Nameless Railway Station : ఇండియాలో పేరు లేని ఏకైక రైల్వేస్టేషన్.. ఇక్కడికి వెళ్లాలంటే టికెట్ ఎలా..?

Published : Jul 06, 2026, 09:11 PM IST

కొన్ని వింతలు ఇండియాలో మాత్రమే కనిపిస్తుంటాయి… అలాంటిది ఈ రైల్వే స్టేషన్. అసలు పేరు అన్నదే లేకపోవడం ఈ రైల్వే స్టేషన్ స్పెషాలిటి. మరి ఇక్కడికి వెళ్లాలంటే టికెట్ ఎలా తీసుకోవాలి?

PREV
15
అసలు పేరే లేని రైల్వే స్టేషన్..

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఇండియన్ రైల్వేస్ ఒకటి. ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు… వందలాది రైళ్లు పట్టాలపై పరుగెడుతుంటాయి. అయితే సాధారణంగా మనం ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ పేరు పెద్దపెద్ద బోర్డులపై స్పష్టంగా రాసి ఉండటం చూస్తాం. కానీ భారతదేశంలో ఒక రైల్వే స్టేషన్‌కు అసలు పేరే లేదంటే మీరు నమ్ముతారా? అవును, మీరు చదివింది అక్షరాలా నిజం. గత 17 ఏళ్లుగా ఆ స్టేషన్‌లోని బోర్డు ఎలాంటి పేరు లేకుండా కేవలం ఖాళీగా దర్శనమిస్తోంది. ఇంతకీ ఆ వింత స్టేషన్ ఎక్కడుంది? దానికి పేరెందుకు లేదు? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

25
ఈ పేరులేని రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది?

అసలు పేరన్నదే లేని రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. బుర్ద్వాన్ (బర్ధమాన్) జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'రేనా' అనే గ్రామంలో ఈ రైల్వే స్టేషన్ కలదు. రైల్వే శాఖ ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం 2008వ సంవత్సరంలో ఒక కొత్త స్టేషన్‌ను నిర్మించింది. అయితే నాటి నుండి నేటి వరకు ఆ స్టేషన్‌కు ఒక పేరును స్థిరపరచడం అధికారుల వల్ల కాలేదు.

35
ఈ రెల్వే స్టేషన్ పేరెందకు లేదు?

ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం 'రైనా', 'రైనాగడ్' అనే రెండు పొరుగు గ్రామాల మధ్య సరిగ్గా మధ్యలో జరిగింది. స్టేషన్ పూర్తయిన తర్వాత రైల్వే అధికారులు ప్రాథమికంగా దీనికి 'రైనాగడ్' అని పేరు ఖరారు చేశారు. ఆ పేరును స్టేషన్ లోని బోర్డుపై కూడా రాశారు. దీనితో రైనాగడ్ గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు.

కానీ పక్కనే ఉన్న రైనా గ్రామ ప్రజలు రైల్వే అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. స్టేషన్ తమ గ్రామం పరిధిలోకి కూడా వస్తుందని, కాబట్టి దానికి 'రైనా' అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా రెండు గ్రామాల మధ్య రైల్వే స్టేషన్ కోసం వివాదం ముదిరి నిరసనలకు దారితీసింది. దీంతో రైల్వే అధికారులకు ఏటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.

45
కోర్టు మెట్లెక్కిన రెండు గ్రామల ప్రజలు..

రైల్వే స్టేషన్ పేరు విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం కాస్తా తీవ్ర రూపం దాల్చింది. ఇరు వర్గాల ప్రజల నిరసనలతో ఈ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. రైల్వే సీనియర్ అధికారుల కార్యాలయాల వెలుపల పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ఈ గొడవ అంతటితో ఆగకుండా కోర్టుకు చేరింది. కోర్టులో ఈ కేసుపై వాదనలు జరగడం ప్రారంభమైంది.

న్యాయస్థానంలో కాకుండా రెండు గ్రామాల ప్రజలు కలిసి కూర్చొని ఏదైనా ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనాలని అధికారులు సూచించారు. కానీ ఇరు గ్రామాల ప్రజలు తమ పట్టు వీడలేదు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో, విసిగిపోయిన రైల్వే అధికారులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్ బోర్డుపై ఉన్న 'రైనాగడ్' అనే పేరును పూర్తిగా తొలగించారు.

అప్పటి నుండి నేటి వరకు అంటే దాదాపు 17 సంవత్సరాలుగా ఆ బోర్డుపై ఏ గ్రామం పేరు రాయలేదు. అక్కడ కేవలం ఒక ఖాళీ పసుపు బోర్డు మాత్రమే ప్రయాణికులకు కనిపిస్తుంది. రెండు గ్రామాల పంతం వల్ల ఈ స్టేషన్ భారతదేశంలోనే 'పేరు లేని స్టేషన్'గా మిగిలిపోయింది.

55
పేరు లేని రైల్వే స్టేషన్ కు టికెట్ ఎలా?

బోర్డు మీద పేరు లేకపోయినప్పటికీ, ఈ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు. స్థానిక ప్రయాణికులు రోజుకు 6 సార్లు ఈ మార్గంలో నడిచే రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులు ఇక్కడ రెగ్యులర్‌గా ఎక్కడం, దిగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బోర్డు ఖాళీగా ఉన్నప్పటికీ, ప్రయాణికులకు ఇచ్చే టికెట్‌పై మాత్రం 'రైనాగడ్' అనే పేరే ముద్రించబడి ఉంటుంది.

 ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రామస్తుల పంతాలు, పట్టింపులు ఎలాంటి వింత పరిస్థితులకు దారితీస్తాయో చెప్పడానికి ఈ పేరు లేని రైల్వే స్టేషన్ ఒక చక్కని ఉదాహరణ. ఇప్పటికీ ఈ మార్గంలో వెళ్లే కొత్త ప్రయాణికులు ఆ ఖాళీ బోర్డును చూసి ఆశ్చర్యపోతుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories