Goods Train : గూడ్స్ ట్రైన్ బోగీలకు కనిపించే ఈ స్టీరింగ్ లాంటి నిర్మాణం ఏమిటి? దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు?

Published : Nov 10, 2026, 01:56 PM IST

సరుకుల రవాణాకు ఉపయోగించే గూడ్స్ ట్రైన్ ను పరిశీలిస్తే ప్రతి బోగీకి స్టీరింగ్ లాంటి నిర్మాణం కనిపిస్తుంది… ఇది ఏమిటి, దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలేసా?

PREV
14
గూడ్స్ ట్రైన్ బోగీలకు ఈ వీల్ ఎందుకుంటుంది?

ప్యాసింజర్ రైలు కంటే గూడ్స్ ట్రైన్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఎక్కువ వాగన్స్ కలిగి ఉంటుంది కాబట్టి పట్టాలపై పరుగుతీస్తుంటే చాలామంది ఆసక్తిగా చూస్తుంటారు. కొన్నిసార్లు రైల్వే స్టేషన్లలో ఆగివున్న గూడ్స్ ట్రైన్స్ కనిపిస్తుంటాయి... వాటిని గమనిస్తే ప్రతి వ్యాగన్‌కు స్టీరింగ్ లాంటి ప్రత్యేక నిర్మాణం కనిపిస్తుంటుంది. ఇది ఏమిటి? దీని ఉపయోగం ఏమిటి? అనే డౌట్ చాలామందికి వస్తుంది. మరి అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

24
గూడ్స్ ట్రైన్ వ్యాగన్లకు ఉండే ఆ నిర్మాణం ఏమిటి?

గూడ్స్ ట్రైన్ వ్యాగన్లకు ఒకవైపు చక్రం లేదా స్టీరింగ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఇది వ్యాగన్‌కు అమర్చిన హ్యాండ్ బ్రేక్ వ్యవస్థలో ఒక భాగం. దీన్ని తిప్పడం ద్వారా ఆ వ్యాగన్‌కు సంబంధించిన బ్రేకులను మాన్యువల్‌గా అప్లై చేయవచ్చు. అందుకే దీనిని హ్యాండ్ బ్రేక్ వీల్ లేదా హ్యాండ్ బ్రేక్ హ్యాండిల్ అని పిలుస్తారు. ఇది గూడ్స్ ట్రైన్ లో వస్తువుల లోడింగ్, అన్ లోడింగ్ సమయంలో ఉపయోగపడుతుంది.

రైలుకు బ్రేకులు ఎలా పనిచేస్తాయి?

సాధారణంగా ప్రస్తుతం ఉపయోగించే అన్ని రైళ్లలో ఎయిర్ బ్రేక్ వ్యవస్థ ఉంది... గూడ్స్ ట్రైన్స్ లో కూడా ఇదే బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. రైలు ఇంజిన్‌లోని కంప్రెసర్ ద్వారా గాలిని ఒత్తిడితో నిల్వ చేసి, బ్రేక్ పైపుల ద్వారా అన్ని వ్యాగన్లకు చేరవేస్తారు. లోకో పైలట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా రైలులోని వ్యాగన్లకు బ్రేకులు పనిచేస్తాయి. దీనివల్ల వందల మీటర్ల పొడవున్న గూడ్స్ ట్రైన్‌ను కూడా నియంత్రించడానికి వీలవుతుంది.

అయితే కేవలం ఎయిర్ బ్రేకులపైనే ఆధారపడకుండా ప్రతి వ్యాగన్‌కు విడిగా హ్యాండ్ బ్రేక్ సదుపాయం కూడా ఉంటుంది. రైలు ఇంజిన్ నుంచి విడిపోయినప్పుడు లేదా ఎయిర్ బ్రేక్ వ్యవస్థలో గాలి ఒత్తిడి అందుబాటులో లేనప్పుడు వ్యాగన్ కదలకుండా ఉంచడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

34
ఈ హ్యాండ్ బ్రేక్ వీల్ ఎలా పనిచేస్తుంది?

