Ocean: సముద్రంలో ఇంటర్నెట్ వైర్లు ఉంటాయి. ఒక్కోసారి అవి తెగిపోవడం వంటిది జరగవచ్చు. అలా తెగిపోతే వాటిని బాగు చేయడం ఎలా? ఎలాంటి పద్ధతిని ఉపయోగించి వాటిని సరిచేస్తారు?
మనమందరం రోజువారీ పనుల కోసం వాడే ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా సముద్ర గర్భంలో వేసిన కేబుల్స్ ద్వారానే అందుతుంది. అయితే కొన్నిసార్లు ఓడల లంగర్లు తగలడం లేదా సముద్రంలో వచ్చే ప్రకృతి విపత్తుల వల్ల ఈ కేబుల్స్ తెగిపోతుంటాయి. ఇలా జరిగినప్పుడు అల్కాటెల్ సబ్‌మెరైన్ నెట్‌వర్క్స్, గ్లోబల్ మెరైన్ సిస్టమ్స్, ఆరెంజ్ మెరైన్, సబ్‌కామ్ లాంటి ప్రత్యేక సముద్ర సాంకేతిక సంస్థలు రంగంలోకి దిగి మరమ్మతులు చేస్తాయి. మన దేశానికి సొంతంగా కేబుల్ రిపేర్ ఓడలు లేకపోవడంతో, భారతీయ టెలికాం సంస్థలు విదేశీ ఏజెన్సీలపై ఆధారపడతాయి. సాధారణంగా యూఏఈ లేదా సింగపూర్ నుంచి ఈ ప్రత్యేక ఓడలు ఇక్కడికి వచ్చి మరమ్మతులు నిర్వహిస్తాయి.
23
ఏం చేస్తారు?
సముద్రం అడుగున కేబుల్ ఎక్కడ తెగిందో గుర్తించడానికి ఇంజనీర్లు ముందుగా రెండు వైపులా ఉన్న టెర్మినల్ స్టేషన్ల నుంచి ప్రత్యేక పరీక్షలు జరుపుతారు. కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించాక, రిపేర్ ఓడ అక్కడికి చేరుకుని సముద్ర లోతును బట్టి రిమోట్‌తో నడిచే వాహనాలు లేదా ప్రత్యేక కొక్కేల సాయంతో తెగిన కేబుల్‌ను పైకి లాగుతుంది. ఓడపై ఉండే నిపుణులు పాడైన భాగాన్ని కత్తిరించి, కొత్త ఆప్టికల్ ఫైబర్లను అతికించి సిగ్నల్ సరిగ్గా అందుతుందో లేదో పరీక్షిస్తారు. ఆ తర్వాత మరమ్మతు చేసిన కేబుల్‌ను తిరిగి సముద్ర గర్భంలో జాగ్రత్తగా వదులుతారు.
33
ఆ ఖర్చులు ఎవరు భరిస్తారు?
ఈ మరమ్మతులకు అయ్యే భారీ ఖర్చును ఆయా కేబుల్స్‌ను కలిగి ఉన్న టెలికాం, టెక్ దిగ్గజ సంస్థలే భరిస్తాయి. ఎయిర్‌టెల్, జియో, గూగుల్, మెటా లాంటి సంస్థలు తమ వాటా ఒప్పందాల ప్రకారం ఈ ఖర్చును పంచుకుంటాయి. ఒకవేళ ఏదైనా ఓడ లంగరు వల్ల కేబుల్ తెగినట్లు ట్రాకింగ్ డేటా ద్వారా రుజువైతే, ఆ ఓడ యజమాని నుంచే నష్టపరిహారం వసూలు చేస్తారు. అంతర్జాతీయ కేబుల్ రక్షణ కమిటీ అంచనాల ప్రకారం, ఒక్కో మరమ్మతుకు సగటున 5 లక్షల నుంచి 10 లక్షల పౌండ్ల వరకు ఖర్చవుతుంది. కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో ఈ వ్యయం 10 లక్షల నుంచి 30 లక్షల డాలర్ల వరకు కూడా చేరుకుంటుంది.