
Tirumala Temple : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది తిరుమలకు తరలివెళుతుంటారు. ఇందులో అత్యధికమంది కాలినడకన తిరుమల కొండపైకి చేరుకుంటారు. వేలాది మెట్లెక్కి కిలోమీటర్ల దూరం కొండపైకి ట్రెక్కింగ్ చేయడం వయసులో ఉన్న యువతీయువకులకే కష్టం. ఒళ్లంతా చెమటలు కక్కుతుండగా అలసిపోయి, ఆపసోపాలు పడుతూ ఎంతో కష్టంగా ఏడుకొండలపైకి చేరుకుంటారు.. స్వామిపై భక్తితో ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తారు.
యువతీయువకుల పరిస్థితే ఇలా ఉంటే వయసు మీదపడినవారు తిరుమల కొండపైకి కాలినడకన చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి. కానీ ఓ పండు ముసలవ్వకు శ్రీవారిపై ఉన్న అచెంచలమైన భక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేయించింది. 116 ఏళ్ల వయసులో నడుచుకుంటూ కొండపైకి చేరుకుని అందరినీ ఆశ్చర్చపర్చింది వృద్ధురాలు. ఇంతకూ ఎవరీ పరమ భక్తురాలు? ఆమె ఫిట్ నెస్ కు కారణమేంటి? అనేది తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే తెలుగోళ్ల మాదిరిగానే తమిళులకు కూడా తిరుమల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం... అందుకే తమిళనాడు నుండి ఎక్కువమంది వస్తుంటారు. ఇలా ఇటీవల ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వచ్చింది 116 ఏళ్ల తమిళురాలు నవనీతమ్మ.
కుటుంబసభ్యులంతా కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లాలని భావించారు... వయసు మీద పడటంతో నవనీతమ్మను వాహనంలో కొండపైకి పంపాలని అనుకున్నారు. కానీ ఆమె అందుకు ససేమిరా అంగీకరించలేదు... తన భక్తికి వయసు అడ్డుకాదని నిరూపించింది. కుటుంబసభ్యులతో కలిసి కాలినడకనే తిరుమల కొండెక్కడం ప్రారంభించింది... ఈ వయసులో ఆమె కొండెక్కడం చూసి మిగతా భక్తులు ఆశ్యర్చపోయారు.
అయితే కొందరు భక్తులు నవనీతమ్మ కొండ ఎక్కుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు... అది కాస్త వైరల్ గా మారింది. పండు ముసలావిడ శ్రీవారిపై భక్తితో అవలీలగా కొండ ఎక్కడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఇలా సామాన్యురాలిగా ఏడుకొండలపైకి నడక ప్రారంభించిన నవనీతమ్మ కొండ ఎక్కేసరికే సెలబ్రిటీగా మారిపోయింది.
స్వామివారిపై భక్తితో కాలినడకన 3550 మెట్లు ఎక్కుతూ 9 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసింది 116 ఏళ్ల నవనీతమ్మ. ఆమె భక్తి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బిఆర్ నాయుడును కూడా కదిలించింది... ఆమె వివరాలు సేకరించి ప్రత్యేక దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇలా ఛైర్మన్ ఆదేశాలతో నవనీతమ్మను వెతుక్కుంటూ టిటిడి అధికారులు కదిలారు.. చివరకు విజిలెన్స్ సిబ్బంది వివరాలను సేకరించారు. ఆమెతో పాటు కుటుంబసభ్యులకు ప్రత్యేకంగా విఐపి బ్రేక్ దర్శనం ఏర్పాటుచేశారు... దగ్గరుండి శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయించారు. రంగనాయకులు మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.. టిటిడి ఈవో ఆమెకు పట్టువస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందచేశారు. టిటిడి ఉన్నతాధికారులు కొందరు ఈ పరమ భక్తురాలి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు… pic.twitter.com/3Cbu2loCVX— B R Naidu (@BollineniRNaidu) July 6, 2026
తిరుమల ఏడుకొండలపైకి కాలినడకన చేరుకుని స్వామివారిని దర్శించుకుని తన అచెంచల భక్తిని చాటుకున్న నవనీతమ్మను స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆమె భక్తికి వయసు కూడా తలవంచిందని.. స్వయంగా ఆ శ్రీవారే ఆమెను కొండపైకి పిలుచుకున్నారని చంద్రబాబు అన్నారు.
''ఆ దైవంపై నిష్కల్మషమైన భక్తి కలిగినవారికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఇది మరోసారి నిరూపితమయ్యింది. 116 ఏళ్ల వయసులో ఈ వృద్ధురాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం కోసం కాలినడన తిరుమల కొండపైకి చేరుకుందని తెలిసి నేను నివ్వెరపోయాను. ఆమె భక్తికి ఫ్యామిలీ సపోర్ట్ తోడయ్యింది... అందుకే అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం అయ్యింది. ఆమె ఏడుకొండలు ఎక్కుతుంటే చూడటానికి అద్భుతంగా అనిపించింది. నిజంగా ఆమె భక్తితో చేసిన ఈ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం'' అంటూ నవనీతమ్మ గురించి చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her… pic.twitter.com/Ke70jmKy4v
— N Chandrababu Naidu (@ncbn) July 5, 2026