మామూలుగా పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ మార్కెట్‌లో కిలోల లెక్కన కొంటాం. మహా అయితే రూ.60-రూ.100 ఉంటుంది ఒక ప్యాకెట్. కానీ ప్రపంచంలో కొన్ని రకాల పుట్టగొడుగుల ధరలు చూస్తే ఆశ్చర్యపోతారు. డబ్బున్నోళ్లు కూడా కొనలేరు. ఇక సామాన్యులేం కొంటారు. ఎందుకంటే కిలో వేల డాలర్ల ధర ఉంటుంది. ఒక్కోసారి వేలంలో లక్షల డాలర్లకు అమ్ముడయ్యే సందర్భాలు ఉన్నాయి. వీటికి అంత ధర ఎందుకు? ప్రత్యేకత ఏమిటి?
వైట్ ట్రఫుల్.. రూ.కోటికిపైగానా
వైట్ ట్రఫుల్ (White Truffle). అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. ఇటలీ, క్రొయేషియా ప్రాంతాల్లో లభించే ఈ మష్రూమ్..ప్రత్యేకమైన వాసన, రుచి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సాధారణ పుట్టగొడుగుల్లా కాకుండా, ఇవి నేలలో చెట్ల వేర్లకు దగ్గరగా పెరుగుతాయి. ఓక్, బీచ్ వంటి చెట్లతో కలిసి పెరిగే వీటిని గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కల సహాయం తీసుకుంటారు. సాగు చేయడం కూడా చాలా కష్టం. అందుకే డిమాండ్ ఎక్కువ.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 2007 డిసెంబర్‌లో సుమారు 1.3 కిలోల బరువున్న ఒక భారీ వైట్ ట్రఫుల్‌ను మకావులో జరిగిన వేలంలో 3.3 లక్షల అమెరికన్ డాలర్లకు విక్రయించారు. భారత కరెన్సీలో కోట్ల రూపాయలకు సమానం.