Bangalore Rent: బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. దొరికాక దానికి అద్దె కట్టలేక, డిపాజిట్లు చెల్లించలేక మరింత కష్టాలు పడాల్సి వస్తుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ ఇదికి లక్షన్నర రూపాయల డిపాజిట్ అడగడంతో ఓ టెక్కీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
బెంగళూరులో ఇల్లు వెతకడం ఎంత కష్టమో చెప్పే మరో ఘటన ఇది. ఈ నగరంలో అద్దెలు, సెక్యూరిటీ డిపాజిట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇంటి ఓనర్ల కఠిన నిబంధనలు. దీంతో సరైన ఇల్లు దొరక్క ఐటీ ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నాడు. నగరంలో 1BHK ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే కంపెనీ ఆఫీసుకు రమ్మని పిలిచింది. దీంతో అద్దె కోసం వెతకగా ఆ సింగిల్ బెడ్ రూమ్ కు ఏకంగా ₹1.5 లక్షల డిపాజిట్ అడిగాడట ఇంటి యజమాని. దీంతో షాక్ అయిన టెకీ ఆఫీసుకు రావడం కంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశం (WFH) ఇవ్వమని కంపెనీని కోరాడు. కంపెనీ అందుకు ఒప్పుకోలేదు. ఎలాగైనా బెంగళూరు ఆఫీసుకు రావాల్సిందేనని చెప్పింది.
23
టెక్కీ ఏం చేశాడంటే
ఉద్యోగి ఎన్నిసార్లు తన పరిస్థితి చెప్పినా అభ్యర్థించినా కంపెనీ అంగీకరించలేదు. 'WFH సాధ్యం కాదు, ఆఫీసులో చేరండి లేదా ఉద్యోగం మానేయండి' అని రెండు ముక్కల్లో తేల్చి చెప్పింది. దీంతో ఆ ఉద్యోగి చివరికి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతను సోషల్ మీడియాలో తన అనుభవాన్ని రాశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు, కొంతమంది ఇంటి ఓనర్లు అద్దెకు ఉండేవారి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ చెక్ చేయడం, ఉద్యోగ వివరాలు అడగడం, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు సాధారణమైపోయిందని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
33
సోషల్ మీడియాలో వైరల్
ఈ సంఘటన వైరల్ అయిన తర్వాత, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 'బెంగళూరులో ఉద్యోగం సంపాదించడం కంటే ఇల్లు సంపాదించడమే కష్టం' అని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు నగరంలో అద్దె నియంత్రణ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనంలోని సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ఆధారంగా రాసింది. ఇందులోని వివరాలను స్వతంత్రంగా ధృవీకరించలేదు.