City of Blood: మనదేశంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో కొన్ని ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ఇండియాలో బ్లడ్ సిటీగా పిలుచుకునే నగరం ఉంది. ఆ నగరం ఏది? ఆ పేరు ఎందుకు వచ్చింది?
మన దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకమైన పేరు ఉంది. రాజస్థాన్‌లోని జైపూర్‌ను గులాబీ నగరం అని, ఉదయ్‌పూర్‌ను సరస్సుల నగరం అని పిలుస్తుంటాం. అయితే మన దేశంలో 'రక్తపు నగరం' (సిటీ ఆఫ్ బ్లడ్) అని పిలిచే ఒక ఊరు ఉందని మీకు తెలుసా? అదే అస్సాం రాష్ట్రంలోని తేజ్‌పూర్. ప్రకృతి అందాలకు, ఎత్తైన కొండలకు, పచ్చదనానికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ప్రశాంతంగా ఉండే ఈ అందమైన పట్టణానికి అంత భయంకరమైన పేరు ఎందుకు వచ్చిందో అన్న సందేహం ఎవరికైనా కలగడం సహజం. కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ దాగి ఉంది.
23
పేరు వెనుక కథ ఇది
పూర్వం ద్వాపర యుగంలో ఈ ప్రాంతాన్ని బాణాసురుడు అనే రాక్షస రాజు పరిపాలించేవాడు. అతడికి ఉష అనే అందమైన కూతురు ఉండేది. ఒకరోజు ఉష కలలో ఒక అందమైన యువకుడు కనిపించాడు. అతడిని మనసారా ప్రేమించిన ఉష, ఆ విషయాన్ని తన ప్రాణ స్నేహితురాలు చిత్రలేఖకు చెప్పింది. చిత్రలేఖ గొప్ప చిత్రకారిణి కావడంతో ఉష చెప్పిన ఆనవాళ్లను బట్టి ఆ యువకుడి బొమ్మను గీసింది. ఆ బొమ్మను చూసిన వెంటనే అతడు శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడు అని గుర్తించింది. ఆ తర్వాత చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుడిని ఉష అంతఃపురానికి తీసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన బాణాసురుడు కోపంతో రగిలిపోయి అనిరుద్ధుడిని బంధించాడు.
33
శ్రీకృష్ణుడి యుద్ధం
తన మనవడిని విడిపించుకోవడానికి శ్రీకృష్ణుడు సైన్యంతో కలిసి బాణాసురుడి రాజ్యంపైకి దండెత్తాడు. ఆ సమయంలో ఇరు పక్షాల మధ్య అత్యంత భీకరమైన యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో ఎంతోమంది వీరులు నేలకొరగడంతో ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసి ముద్దయ్యింది. సంస్కృతంలో 'తేజ' అంటే రక్తం, 'పుర' అంటే నగరం అనే అర్థాలు ఉన్నాయి. ఆ ఘోర యుద్ధానికి గుర్తుగా ఈ ఊరికి తేజ్‌పూర్ అనే పేరు స్థిరపడిపోయింది. నేటికీ ఇక్కడ బాణాసురుడు ప్రతిష్టించిన మహాభైరవ ఆలయం, అగ్నిగఢ్ కొండ, బ్రిటిష్ కాలం నాటి కోల్ పార్క్ వంటి చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.