Generic Medicine: జనరిక్ మందులంటే చాలా మందికి తెలియదు. కానీ అవి పేదవారి కోసం పుట్టిన మందులు ఇవి. అసలు జనరిక్ మందులకు, బ్రాండెడ్ మందులకు మధ్య తేడా ఏమిటి? వేటిని జనరిక్ మందులు అంటారు?
మనం రోగాల బారిన పడినప్పుడు వాడే ప్రతి మందులోనూ వ్యాధిని తగ్గించే ఒక నిర్దిష్టమైన రసాయన పదార్థం ఉంటుంది. ఉదాహరణకు, జ్వరం తగ్గడానికి వాడే అసలైన ఔషధం పేరు 'పారాసిటమాల్'. ఒక కంపెనీ ఎన్నో ఏళ్ల పరిశోధనలు చేసి కొత్త ఔషధాన్ని కనిపెట్టినప్పుడు, దానికి పేటెంట్ హక్కులు పొంది ఒక నిర్దిష్ట వ్యాపార పేరుతో అంటే తమ బ్రాండ్ పేరుతో అమ్ముతుంది. ధర కూడా ఎక్కువ పెట్టి అమ్ముకునే అవకాశం ఆ బ్రాండెడ్ కంపెనీలకు ఉంటుంది. ఉదాహరణకు రెడ్డిస్ ల్యాబ్, అరబిందో.. ఇలా ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలే. కనిపెట్టిన మందుకు తాలూకు ఆ పేటెంట్ గడువు 20 ఏళ్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఆ సమయం గడిచిపోయాక అదే రసాయన ఫార్ములాను ఉపయోగించి ఇతర కంపెనీలు కూడా ఆ మందును తయారుచేసి అమ్మవచ్చు. అలా తయారు చేసే మందులనే 'జనరిక్ మందులు' అంటారు. వీటికి ఎలాంటి పేటెంట్ హక్కులు ఉండవు. అంతేకాదు చాలా తక్కువ ధరకే వీటిని అమ్ముతారు. బ్రాండెడ్ మందుల్లాగే ఇవి కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. కానీ ఎక్కువ బ్రాండెడ్ మందులే పనిచేస్తాయని అనుకుంటారు.
23
బ్రాండెడ్ - జనరిక్ మందుల మధ్య తేడాలు
బ్రాండెడ్ మందులకు, జనరిక్ మందులకు ప్రధాన తేడా వాటి ధర, మార్కెటింగ్ విధానంలోనే కనిపిస్తుంది. ఒక ప్రముఖ బ్రాండెడ్ మాత్రను తయారు చేసే కంపెనీ తన పరిశోధనల కోసం, వైద్యులకు ప్రచారం చేయడం కోసం, ఆకర్షణీయమైన ప్యాకింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తుంది. దాంతో ఆ మందు ధర సాధారణ ప్రజలకు భారంగా మారుతుంది. అదే జనరిక్ మందుల విషయానికి వస్తే, వీటికి ఎలాంటి పరిశోధన లేదా ప్రకటనల ఖర్చులు ఉండవు. దీనివల్ల ఇవి బ్రాండెడ్ మందుల కంటే దాదాపు 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధరకే లభిస్తాయి. పైకి కనిపించే రంగు, ఆకారం లేదా రుచిలో కొద్దిపాటి తేడాలు ఉండవచ్చేమో కానీ, లోపల ఉండే అసలైన ఔషధ పరిమాణం రెండింటిలోనూ ఒకేలా ఉంటుంది.
33
పేద ప్రజలకు ప్రయోజనం
జనరిక్ మందులు చవకగా దొరుకుతాయి. కాబట్టి వాటి నాణ్యత తక్కువగా ఉంటుందనే అపోహ ఉంది. కానీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం, బ్రాండెడ్ మందు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో, జనరిక్ మందు కూడా శరీరంలో అంతే వేగంగా కలిసి సమాన ఫలితాన్ని ఇస్తుంది. డయాబెటిస్, రక్తపోటు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో నిరంతరం మందులు వాడాల్సిన రోగులకు జనరిక్ మందులు గొప్ప వరం లాంటివి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు, జనరిక్ మందుల దుకాణాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స పొందడానికి ఇవి ఎంతో దోహదపడతాయి.