చిన్నప్పటి నుంచి సప్త సముద్రాలు అనే మాట వింటూనే ఉంటాం. సినిమాల్లో, పాటల్లో, కథల్లో కూడా ఈ పదం తరచూ కనిపిస్తుంది. అయితే నిజంగా ప్రపంచంలో ఏడు సముద్రాలే ఉన్నాయా? నాలుగు, ఐదు సముద్రాలు కాకుండా ఏడు అనే సంఖ్యకు ప్రత్యేకత ఏంటి? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. నిజానికి ఏడు సముద్రాలు అనేది ఖచ్చితమైన భౌగోళిక లెక్క కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉన్న చారిత్రక పదం. ప్రాచీన గ్రీకులు, రోమన్ల కాలంలో ఏజియన్ సముద్రం, అడ్రియాటిక్ సముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, కాస్పియన్ సముద్రం, పర్షియన్ గల్ఫ్లను కలిపి ఏడు సముద్రాలుగా పిలిచేవారు. ఆ కాలంలో వ్యాపార మార్గాలు, తమకు తెలిసిన జలమార్గాల ఆధారంగా ఈ జాబితా మారుతూ ఉండేది.