Sri Krishnadevaraya: శ్రీ కృష్ణదేవరాయలను తెలుగు, కన్నడ ప్రజలు మర్చిపోరు. అయితే చరిత్రలో అతనిపై ఒక మచ్చ పడింది. అతను తమ మంత్రి తిమ్మరుసు కళ్లను పీకించాడని అంటారు. ఇది ఎంత వరకు నిజం.
విజయనగర సామ్రాజ్య చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు పేరు చాలా గొప్పగా వినిపిస్తుంది. ఇతని పేరు చెబితే చాలు న్యాయం, ధర్మం, సాహిత్యం, కళలకు పెద్దపీట వేసిన మహారాజు గుర్తుకు వస్తాడు. అలాంటి రాజు తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి, మంత్రి అయిన సాళువ తిమ్మరుసుకు తీవ్ర శిక్ష వేశాడని అంటారు. రాజ్యాన్ని కాపాడడంలో తిమ్మరుసు దేవరాయలకు ఎంతో సహాయచేశాడు. మంత్రిగా రాజుకు సలహాలు ఇచ్చే స్థానం ఆయనది. అయితే ఇంతటి విశ్వాసపాత్రుడైన వ్యక్తికి కఠినమైన శిక్ష పడిందనే కథ మాత్రం చరిత్రలో చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తిమ్మరుసు కళ్లు పీకేశారనే కథ ప్రజల్లో బాగా నమ్మకం. ఇది నిజంగా జరిగిందో లేదో మాత్రం ఎంతో మందికి తెలియదు.
24
యువరాజు మరణించడంతో
తిమ్మరుసుకు శిక్ష పడటానికి కారణం దేవరాయలు కొడుకు అంశమేనని చెబుతారు. శ్రీ కృష్ణదేవరాయలుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ యువరాజు అకస్మాత్తుగా మరణించాడు. ఈ మరణం సహజమా? లేక విషప్రయోగమా? అనే అనుమానాలు రాజసభలో చర్చకు వచ్చాయి. ఈ ఘటన వల్ల దేవరాయలు తీవ్రంగా బాధపడ్డడు. అప్పుడు రాజసభలో ఉన్న తిమ్మరుసు శత్రువులు కొందరు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారని చారిత్రకారుల అభిప్రాయం. తిమ్మరుసు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కొందరిలో అసూయ పెరిగింది. ఆ అసూయతో యువరాజు మరణానికి తిమ్మరుసే కారణమని దేవరాయలకు చెప్పారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న అతను ఆ విషయాన్ని నమ్మేశాడు. కనీసం అది నిజమా లేదా అనేది విచారణ చేయలేదు.
34
పాపం తిమ్మరుసు
ఈ ఆరోపణలు నిజమని నమ్మిన దేవరాయలు తిమ్మరుసు శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. తిమ్మరుసుకు శిక్షగా అతని కళ్లు పీకించారని చెప్పే కథలు వినిపించాయి.అయితే దీనిపై స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. అప్పటి శాసనాలు, విదేశీ ప్రయాణికుల రచనలు, రాజకోర్టు రికార్డుల్లో ఈ శిక్ష గురించి ఖచ్చితమైన ఏవీ కనిపించలేదు. అందుకే దీన్ని జానపద కథగా కొట్టిపడేసే చారిత్రకారులు ఉన్నారు. తిమ్మరుసును ముందుగా రాజసభ నుంచి తొలగించి నిర్బంధంలో ఉంచి ఆ తరువాత శిక్షించడి ఉండవచ్చని అంటున్నారు. లేదా శిక్షగా జైలు పాలు చేసి ఉంటారని, కళ్లు తొలగించి ఉండరనే వాదన కూడా ఉంది. కానీ ప్రజల్లో మాత్రం కళ్లు పీకించారనే అభిప్రాయం ప్రజల్లో స్థిరపడిందని భావిస్తున్నారు.
తర్వాత కాలంలో తిమ్మరుసు నిర్దోషి అని తేలింది. దీంతో శ్రీ కృష్ణదేవరాయలు తీవ్రంగా పశ్చాత్తాపం పడ్డాడనే వాదన కూడా ఉంది. న్యాయానికి కట్టుబడి ఉన్న రాజు ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే అతని మనసు తీవ్రంగా బాధపడుతుంది. ఇదే పరిస్థితి దేవరాయలుకు ఎదురైంది. అయినప్పటికీ ఈ సంఘటన రాజ్య రాజకీయాల్లో ఉన్న కుట్రలు, అధికార పోరాటాలను చూపించేందుకు ఉదాహరణగా నిలుస్తుంది. తిమ్మరుసు కళ్లు పీకించారన్న కథ చరిత్ర కంటే కథనాలకు దగ్గరగా ఉన్నా, అది విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఒక విషాద ఘట్టంగా అక్కడి ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.