
తమిళనాడులోని మధురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం రోజురోజుకు ముదురుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపత్తూన్ అనే పురాతన రాతి స్తంభంపై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు అదేశించినప్పటికీ అధికారులు వెలిగించకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… ప్రభుత్వ ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఆలయ ట్రస్టీల బోర్డును సస్పెండ్ చేసి, ఆలయ నిర్వహణ బాధ్యతలను ఇద్దరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకు అప్పగించింది. అంతేకాదు కొండపై భద్రతా బాధ్యతలను కేంద్ర బలగాలకు (CRPF) అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపత్తూన్ పై దీపం వెలిగించకపోవడంపై నిన్న (నవంబర్ 27, శుక్రవారం) సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిగింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల వివరణలను పరిశీలించిన కోర్టు, ఈ వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగా ఆదేశాలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్దారించింది. దీంతో నవంబర్ 28న (శనివారం) దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద వెలిగించిన జ్యోతి ఇంకా కొనసాగుతుంటే దాని నుంచే దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలని.. లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ, సంబంధిత పూజారులతో చర్చించి దీపం వెలిగించే సమయాన్ని నిర్ణయించాలని రిటైర్డ్ న్యాయమూర్తులకు సూచించింది సుప్రీంకోర్టు.
రిటైర్డ్ న్యాయమూర్తులకు కీలక బాధ్యతలు
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఆలయ ట్రస్ట్ బోర్డు వ్యవహరించిన తీరుపై కూడా అత్యున్నత ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్టీల బోర్డు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆలయ పరిపాలన, నిర్వహణ బాధ్యతలను రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్లకు అప్పగిస్తూ రిసీవర్లుగా నియమించింది. వీరు ఆలయ నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకుని, కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఆలయ సంప్రదాయాలు, పూజా విధానాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పరిపాలన కొనసాగించాలని ఆదేశించింది.
దీపత్తూన్ పై దీపం వెలిగించే విషయంలో వివాదం తలెత్తడం, స్థానిక పోలీసు యంత్రాంగం కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోయిందనే అభిప్రాయంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపరంకుండ్రం కొండతో పాటు ఆలయం, దర్గా పరిసరాల భద్రతను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు అప్పగించింది.
కొండపై ఉన్న ఆలయం, దర్గా రెండింటికీ వచ్చే భక్తులు తమ ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా భద్రత కల్పించాలని ఆదేశించింది. దర్గాకు 50 మీటర్ల పరిధిలో రక్షణ చర్యలు కొనసాగించాలని, దీపం వెలిగించే కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ప్రాథమికంగా భావిస్తూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మధురై జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. నవంబర్ 24న దీపం వెలిగించే కార్యక్రమానికి ముందు అధికారులు జరిపిన సమాచార మార్పిడి, ఫోన్ సంభాషణలు, సందేశాలు, ఈమెయిల్స్ వంటి వివరాలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించిందా? అనే కోణంలోనూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని, వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడం లేదా నిర్లక్ష్యం చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 15న జరగనుంది.
తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరంకుండ్రం కొండ హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. అలాగే ఈ కొండపై హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా దర్గా కూడా ఉంది... అంటే ఇది ముస్లింలకు కూడా పవిత్ర స్థలం. ఇలా రెండు మతాలకు చెందిన ఈ కొండ చాలా సున్నితమైన ప్రాంతం... అందుకే ఈ ప్రాంతంలో కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం నెలకొంది.
ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరుపరంకుండ్రం కొండపై ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద దీపం వెలిగించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే కొండపై ఉన్న పురాతన రాతి స్తంభం దీపత్తూన్ వద్ద కూడా దీపం వెలిగించాలని హిందూ సంఘాలు, కొందరు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్తంభం దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉండటంతో అక్కడ దీపం వెలిగించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సంప్రదాయ దీపం వెలిగించే స్థానం విషయంలో వివాదం మొదలైంది.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు..
దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలనే అంశంపై 2025 డిసెంబర్లో మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీపస్తంభం దర్గాకు 50 మీటర్లకు పైగా దూరంలో ఉందని పేర్కొంటూ అక్కడ దీపం వెలిగించాలని సూచించారు. అనంతరం 2026 జనవరి 6న హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే కార్యక్రమాన్ని పోలీసు అధికారులు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)తో సమన్వయం చేసుకుని నిర్వహించాలని సూచించింది.
ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఈ వివాదంపై ఉత్తర్వులు జారీ చేసింది. 2026 కార్తీక దీపోత్సవం సందర్భంగా నవంబర్ 24న ఒక్కసారి దీపత్తూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతించింది. అయితే ఈ అనుమతి సాధారణ ప్రజలకు కాకుండా, అధికారికంగా నియమించిన బృందానికి మాత్రమే పరిమితం చేసింది.
కోర్టు ఆదేశాలున్నా వెలగని దీపం.. ముదిరిన వివాదం
సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ నవంబర్ 24న దీపత్తూన్ వద్ద దీపం వెలిగించలేదు. ఆలయ అధికారులు మాత్రం సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచ్చిపిళ్లయార్ మండపం వద్దే దీపారాధన నిర్వహించారు. దీంతో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తమిళనాడు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశాయి.
ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన వివాదంతో పాటు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో నవంబర్ 28న దీపత్తూన్ వద్ద దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ వివాదంపై కోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీపం వెలిగించే స్థానం, సంప్రదాయ హక్కులు, సంబంధిత ప్రాంతంపై హక్కుల వంటి అంశాలపై తదుపరి విచారణల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.