World Largest River Island: మ్యాప్‌ నుంచి మాయమవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం.. అసలు ఏం జరుగుతోంది?

Published : Nov 12, 2026, 11:01 AM IST

World Largest River Island: ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన అస్సాంలోని మజులి ప్రకృతి అందాలకు, వైష్ణవ సంస్కృతికి నిలయం. అయితే బ్రహ్మపుత్ర నది ఉధృతి, భూకోత వల్ల ఈ ద్వీపం ఉనికి ప్రమాదంలో పడింది. ఈ ద్వీపం పూర్తి వివరాలు మీకోసం.

PREV
15
నది మధ్యలో ఊళ్లు, ప్రాచీన కళలు.. అస్సాం ‘మజులి ద్వీపానికి ఏమైంది?

భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది ఒడిలో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం అయిన మజులి దీవి వుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదుల నీటి ప్రవాహాల నడుమ రూపుదిద్దుకున్న ఈ ప్రాంతం, కేవలం ఒక భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు.. అస్సాం సంస్కృతి, ఆధ్యాత్మికత, సాంప్రదాయ కళలకు ఇది ముఖ్య కేంద్రం.

ప్రకృతి సౌందర్యంతో అలరారే ఈ ద్వీపంలో ప్రజల జీవనశైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, గడిచిన కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన భూకోత, ప్రతికూల వరదల కారణంగా ఈ ద్వీపం తన ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది.

25
ప్రత్యేక భౌగోళిక రూపురేఖలు

బ్రహ్మపుత్ర నది ప్రవాహ మార్గాలు మారడం, ఇసుక మేటలు వేయడం ద్వారా మజులి ద్వీపం కాలక్రమేణా ఆవిర్భవించింది. జోర్హాట్ నగరానికి సమీపంలో ఉన్న ఈ ద్వీపాన్ని బ్రహ్మపుత్ర, సుబన్‌సిరి, ఇతర చిన్న నదీ పాయలు చుట్టి ముడతాయి. ఇక్కడ అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములు, చిత్తడి నేలలు, పచ్చని గడ్డిభూములు, నదీ ఇసుక తిన్నెలు, స్థానికంగా బీల్స్ అని పిలిచే చిన్న నీటి వనరులు విస్తరించి ఉన్నాయి.

ఈ చిత్తడి నేలలు రకరకాల చేపల జాతులకు, వలస పక్షులకు నిలయంగా మారి ఇక్కడి జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణం, సాంప్రదాయ గ్రామీణ జీవనం, మనోహరమైన నదీ దృశ్యాల వల్ల మజులి ప్రకృతి ప్రియులకు, ఈకో-టూరిస్టులకు అత్యంత అభిమాన ప్రదేశంగా మారింది.

35
భూకోతో ద్వీపానికి పెరుగుతున్న ముప్పు

మజులి ఈ రోజు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు బ్రహ్మపుత్ర నది తెచ్చిపెడుతున్న ఉధృతమైన భూకోత. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాల వల్ల నదిలో నీటి మట్టం తీవ్రంగా పెరుగుతుంది. ప్రవాహ వేగానికి నదీ తీరాలు నిలువునా కొట్టుకుపోతున్నాయి. నది తన ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, ఇళ్లు, రోడ్లు, గ్రామాలు నీటిపాలవుతున్నాయి.

శాటిలైట్ చిత్రాల ఆధారంగా చేసిన పరిశోధనలు మజులి భూభాగం గడిచిన కొన్ని దశాబ్దాలలో దారుణంగా తగ్గిపోయిందని స్పష్టం చేస్తున్నాయి. భూకోత భయంతో ఇక్కడి ప్రసిద్ధ వైష్ణవ మఠాలు అయిన సత్రాలు కూడా తమ స్థానాలను సురక్షిత ప్రాంతాలకు మార్చుకోవాల్సి వచ్చింది. నేల కొట్టుకుపోతుండటంతో ఇక్కడి రైతులు, గిరిజన వర్గాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్నారు. నివాసాలు కోల్పోయి స్థానభ్రంశం చెందుతున్నారు.

మజులిని కాపాడుకోవడానికి శాస్త్రీయ పద్ధతుల్లో నదీ తీరాల రక్షణ, పక్కా వరద నిర్వహణ, సుస్థిర భూవినియోగ ప్రణాళికలు, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. తాత్కాలిక అడ్డుకట్టలతో సరిపెట్టకుండా బ్రహ్మపుత్ర నది సహజ ప్రవర్తనను అర్థం చేసుకుని శాశ్వత పరిరక్షణ చర్యలు చేపట్టాలి.

45
వైవిధ్యభరితమైన సంస్కృతి, సంప్రదాయాలు

అస్సాం సాంస్కృతిక రంగానికి మజులి గుండెకాయ లాంటిది. 15వ, 16వ శతాబ్దాలలో గొప్ప సంస్కర్త, సెయింట్ శ్రీమంత శంకరదేవ ప్రారంభించిన నవ-వైష్ణవ ఉద్యమంతో మజులి ఐడెంటిటీ ముడిపడి ఉంది. శంకరదేవుడు, ఆయన శిష్యుడు మాధవదేవుడు ఇక్కడ సత్రాలను స్థాపించారు. ఇవి కాలక్రమేణా ఆధ్యాత్మికత, విద్య, సాహిత్యం, సంగీతం, నాటకం, నృత్యాలకు కేంద్రాలుగా విలసిల్లాయి.

ఇక్కడ ప్రదర్శించే సాత్రియా నృత్యం, మతపరమైన నాటక రూపమైన భాఓనా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. చేతితో చేసే మాస్క్‌లు, మట్టి పాత్రల తయారీకి మజులి చాలా ప్రసిద్ధి చెందింది. మిషింగ్, దేవోరి, సోనోవాల్ కచారి వంటి గిరిజన తెగల ప్రజలు తమ ఆచారాలు, పండుగలు, వంటకాలు, ప్రత్యేక జీవనశైలితో మజులి బహుళ సంస్కృతికి జీవం పోస్తున్నారు.

ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జరిగే రాస్ లీల పండుగ ఇక్కడ అత్యంత వేడుకగా జరుగుతుంది. శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలను సంగీతం, నృత్యం, నాటకాల రూపంలో ప్రదర్శించే ఈ పండుగను చూడటానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు.

55
కాపాడుకోవాల్సిన ప్రాచీన సంపద

మజులి కేవలం మానవ నివాసాలు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం మాత్రమే కాదు.. అది అస్సాం ప్రకృతి, సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. అక్కడి భౌగోళిక రూపురేఖలు, జీవవైవిధ్యం, శతాబ్దాల నాటి సంప్రదాయాలు ఆ ప్రాంతాన్ని ఒక విశిష్టమైన స్థానంలో నిలిపాయి.

అయితే, రోజురోజుకూ పెరుగుతున్న భూకోత, వినాశకర వరదలు ఈ ఐలాండ్ ఉనికికే సవాలు విసురుతున్నాయి. రాబోయే తరాలకు ఈ చారిత్రక వారసత్వాన్ని అందించాలంటే తక్షణమే సుస్థిర పరిరక్షణ చర్యలు చేపట్టడంతో ఇక్కడి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories