ఏడుకొండలపై వెలసిన తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు వందల కోట్ల బంగారు ఆభరణాలు విరాళంగా ఇస్తున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ భక్తుడు ఎవరో తెలిసిపోయింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ శ్రీవారిపై తనకున్న అచంచల భక్తిని చాటుకున్నాడు... భారీ విరాళం అందజేశాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఏకంగా 121 కిలోల శ్రీవారి ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ కు అందజేసింది వర్థమాన్ కుటుంబం. ఇది తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఒకటి.
వర్ధమాన్ జైన్ తమిళనాడుకు చెందినవారు... ఈయన కుటుంబంతో కలిసి రాజధాని చెన్నైలో నివాసం ఉంటున్నాడు. అతడి విద్యాభ్యాసం చెన్నైలోనే సాగింది... లయోలా కాలేజీలో స్టాటిస్టిక్స్ లో డిగ్రీ పొందాడు. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు... యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాడు.
కొంతకాలం అమెరికాలోనే ఉన్న వర్దమాన్ స్వదేశానికి తిరిగివచ్చి ఉద్యోగం చేశాడు... అనంతరం హెల్త్ కేర్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. యాక్సెస్ హెల్త్ కేర్ సంస్థను స్థాపించాడు... ప్రస్తుతం ఈ సంస్థ వైస్ ఛైర్మన్ గా కొనసాగుతున్నాడు. హెల్త్ కేర్ తో పాటు ఫైనాన్స్, సివిల్ ఇంజనీరింగ్ రంగాల్లోనూ అనుభవం ఉంది... ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు వర్ధమాన్.
కేవలం వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించడమే కాదు పేదలకోసం డబ్బులు ఖర్చుచేసే మంచిమనసు కలిగిన వ్యక్తి వర్ధమాన్. ఇతడు శ్రీ సరితా జైన్ ఫౌండేషనల్ ట్రస్ట్ ను ఏర్పాటుచేసి ప్రతిభావంతులైన పేద పిల్లలను చదివించడంలో సహాయం చేస్తున్నాడు. అలాగే పేదలకు ఆకలి తీర్చడంతో పాటు ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సేవలు అందిస్తున్నాడు. ఆవిష్కార్ పేరిట పేద యువతకు స్కిల్ డెవలప్మెంట్ సేవలు కూడా అందిస్తున్నాడు వర్ధమాాన్ జైన్.