USA Coconut Price: మన దగ్గర కొబ్బరి బొండం రేటు ఎంతుంటుంది? ఏ రూ.40, రూ.50 ఉంటుంది. దానికే బేరమాడి మరీ కొంటాం. కానీ అమెరికాలో ఒక కొబ్బరి బొండం ధర ఎంతుంటుందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంతే గాలి అని.
ఇండియాలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు. రూ.40, రూ.50, రూ.60 కి సేల్ చేస్తుంటారు. అదే కేరళ కొబ్బరి అయింతే ఇంకొంచెం ధర ఉంటుంది. అయినా రూ.100 దాటదు. కానీ అమెరికాలో మాత్రం కొబ్బరి బొండం ఒక లగ్జరీ డ్రింక్ అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే అక్కడ ఒక బొండం ధర 10 డాలర్లు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారు రూ.950 నుంచి రూ.960.
26
అమెరికాలో కొబ్బరి సాగు ఎందుకు తక్కువ?
కొబ్బరి చెట్లు పెరగాలంటే వేడి, తేమతో కూడిన వాతావరణం కావాలి. కానీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పుడూ చలిగానే ఉంటుంది. ఫ్లోరిడా, హవాయి వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొబ్బరి చెట్లు పెరుగుతాయి. ఇది దేశీయ అవసరాలకు సరిపోదు. అందుకే అమెరికా 90% కొబ్బరికాయలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది.
36
ఇంపోర్ట్ ఖర్చులు
అమెరికాకు అవసరమైన కొబ్బరి బొండాలను ఎక్కువగా థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, భారత్ నుంచి ఎగుమతి చేస్తారు. ఇవి వేల కిలోమీటర్లు సముద్ర మార్గంలో ప్రయాణిస్తాయి. షిప్పింగ్ ఛార్జీలు, కంటైనర్ ఖర్చులు, ప్యాకింగ్, ముఖ్యంగా బొండాలు పాడవకుండా ఉండేందుకు అవసరమైన 'కోల్డ్ స్టోరేజ్' ఖర్చులు. దీనివల్ల అమెరికాలో కొబ్బరి బొండాల ధర ఎక్కువ.
భారత్‌తో పోలిస్తే అమెరికాలో కార్మికుల కూలీ (లేబర్ కాస్ట్) చాలా ఎక్కువ. ఓడల నుంచి బొండాలను దించడం, ట్రక్కుల్లో ఎక్కించడం, సూపర్ మార్కెట్లలో సర్దడం వరకు ప్రతి దశలోనూ ఎక్కువ జీతాలు చెల్లించాలి. వీటికి ఇంపోర్ట్ డ్యూటీ, షాపుల అద్దె, కరెంట్ బిల్లులు కూడా తోడవడంతో రూ.1000 దాటిపోతుంది.
56
మన దగ్గర ఎందుకు ధర తక్కువ?
ప్రపంచంలోనే కొబ్బరికాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి పంట విరివిగా పండుతుంది. దేశీయంగానే ఉత్పత్తి అవుతుండటంతో రవాణా ఖర్చు చాలా తక్కువ. ఎలాంటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండవు. అందుకే మనకు తాజాగా ఉండే కొబ్బరి బొండాలు చౌకగా దొరుకుతాయి.
66
నెటిజన్ల కామెంట్లు
అమెరికాలో 10 డాలర్లకు కొబ్బరి బొండం అమ్ముతున్న వీడియో వైరల్ అయ్యాక, సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఆ డబ్బుతో ఇండియాలో ఓ కుటుంబం మొత్తం చాలాసార్లు బొండాలు తాగొచ్చు" అని ఒకరు కామెంట్ చేశారు. విదేశాలకు వెళ్తేనే మన దగ్గర దొరికే వస్తువుల విలువ తెలుస్తుంది" అని మరొకరు కామెంట్ చేశారు.
భారత్‌లో కొబ్బరి సాగు సులభం కాబట్టి ధర తక్కువ. కానీ అమెరికాలో సాగు చాలా తక్కువ కాబట్టి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. దిగుమతి ఖర్చులు, పన్నులు, ఇతర ఖర్చుల వల్ల అక్కడ ఒక్కో బొండం ధర 10 డాలర్లకు (సుమారు రూ.950) చేరుకుంది. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంతే గాలి, పిండి కొద్దీ రొట్టె అని. అమెరికాలో లక్షల్లో ఆదాయం వచ్చినా ఆచితూచి ఖర్చులు పెట్టాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.