామేజ్‌లు ఉంటాయి. కాబట్టి వాటిని కొనడం మానుకోండి. అదే సహజంగా పండిన మామిడి పండ్ల పైభాగంలో ఎలాంటి మరకలు, డ్యామేజ్‌లు, చుక్కలు ఉండవు.
బేకింగ్ సోడా:
ఒక బకెట్‌లో నీళ్లు నింపి అందులో మామిడి పండ్లను వేయండి. కొద్దిగా బేకింగ్ సోడాను కూడా నీటిలో వేసుకోండి. 15 నిమిషాల తర్వాత మామిడి పండ్లను కడిగి చూడండి. దాని రంగు మారితే అది రసాయనం కలిపిన మామిడి పండు అని అర్థం.