Psychology: చాలామంది రాత్రిపూట ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు. చిన్న విషయాలకే ఎక్కువ బాధపడుతుంటారు. గత విషయాలు, భవిష్యత్ భయాలు ఇలా అన్నీ ఒక్కసారిగా దాడిచేసినట్లు అనిపిస్తుంటుంది. అసలు మనిషి రాత్రిపూటే ఎందుకు ఎక్కువ ఎమోషనల్ అవుతాడు? సైకాలజీ ఏం చెప్తోంది?
చాలామందికి పగలంతా సాధారణంగా అనిపించిన సమస్యలు, రాత్రి పడుకునే సమయానికి మాత్రం చాలా పెద్దవిగా కనిపిస్తాయి. చిన్న విషయానికే బాధపడటం, పాత విషయాలు గుర్తు చేసుకోవడం, ఒంటరిగా ఫీల్ కావడం లేదా ఎవరో గుర్తొచ్చి భావోద్వేగానికి లోనవడం సాధారణమే. సైకాలజీ నిపుణుల ప్రకారం ఇది కేవలం ఊహ కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
26
మానసిక అలసట వల్ల
సైకాలజీ ప్రకారం మనిషి మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగాల్లో "ప్రీఫ్రంటల్ కార్టెక్స్" కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనలను నియంత్రించడం, భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అయితే రోజంతా పని, ఒత్తిడి, అనేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ భాగం అలసిపోతుంది. నిపుణుల ప్రకారం మానసిక అలసట పెరిగినప్పుడు భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపించడం, బాధ, ఆందోళన పెరగడం జరుగుతుంది.
36
అంతర్గత ఆలోచనలపై దృష్టి
రాత్రివేళల్లో బయటి ప్రపంచం ప్రశాంతంగా మారిపోతుంది. పగలంతా పని, కుటుంబ బాధ్యతలు, ఫోన్ కాల్స్ ఇలా మన దృష్టిని వేరే విషయాలపై పెడతాము. కానీ రాత్రి ఇవన్నీ తగ్గిపోయినప్పుడు మన మెదడు అంతర్గత ఆలోచనలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ సమయంలో గత జ్ఞాపకాలు, అపజయాలు, కోల్పోయిన వ్యక్తులు లేదా భవిష్యత్తుపై భయాలు మనసులో తిరగడం సహజం. దానివల్ల ఆందోళన, బాధ, ఒత్తిడి మరింత పెరుగుతాయి.
మన శరీరం జీవ గడియారం ఆధారంగా పనిచేస్తుంది. ఈ జీవ గడియారం నిద్ర, మెలకువ, హార్మోన్ల విడుదల వంటి ప్రక్రియలను నియంత్రిస్తుంది. రాత్రి సమయానికి మెలటోనిన్ హార్మోన్ పెరిగి శరీరాన్ని విశ్రాంతికి సిద్ధం చేస్తుంది. అదే సమయంలో రోజంతా పడిన శారీరక, మానసిక అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగా లేకపోయినా లేదా చాలా రోజులుగా నిద్ర లోపించినా భావోద్వేగాలు మరింత తీవ్రంగా అనిపిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
56
ఒంటరితనం కూడా..
ఒంటరిగా నివసించే వారు లేదా ఇటీవల ఏదైనా నష్టం జరిగినవారు, సంబంధాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాత్రి సమయంలో ఎక్కువ భావోద్వేగానికి లోనవుతుంటారు. పగలు ఇతరులతో మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ, రాత్రి ఆ అవకాశం ఉండదు కాబట్టి మనసు వెలితిగా అనిపించి ఎక్కువ ఎమోషనల్ అవుతారు.
అలాగే రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం కూడా భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఇతరుల జీవితాలను చూసి తమ జీవితాన్ని పోల్చుకోవడం, ప్రతికూల వార్తలను వరుసగా చూడడం లేదా నిద్రకు ముందు ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. దీంతో ఆందోళన, ఒత్తిడి, భావోద్వేగ అస్థిరత పెరిగే అవకాశం ఉంటుంది.
66
ఎలా బయటపడాలంటే?
సైకాలజీ నిపుణుల ప్రకారం ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రకు గంట ముందు మొబైల్ లేదా ఇతర స్క్రీన్‌ల వినియోగాన్ని తగ్గించడం, రోజులో ఎదురైన భావాలను డైరీలో రాసుకోవడం, ధ్యానం చేయడం, సాయంత్రం తర్వాత కెఫీన్ పరిమితం చేయడం, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం వంటి అలవాట్లు మానసిక ప్రశాంతతను పెంచుతాయి.