
కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. ఉద్యోగులు ముందుగా చూసేది క్యాలెండర్లో సెలవులు ఎన్ని ఉన్నాయనే. ఏ పండగకు లాంగ్ వీకెండ్ వస్తుంది? వరుసగా సెలవులు తీసుకుని ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చా? అని చూస్తుంటారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేవారు ముందుగానే హాలిడే క్యాలెండర్ చూసుకుని తమ వెకేషన్ ప్లానింగ్ చేసుకుంటుంటారు. పండగ సెలవులు, శని, ఆదివారాలు కలిసొస్తే అదనంగా సెలవు తీసుకోకుండానే ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు.
అయితే 2027 ఏడాది క్యాలెండర్ చూస్తే ఉద్యోగులకు కొంత నిరాశ తప్పేలా లేదు. వచ్చే ఏడాది కొన్ని ముఖ్యమైన పండగలు, జాతీయ సెలవులు శని, ఆదివారాల్లోనే వస్తున్నాయి. ఇలా సాధారణంగా ఆఫీసులకు సెలవుండే వీకెండ్‌తో ఈ ప్రత్యేక సెలవులు కలిసిపోనున్నాయి. మరి వచ్చే ఏడాది వీకెండ్ లో వస్తున్న పండగలు, పర్వదినాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
శని, ఆదివారాల్లోనే పండగలు
2027లో మహా శివరాత్రి నుంచి క్రిస్మస్ వరకు పలు ముఖ్యమైన పండగలు వారాంతపు సెలవు రోజుల్లోనే వస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు పండగ సెలవులు మిస్ అవ్వనున్నారు. సాధారణంగా పండగ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఉంటుంది... కానీ అది ఏ శనివారమో లేక ఆదివారమో వస్తే వీకెండ్ సెలవుతో కలిసిపోతుంది... అదనంగా మరో సెలవు లభించదు.
ముఖ్యంగా ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో వారానికి రెండు రోజులు సెలవు ఉండే ఉద్యోగులకు ఇది కొంత నిరాశ కలిగించే అంశమే. 2027లో ఇలా పలు పండగలు వారాంతాల్లో రావడంతో వీకెండ్ పొడిగింపు (లాంగ్ వీకెండ్) అవకాశాలు కూడా తగ్గనున్నాయి.
మార్చి 6 (శనివారం) – మహా శివరాత్రి
2027 మార్చి 6న మహా శివరాత్రి వస్తోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ పర్వదినం శనివారం రావడంతో చాలా మంది ఉద్యోగులకు అదనపు సెలవు ప్రయోజనం ఉండదు. వీకెండ్ సెలవుతోనే శివరాత్రి ముగియనుంది... ఓ సెలవు మిస్ అయినట్లే.
మే 1 (శనివారం) – మేడే (కార్మిక దినోత్సవం)
కార్మిక దినోత్సవం (లేబర్ డే) లేదా మేడే కూడా 2027లో శనివారమే వస్తోంది. కార్మికులు, ఉద్యోగుల హక్కులకు గుర్తుగా జరుపుకునే ఈ రోజున సాధారణంగా సెలవు ఉంటుంది...కానీ శనివారం రావడంతో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు మరో సెలవు పోయినట్లే.
ఆగస్టు 15 (ఆదివారం) – మూడు పర్వదినాలు
2027 ఆగస్టు 15న ఆదివారం వస్తోంది. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేషనల్ హాలిడే. అలాగే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మిలాదున్ నబీ కూడా ఈరోజే... అంటే మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం. ఇక పార్శీ నూతన సంవత్సరం కూడా ఇదేరోజు. ఇలా మూడు ముఖ్యమైన పర్వదినాలు ఒకే తేదీలో ఉన్నాయి. అయినా ఈరోజు ఆదివారం కావడంతో ఉద్యోగులకు ప్రత్యేక సెలవు లేనట్లే... సండే హాలిడే తోనే సరిపెట్టుకోవాలి.
