Railway Bridge: ఈఫిల్ టవర్ కన్నా ఎత్తయిన రైల్వే బ్రిడ్జి మనదేశంలోనే ఉంది. ఆ బ్రిడ్జిపై రైలులో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బ్రిడ్జిని ఏ నదిపై నిర్మించారో తెలుసా?
భారతీయ రైల్వే చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఇంజనీరింగ్ అద్భుతం చీనాబ్ రైల్వే వంతెన. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో బక్కల్, కౌరి ప్రాంతాలను కలుపుతూ చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా సరికొత్త రికార్డు సృష్టించింది. నదీ గర్భం నుంచి ఏకంగా 359 మీటర్లు అంటే దాదాపు 1,178 అడుగుల ఎత్తులో ఇది గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తుంది. ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన సుమారు 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉండటం విశేషం.
23
21 ఏళ్ల పాటూ నిర్మించారు
కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే 272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకమైన భాగం. ఆగస్టు 2004లో మొదలైన నిర్మాణం సుమారు 21 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ తర్వాత పూర్తయింది. ఈ వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లు కాగా, నదిపై నిర్మించిన ప్రధాన ఆర్చ్ పొడవు 467 మీటర్లు. దీని నిర్మాణం కోసం దాదాపు 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. డెక్ రెండు చివర్లను కలిపే కీలకమైన "గోల్డెన్ జాయింట్" పనులను ఆగస్టు 2022లో పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జూన్ 6, 2025న అధికారికంగా ప్రారంభించారు.
33
భారీ భూకంపాలను తట్టుకుంటుంది
ఎటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా, తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలనైనా తట్టుకునేలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని డిజైన్ చేశారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులను, అతి భారీ భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే సామర్థ్యం దీనికి ఉంది. రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ వంతెనపై ప్రయాణించవచ్చు. సుమారు 120 సంవత్సరాల జీవితకాలం ఉండేలా రూపొందించిన ఈ మహా వంతెనపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు తీస్తూ, కశ్మీర్ ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తోంది.