Sabarimala Irumudi: ఇరుముడిలో ఏముంటాయి? ఇరుముడికి అయ్యప్పకు సంబంధమేంటి? అసలు సీక్రెట్ ఇదే

Published : Aug 20, 2026, 02:52 PM IST

Sabarimala Irumudi: శబరిమల అయ్యప్ప స్వామికి సమర్పించే ఇరుముడిలో ఏముంటాయో మీకు తెలుసా? అసలు ఇరుముడికి అయ్యప్పకు సంబంధం ఏంటి? ఇరుముడి ప్రాధాన్యం, దాని వెనుక ఉన్న అసలు రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
అయ్యప్ప ఇరుముడిలో ఉండే ఆ రెండు మూటల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి?

అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పంబ నుంచి శబరిమల కొండపైకి వెళ్లే భక్తులు తప్పనిసరిగా తలపై పవిత్రమైన మూటను ధరిస్తారు. దాన్నే ఇరుముడి లేదా ఇరుముడి కట్టు అంటారు. మలయాళంలో "ఇరు" అంటే రెండు, "ముడి" అంటే మూట లేదా కట్టు అని అర్థం. ఈ ఇరుముడి అనేది కేవలం పూజా సామగ్రిని తీసుకెళ్లే ఒక సంచి మాత్రమే కాదు. ఇది 41 రోజుల పాటు కఠినంగా ఉండే అయ్యప్ప స్వామి దీక్ష, నెయ్యాభిషేకం, పవిత్ర 18 మెట్లతో బలమైన సంబంధం కలిగిన అత్యంత ఆధ్యాత్మిక ప్రతీక.

శబరిమల ఆలయ అధికారిక వివరాల ప్రకారం, ఇరుముడి సంప్రదాయం వెనుక మణికంఠుడు పులి పాలు తీసుకురావడానికి అడవికి వెళ్లిన కథ దాగి ఉంది. నాటి ప్రయాణాన్ని స్మరించుకుంటూ భక్తులు ఇరుముడిని తలపై మోస్తూ పంపా నదిలో స్నానం చేసి శరణఘోషతో కొండ ఎక్కుతారు.

25
ఇరుముడిలో ఏమేమి ఉంటాయి?

ఇరుముడి సంకల్పాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో మొదటిది దైవిక భాగం కాగా, రెండోది భక్తుని స్వంత అవసరాల కోసం ఉపయోగపడేది.

ముందు ముడి (మున్ ముడి - దైవిక భాగం):

ఇందులో స్వామివారికి సమర్పించే పవిత్ర వస్తువులు ఉంటాయి. పీచు తీసిన కొబ్బరికాయకు పైన రంధ్రం చేసి, అందులోని నీటిని పూర్తిగా తీసేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నింపుతారు. దీనినే నెయ్య్ తేంగా (నెయ్యి కొబ్బరికాయ) అంటారు. ఇది శబరిమలలో అయ్యప్ప స్వామికి చేసే నెయ్యాభిసేకానికి చాలా ప్రధానమైనది. దీనితో పాటు పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, ధూప్‌స్టిక్స్, విభూతి, ఆవు నెయ్యి వంటి పూజా ద్రవ్యాలు ఉంటాయి. అలాగే నైవేద్యం కోసం బెల్లం, కండచక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పేలాలు, అటుకులు, తమలపాకులు, వక్కలు, నాణేలు సహా ఇతర కానుకలు ఉంచుతారు.

వెనుక ముడి (పిన్ ముడి - వ్యక్తిగత భాగం):

ఈ భాగంలో భక్తుడు అంటే స్వామి యాత్రలో తన ఆహారం కోసం తీసుకెళ్లే బియ్యం, పప్పు ధాన్యాలు, ఇతర తినుబండారాలు, వ్యక్తిగత పూజా సామగ్రిని భద్రపరుచుకుంటారు.

35
నెయ్యి కొబ్బరికాయ ప్రాధాన్యం, ఆధ్యాత్మిక తత్త్వం ఇదే

శబరిమలలో జరిగే నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి అత్యంత ముఖ్యమైన పూజా సేవ. భక్తుడు తీసుకెళ్లిన నెయ్యి కొబ్బరికాయను పగలగొట్టి, అందులోని నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు.

దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంది..

• నెయ్యి = జీవాత్మ

• అయ్యప్ప = పరమాత్మ

నెయ్యితో స్వామివారికి అభిషేకం చేయడం అంటే భక్తుడి జీవాత్మ పరమాత్మలో లీనమవుతోందని అర్థం. కొబ్బరికాయలోని నీటిని తీసి నెయ్యి నింపడం అనేది లోకాసక్తులు, అహంకారాన్ని విడిచి పవిత్రమైన భక్తితో మనసును నింపడానికి ప్రతీక. నెయ్యి తీసేసిన తర్వాత మిగిలిపోయే ఖాళీ కొబ్బరికాయను జడ శరీరం లేదా అహంకారానికి ప్రతీకగా భావించి, ఆలయం ముందు ఉండే అగ్నికుండంలో సమర్పిస్తారు.

45
అయ్యప్పకు ఇరుముడికి ఉన్న చారిత్రక సంబంధం

పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత, తన పెంచిన తండ్రి పందళ రాజర్ కోరిక మేరకు శబరిమలలో తపస్సుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాజకుమారుడైన అయ్యప్ప కొండల్లోకి వెళ్లేటప్పుడు, మార్గంలో ఆహారం, అభిషేక వస్తువుల కోసం తనతో పాటు రెండు భాగాలు కలిగిన ఒక మూటను తీసుకెళ్లాడు.

చారిత్రకంగా చూస్తే, ఒకప్పుడు శబరిమల యాత్ర అనేది దట్టమైన అడవులు, కొండల గుండా సాగే కఠినమైన పాదయాత్ర. ఆ సుదీర్ఘ ప్రయాణంలో దేవుడి పూజా సామగ్రిని ఒక భాగంలో, తమ ఆహారాన్ని మరొక భాగంలో మోసుకెళ్లడం అవసరంగా ఉండేది. ఆ ఆచారమే కాలక్రమేణా పవిత్రమైన "ఇరుముడి" సంప్రదాయంగా మారింది.

55
41 రోజుల దీక్ష.. 18 మెట్ల నియమాలు ఇవే

శబరిమల యాత్రలో 41 రోజుల మండల వ్రతం అత్యంత కీలకమైనది. భక్తులు 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటించి, బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ యాత్రకు సిద్ధమవుతారు. దీక్ష పూర్తయిన తర్వాత గురుస్వామి సమక్షంలో నిష్టగా, మంత్రోచ్ఛారణల నడుమ ఇరుముడి కట్టుకుంటారు.

శబరిమల సంప్రదాయం ప్రకారం, పవిత్రమైన పతినెట్టాంపడి (18 మెట్లు) ఎక్కడానికి ఇరుముడి తప్పనిసరి. 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని, ఇరుముడిని తలపై మోసుకొచ్చే భక్తులను మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కి సన్నిధానంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. తలపై ఉన్న ఇరుముడితో మెట్లు ఎక్కడం అనేది భక్తుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి స్వామివారికి పూర్తిగా శరణాగతి వేడుతున్నాడని సూచిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories