మద్యప్రియులు ప్రపంచంలో అధికంగానే ఉన్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం నీళ్ల కన్నా మద్యాన్నే ఎక్కువ తాగేస్తున్నారు. ఇక మన భారతదేశంలో మద్యాన్ని ఎంత మేర తాగుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం అనేది దేశాలు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. ప్రపంచ సగటున 15 ఏళ్లు పైబడిన వారు ఏటా తలసరి సుమారు 4.2 నుంచి 5.4 లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారు. ఈ జాబితాలో యూరప్ దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి. అక్కడ ప్రపంచ సగటు కంటే రెట్టింపు స్థాయిలో, అంటే ఏటా తలసరి 10 నుంచి 12 లీటర్ల మద్యం తాగుతున్నారు. మరోవైపు మతపరమైన, సాంస్కృతిక కారణాల వల్ల కువైట్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి మధ్యప్రాచ్య దేశాల్లో మద్యం వినియోగం దాదాపు సున్నాగా నమోదైంది.
23
మనదేశం పరిస్థితి
భారతదేశ విషయానికి వస్తే, ఇక్కడ ఏటా తలసరి మద్యం వినియోగం సుమారు 4.9 నుంచి 5.7 లీటర్లుగా ఉంది. ఇది ప్రపంచ సగటుకు దగ్గరగా ఉన్నప్పటికీ, గత పదేళ్లలో మన దేశంలో మద్యం తాగే వారి సంఖ్య, వినియోగం దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు భోజనంతో పాటు పరిమితంగా వైన్ లేదా బీర్ తాగుతుంటారు. కానీ భారత్‌లో మాత్రం ఒకేసారి అధిక మొత్తంలో మద్యం సేవించే ప్రమాదకర అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మద్యం కంపెనీలకు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది.
33
మద్యం వల్ల పోతున్న ప్రాణాలు
అతిగా మద్యం సేవించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మద్యం కారణంగా ఏటా సుమారు 26 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ మరణాల్లో సుమారు 20 లక్షల మంది పురుషులు ఉండగా, 6 లక్షల మంది మహిళలు ఉన్నారు. అదనంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది మద్యం వ్యసనంతో పాటు అనేక శారీరక, మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మద్యం మహమ్మారిని నియంత్రించకపోతే భవిష్యత్తులో మరింత ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.