ప్రపంచంలో భూకంపాలు వచ్చే దేశాలు కొన్ని ఉన్నాయి. భూకంపం వస్తే చాలు ఆ ప్రాంతమంతా నాశనమైపోతుంది. కానీ ఒక దేశం మాత్రం ఏటా ఎన్ని భూకంపాలు వచ్చినా అన్నివిధాలుగా ముందుకే వెళుతోంది. ఎప్పుడు దేశం నాశనం అవ్వలేదు.
ప్రపంచంలో తరచూ భూకంపాలు వచ్చే దేశాల జాబితాలో జపాన్ ముందుంటుంది. అక్కడ ఏడాదికి దాదాపు 1,500 భూకంపాలు సంభవిస్తుంటాయి. వీటిలో కొన్ని మాత్రమే ప్రజలకు బలంగా అనిపిస్తాయి. మరికొన్ని చిన్న ప్రకంపనలుగా ముగుస్తాయి. ఇటీవల జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరోసారి ఈ దేశం వార్తల్లో నిలిచింది. అసలు జపాన్‌లోనే ఇన్ని భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి ఆ దేశ భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం. భూమి పైభాగం ఒకే పొరలా ఉండదు. అది పెద్ద పెద్ద ముక్కలుగా విడిపోయి ఉంటుంది. వీటిని భూఫలకాలు అంటారు. ఈ ఫలకాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అవి ఒకదానితో మరొకటి ఢీకొన్నప్పుడు, విడిపోయినప్పుడు భూమి కంపిస్తుంది.
23
జపాన్ భూకంపాలకు ఇదే కారణం
జపాన్ పసిఫిక్ మహాసముద్రం అంచున ఉంది. ఇక్కడ నాలుగు ప్రధాన భూఫలకాలు కలుస్తాయి. పసిఫిక్, ఫిలిప్పీన్ సముద్ర, యురేషియన్, ఉత్తర అమెరికా భూఫలకాలు ఈ ప్రాంతంలో నిరంతరం కదులుతుంటాయి. ముఖ్యంగా పసిఫిక్ భూఫలకం మరో భూఫలకం కిందకు జారిపోవడం వల్ల భూమిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూకంపాలు వస్తాయి. జపాన్ ఉన్న ప్రాంతాన్ని 'రింగ్ ఆఫ్ ఫైర్' అని పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ గుర్రపు నాడా ఆకారంలో విస్తరించిన ఈ ప్రాంతంలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.
33
భారీ భవనాలు కూలవు
ఇన్ని భూకంపాలు వచ్చినా జపాన్‌లో భారీ భవనాలు ఎందుకు కూలిపోవడం లేదు? అంటే అక్కడ నిర్మాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. భూకంపాలను తట్టుకునేలా ప్రత్యేక పద్ధతుల్లో భవనాలు నిర్మిస్తారు. భూమి కంపించినప్పుడు భవనం మొత్తం కదిలేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల భవనాలపై పడే ప్రభావం తగ్గుతుంది. పాత భవనాలకు కూడా అవసరమైన మార్పులు చేస్తుంటారు. భూకంపం వచ్చిన వెంటనే ప్రజలకు హెచ్చరికలు అందించే వ్యవస్థలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. పాఠశాలలు, కార్యాలయాల్లో తరచూ భూకంపాల సమయంలో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తారు. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు జాగ్రత్తలు, పటిష్టమైన నిర్మాణాలతో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని జపాన్ నిరూపిస్తోంది.