వ్యాగన్‌కు కనిపించే స్టీరింగ్ లాంటి చక్రాన్ని తిప్పినప్పుడు దానికి అనుసంధానంగా ఉండే యాంత్రిక వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా బ్రేక్ రాడ్లు, లింకేజీలు కదిలి వ్యాగన్ చక్రాలపై ఉండే బ్రేక్ షూలను బిగిస్తాయి. దీంతో చక్రాలపై ఒత్తిడి ఏర్పడి వ్యాగన్ కదలకుండా నిలిచిపోతుంది.

అదే చక్రాన్ని వ్యతిరేక దిశలో తిప్పడం ద్వారా హ్యాండ్ బ్రేక్‌ను విడుదల చేయవచ్చు. అయితే ఇది సాధారణంగా మాన్యువల్‌గా పనిచేసే వ్యవస్థ. రైలు ప్రయాణ సమయంలో లోకో పైలట్ ఉపయోగించే ఎయిర్ బ్రేక్‌లకు ఇది భిన్నంగా ఉంటుంది.

44
గూడ్స్ ట్రైన్లలో హ్యాండ్ బ్రేక్ ఎందుకు అవసరం?

గూడ్స్ రైళ్లలో బొగ్గు, ఇనుము, సిమెంట్, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి అనేక రకాల సరుకులను రవాణా చేస్తుంటారు. వీటిని రైల్వే యార్డుల్లో లోడింగ్, అన్‌లోడింగ్ చేసే సమయంలో వ్యాగన్లు కదలకుండా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంజిన్‌ను వ్యాగన్ల నుంచి వేరు చేసినప్పుడు ఈ అవసరం మరింత పెరుగుతుంది.

ఉదాహరణకు ఒక గూడ్స్ ట్రైన్‌లో 40 లేదా 50 వ్యాగన్లు ఉన్నాయనుకుందాం. వాటిని ఒకచోట నిలిపి సరుకులను దించుతున్నప్పుడు గాలి ఒత్తిడితో పనిచేసే ఎయిర్ బ్రేక్ వ్యవస్థపై మాత్రమే ఆధారపడలేరు. ఎందుకంటే ఇంజిన్ వేరు చేసిన తర్వాత బ్రేక్ పైపుల్లో అవసరమైన గాలి ఒత్తిడి కొనసాగకపోవచ్చు. అలాంటి సమయంలో వ్యాగన్లకు హ్యాండ్ బ్రేకులు వేయడం ద్వారా అవి వాటి స్థానంలోనే ఉండేలా చేస్తారు.

ముఖ్యంగా వాలు ఉన్న పట్టాలపై నిలిపిన వ్యాగన్లు వాటంతట అవే కదిలే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హ్యాండ్ బ్రేక్ చాలా కీలకంగా పనిచేస్తుంది. అయితే ఎన్ని వ్యాగన్లకు బ్రేకులు వేయాలి అనేది రైలు బరువు, పట్టాల వాలు, రైల్వే భద్రతా నిబంధనలను బట్టి నిర్ణయిస్తారు.

స్టీరింగ్‌లా కనిపించినా అసలు పని వేరు..!

గూడ్స్ ట్రైన్‌లో కనిపించే ఈ చక్రం రైలును నడిపించడానికి లేదా దాని దిశను మార్చడానికి ఉపయోగపడదు. వ్యాగన్‌ను ఒకచోట సురక్షితంగా నిలిపి ఉంచడానికి ఉపయోగించే హ్యాండ్ బ్రేక్ వ్యవస్థలో ఇది ప్రధాన భాగం. రైల్వే రవాణాలో చిన్నగా కనిపించే ఈ నిర్మాణం కూడా ఎంతో కీలకమైన భద్రతా బాధ్యతను నిర్వహిస్తుందన్నమాట.

Read more Photos on
click me!

Recommended Stories