వినాయక చవితి అనేది దేశవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండగ... తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. ఇళ్లలోనే కాదు వీధుల్లో గణనాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అయితే 2027లో వినాయక చవితి సెప్టెంబర్ 4న శనివారం రావడంతో ఉద్యోగులకు పండగ సెలవు, వీకెండ్ సెలవు ఒకే రోజు కానున్నాయి.
అక్టోబర్ 2 (శనివారం) – గాంధీ జయంతి
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న జరుపుకుంటాం. జాతీయ సెలవు దినమైన గాంధీ జయంతి 2027లో శనివారం వచ్చింది. దీంతో సాధారణంగా సెలవు లభించే ఈ రోజు కూడా వీకెండ్లో కలిసిపోనుంది.
అక్టోబర్ 9 (శనివారం) – దసరా
తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండగల్లో దసరా ఒకటి. కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకోవడం, సొంత ఊళ్లకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం వంటివి ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. అయితే 2027లో దసరా అక్టోబర్ 9, శనివారం రావడంతో ఉద్యోగులకు అదనపు సెలవు ప్రయోజనం ఉండదు.
అక్టోబర్ 30 (శనివారం) – దీపావళి
దీపావళి పండగ కూడా 2027లో వారాంతంలోనే వస్తోంది. అక్టోబర్ 29 లేదా 30 తేదీల్లో దీపావళి ఉండే అవకాశముంది. అక్టోబర్ 30న పండగ సెలవు ప్రకటిస్తే మాత్రం శనివారం వీకెండ్ సెలవుతో కలిసిపోతుంది. దీంతో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు మరో సెలవు మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది.
సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్ జయంతి 2027 నవంబర్ 14న ఆదివారం వచ్చింది. ఈ పర్వదినం కూడా వారాంతపు సెలవు రోజునే రావడంతో ఉద్యోగులకు ప్రత్యేకంగా మరో రోజు సెలవు లభించే అవకాశం ఉండదు.
డిసెంబర్ 25 (శనివారం) – క్రిస్మస్
ఏడాది చివర్లో ఉద్యోగులు ఎక్కువగా ఎదురుచూసే పండగల్లో క్రిస్మస్ ఒకటి. కుటుంబంతో సమయం గడపడం, ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం, కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవ్వడం వంటివి ఈ సమయంలో చేస్తుంటారు. కానీ 2027లో క్రిస్మస్ డిసెంబర్ 25, శనివారం రావడంతో మరో సెలవు వీకెండ్లోనే కలిసిపోనుంది.
2027లో ముఖ్యమైన పండగలు ఇలా శని, ఆదివారాల్లో రావడంతో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు లాంగ్ వీకెండ్స్ తగ్గనున్నాయి. పండగలు, జాతీయ సెలవులు వీకెండ్‌తో కలిసిపోవడం వల్ల అదనపు సెలవులు ఉపయోగించుకునే వీలు ఉండదు. అయితే ఆయా సంస్థలు ప్రకటించే హాలిడే క్యాలెండర్, ప్రత్యామ్నాయ సెలవుల విధానం ఆధారంగా కొన్ని చోట్ల ఉద్యోగులకు వెసులుబాటు లభించవచ్చు.
మొత్తానికి 2027 క్యాలెండర్ ఉద్యోగులకు సెలవుల పరంగా పెద్దగా కలిసివచ్చేలా కనిపించడం లేదు. పండగల కోసం సొంత ఊళ్లకు వెళ్లాలన్నా, కుటుంబంతో టూర్లు ప్లాన్ చేసుకోవాలన్నా ముందుగానే సెలవులను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్‌తో కలిసిపోయే పండగల కారణంగా వచ్చే ఏడాది సెలవుల విషయంలో ఉద్యోగులు కొంత నిరాశ చెందే అవకాశం ఉంది.