
మనం ఇంటిముందు లేదంటే ఎక్కడైనా బయట బైక్ లేదా కారు పార్క్ చేసినప్పుడు టైర్లపై కుక్కలు మూత్రం పోయడం గమనిస్తుంటాం. చుట్టూ ఖాళీ ప్రదేశం ఉన్నా కుక్కలు వాహనాల టైర్లపైనే ఈ పని చేస్తుంటాయి. కుక్కల ఈ వింత ప్రవర్తన వెనకున్న కారణాలేంటో తెలుసుకుందాం.
కుక్కలు తమ భూభాగాన్ని గుర్తించడానికి, ఇతర కుక్కలకు తమ ఉనికిని తెలియజేయడానికి మూత్రాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తాయి. వాహనాల టైర్లపై మూత్రం పోయడం ద్వారా ఓ సందేశాన్ని ఇతర కుక్కలకు చేరవేస్తాయట. ఇలా ఒక కుక్క టైర్‌పై మూత్రం పోయడం వెనక తన పరిధిని విస్తరింపజేసుకోవడమే ప్రధాన కారణం. ఇది వాటికి ఒక సహజసిద్ధమైన ప్రవృత్తి. ఈ ప్రవర్తన ముఖ్యంగా మగ కుక్కలలో ఎక్కువగా కనిపిస్తుంది.
వాహనాల టైర్లు చాలా ఆకర్షణీయమైన లక్షణాలను కలిగి ఉంటాయి. గుండ్రంగా ఉండే టైర్ల ద్వారా కుక్కలు మూత్రం వాసనను విస్తృత ప్రదేశాలకు వ్యాపించేలా చేస్తాయి. రెండవది రబ్బరు వంటి టైర్ల పదార్థం వాసనను ఎక్కువ కాలం నిలుపుకుంటుంది.. దీని వలన సందేశం ఎక్కువ కాలం ఉంటుంది. మూడవది వాహనాలు కదులుతూ ఉండటం వల్ల టైర్లపై ఉన్న వాసన దూర ప్రాంతాలకు చేరుతుంది, ఇది కుక్కల వాసన సందేశాలను పంపే సామర్థ్యాన్ని పెంచుతుంది.
నేలపై మూత్రం పోస్తే త్వరగా ఆరిపోవడం లేదా నీటి వల్ల కొట్టుకుపోవడం జరుగుతుంది. కానీ రబ్బరు టైర్ల ఉపరితలంపై మూత్రపు వాసన ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. కారు, బైక్ టైర్లు కుక్కల ముక్కు ఎత్తులోనే ఉంటాయి. వీటిపై మూత్రం పోయడం వల్ల ఆ వాసన నేలపై లాగా త్వరగా కొట్టుకుపోకుండా, ఇతర కుక్కలకు నేరుగా చేరుతుంది.
కుక్కల మూత్రం కేవలం వ్యర్థపదార్థం కాదు.. ఇది ఇతర కుక్కలకు అనేక రకాల సమాచారాన్ని అందించే ఒక సంక్లిష్టమైన "పీ-మెయిల్" వ్యవస్థ. మూత్రంలో ఉండే ఫెరోమోన్లు ఒక కుక్క వయస్సు, లింగం, ఆరోగ్య స్థితి, సంతానోత్పత్తి స్థితి, మానసిక స్థితి గురించి కీలకమైన వివరాలను వెల్లడిస్తాయి. ఉదాహరణకు ఒక మగ కుక్క మూత్రం ద్వారా ఆడ కుక్కను ఆకర్షిస్తుంది… సంతానోత్పత్తికి సంసిద్ధతను తెలుసుకోగలదు. టైర్లపై మూత్ర విసర్జన చేయడం ద్వారా, కుక్కలు తమ పరిసరాల్లోని ఇతర కుక్కలకు తమ ఉనికి గురించి, తమ ప్రస్థానం గురించి తెలియజేస్తాయి. డాగ్ బిహేవియర్ నిపుణులు ఈ సంభాషణ విధానాన్ని కీలకమైనదిగా భావిస్తారు.
కుక్కలు టైర్లపై మూత్రం పోయడంవెనకున్న మరో కారణం ఆధిపత్యపోరు. ఇది కేవలం భూభాగాన్ని గుర్తించడం మాత్రమే కాదు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, భద్రతను ధృవీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది.
కొన్ని సందర్భాలలో కొత్త వాతావరణంలో లేదా ఒత్తిడికి లోనైనప్పుడు కుక్కలు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తాయి. పెంపుడు కుక్కలు ఇలా ఎక్కువసార్లు మూత్రం చేస్తున్నాయంటే అవి ఇబ్బంది పడుతున్నట్లు అర్థం... యజమానులు ఈ విషయాన్ని గమనించాలి.
పెంపుడు జంతువుల యజమానులకు కుక్కల ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ కుక్కను బయటకు తీసుకెళ్లినప్పుడు మూత్రం, మలవిసర్జన చేయడానికి తగిన సమయం, స్థలం ఇవ్వాలి. ఇది వాటి సహజ అవసరాన్ని తీర్చడానికి సహాయపడుతుంది. తరచుగా టైర్లపై మూత్ర విసర్జన చేసే కుక్కలను శిక్షణ ద్వారా నియంత్రించవచ్చు. ఉదాహరణకు వాటిని నిర్దిష్ట ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయడానికి ప్రోత్సహించండి.
ఇక వాహన యజమానులు టైర్లను శుభ్రం చేయడం లేదా సిట్రస్ వంటి వాసనలు వెదజల్లే ద్రవాలను ఉపయోగించడం ద్వారా కుక్కలు ఆ ప్రాంతానికి రాకుండా నిరోధించవచ్చు. జంతు సంరక్షణ నిపుణులు కూడా ఈ పద్ధతులనే సూచిస్తారు.