అమెరికా ఆర్మీ జవాన్స్ కి లభించే టాప్ 3 బెనిఫిట్స్..
"నేను ఒక అమెరికన్ సైనికుడిని పెళ్లి చేసుకున్నాను. ఒక మిలిటరీ ఫ్యామిలీగా మాకు లభిస్తున్న టాప్ 3 బెనిఫిట్స్ ఇవే! సాధారణంగా చాలామందికి తెలియని ఎన్నో అద్భుతమైన అవకాశాలు సైనిక సేవలో దాగి ఉన్నాయి" అంటూ @meghamitch అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆసక్టికర వీడియో పెట్టింది మేఘా. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది నెటిజన్లు తిలకించారు. ఈ వీడియోలో మేఘా, ఆమె భర్త ఇద్దరూ కలిసి అమెరికా ప్రభుత్వం సైనిక కుటుంబాలకు ఇచ్చే ముఖ్యమైన రక్షణ, సౌకర్యాల గురించి చాలా క్లియర్‌గా వివరించారు.
1. ఉచిత ఉన్నత విద్య
అమెరికా వ్యాప్తంగా ఉన్న ఏ స్కూల్ లేదా కాలేజీలోనైనా యువ సైనికులు ఉన్నత విద్యను పూర్తిగా ఉచితంగా అభ్యసించవచ్చు. అంతేకాకుండా చదువుకోవడానికి వెళ్తున్నందుకు ప్రోత్సాహకంగా ఆర్మీ నుంచే నెలకు 1,000 డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.83,000 పైనే) ప్రత్యేక అలవెన్స్‌గా కూడా అందిస్తారని మేఘా భర్త వెల్లడించారు.
2. జీవితాంతం ఉచిత వైద్యం
ఆరోగ్య సంరక్షణ విషయంలో అమెరికా ఆర్మీ తమ సిబ్బందికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుంది. దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా, ఎలాంటి చిన్న లేదా పెద్ద చికిత్సలకైనా రూపాయి ఖర్చు లేకుండా వైద్యాన్ని పొందవచ్చు. ఈ సేవలు వారి జీవితాంతం ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.
3. అత్యంత సులభంగా సొంత ఇళ్లు
విదేశాలలో ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం ఎంతో ఖరీదైన వ్యవహారం. కానీ అమెరికన్ సైనిక కుటుంబాలకు ఇది చాలా సులభం. ప్రాపర్టీ కొనుగోలుకు అయ్యే కేవలం టెక్నికల్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. సుమారు 140 డాలర్లు (భారతీయ రూపాయిల్లో దాదాపు రూ.13,000) చెల్లిస్తే ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ పేపర్లు, తాళాలు చేతికి వస్తాయని ఈ అమెరికన్ ఆర్మీ జంట సంతోషంగా పంచుకుంది.