చెట్ల నుంచి రబ్బరు వస్తుంది. ఆ రబ్బరుతో తయారయ్యే టైర్లు మాత్రం నల్లగా ఉంటాయి. ఆ నలుపు రంగు ఎలా వస్తుంది? టైర్ల తయారీ గురించి తెలుసుకుంటే ఆ నలుపు రంగు రావడానికి కారణం అర్థమవుతుంది.
మన చుట్టూ ఎన్నో వాహనాలు కనిపిస్తుంటాయి. వాటిలో సైకిల్ నుంచి బస్సులు, కార్ల వరకు దాదాపు అన్ని వాహనాలకు నల్లటి టైర్లే ఉంటాయి. అయితే టైర్ల తయారీకి ఉపయోగించే సహజ రబ్బరు చెట్ల నుంచి తెల్లటి పాలలాంటి ద్రవం రూపంలో వస్తుంది. మరి తెల్లగా ఉండే రబ్బరు నల్లటి టైర్లుగా ఎలా మారుతుంది? దీని వెనుక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. రబ్బరు చెట్ల బెరడుకు చిన్న గాటు పెట్టినప్పుడు తెల్లటి పాలు లాంటి ద్రవం బయటకు వస్తుంది. దీన్నే లేటెక్స్ అంటారు. దీన్ని సేకరించి శుద్ధి చేసిన తర్వాత రబ్బరు తయారు చేస్తారు. తొలినాళ్లలో ఈ రబ్బరుతో తయారుచేసిన టైర్లు కూడా తెలుపు లేదా లేత రంగులోనే ఉండేవి.
23
టైర్ల నలుపు రంగుకు కారణం
అయితే తెల్లటి రబ్బరుతో తయారైన టైర్లలో కొన్ని సమస్యలు ఉండేవి. రోడ్లపై ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు అవి త్వరగా అరిగిపోయేవి. ఎండ వేడికి కూడా దెబ్బతినేవి. దీంతో టైర్లను మరింత గట్టిగా, ఎక్కువ కాలం మన్నేలా చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో కార్బన్ బ్లాక్ అనే నల్లటి పొడిని రబ్బరులో కలపడం మొదలుపెట్టారు. ఇది పెట్రోలియం ఉత్పత్తులను నియంత్రిత పరిస్థితుల్లో అసంపూర్ణంగా మండించడం ద్వారా తయారుచేస్తారు. 1910లో బీఎఫ్ గుడ్రిచ్ కంపెనీ టైర్ల తయారీలో కార్బన్ బ్లాక్‌ను ఉపయోగించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి టైర్ల రంగు నల్లగా మారడం మొదలైంది.
33
టైర్ల మన్నిక పెరుగుతుంది
కార్బన్ బ్లాక్ వల్ల టైర్లకు నల్లటి రంగు రావడమే కాదు.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రబ్బరుకు అదనపు బలాన్ని ఇస్తుంది. రోడ్లపై ప్రయాణించేటప్పుడు టైర్లు త్వరగా అరిగిపోకుండా కాపాడుతుంది. ఎండ నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. వాహనం వేగంగా వెళ్లేటప్పుడు టైర్లలో ఏర్పడే వేడిని బయటకు పంపడంలోనూ సాయపడుతుంది. దీంతో టైర్ల మన్నిక పెరుగుతుంది. అంతేకాదు, వాహనాల్లో స్థిర విద్యుత్ పేరుకుపోకుండా ఉండేందుకు కూడా కార్బన్ బ్లాక్ ఉపయోగపడుతుంది. అందుకే సహజంగా తెల్లగా ఉండే రబ్బరు నల్లటి టైర్లుగా మారుతోంది. టైర్లకు నల్లటి రంగు రావడానికి ప్రధాన కారణం కార్బన్ బ్లాక్ అన్నమాట!