సాధారణంగా పర్యాటకం కోసమో, ఉద్యోగాల కోసమో విదేశాలకు వెళ్తుంటారు. కానీ ఒక దేశ ప్రజలు మాత్రం కోడిగుడ్లు, చికెన్ వంటి సాధారణ కిరాణా సరుకుల కోసం పక్క దేశాలకు వెళ్తుంటారు. అసలు ఆ దేశం ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి. పర్యాటక స్వర్గధామంగా పేరున్న ఈ దేశంలో జీవన వ్యయం కూడా అదే స్థాయిలో ఆకాశాన్ని తాకుతుంటుంది. మన దగ్గర చాలా సాధారణంగా, తక్కువ ధరకే దొరికే నిత్యావసర వస్తువులు అక్కడ కొనాలంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా స్విట్జర్లాండ్ లోనే ఉంటాయి.
25
ఒక్కో గుడ్డు ₹53, కిలో చికెన్ ₹2,500
మన దేశంలో ఒక కోడిగుడ్డు ధర ఆరేడు రూపాయలు ఉంటుంది. కానీ స్విట్జర్లాండ్ లో ఒక డజను గుడ్ల ధర మన కరెన్సీలో సుమారు ₹630 నుంచి ₹650 వరకు ఉంటుంది. అంటే ఒక్కో గుడ్డు ధర దాదాపు ₹53 అన్నమాట. ఇక చికెన్ ధర వింటే కళ్ళు తిరగడం ఖాయం. అక్కడి సూపర్ మార్కెట్లలో ఒక కిలో బోన్ లెస్ చికెన్ ధర 22 నుంచి 28 స్విస్ ఫ్రాంక్స్ వరకు ఉంటుంది. మన రూపాయల్లో లెక్కిస్తే కిలో చికెన్ ధర సుమారు ₹2,100 నుంచి ₹2,700 వరకు పలుకుతుంది.
35
ధరలు ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం
స్విట్జర్లాండ్ లో గుడ్లు, చికెన్ ఇంత ఖరీదు ఉండటానికి ప్రధాన కారణం అక్కడి కఠినమైన నిబంధనలే. అక్కడ కోళ్లను ఇరుకైన బోనులలో పెంచడం పూర్తిగా నిషేధం. వాటికి విశాలమైన స్థలం, సహజమైన ఆహారం అందించాలి. దీనివల్ల పౌల్ట్రీ ఫామ్ ల నిర్వహణ ఖర్చు భారీగా పెరుగుతుంది. దీనికి తోడు స్థానిక రైతులను కాపాడుకోవడానికి విదేశాల నుంచి చౌకగా వచ్చే మాంసం, గుడ్లపై అక్కడి ప్రభుత్వం భారీగా దిగుమతి పన్నులు విధిస్తుంది.
తమ దేశంలో ధరలు మరీ ఎక్కువగా ఉండటంతో, స్విట్జర్లాండ్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక వింత అలవాటును ఎంచుకున్నారు. వారాంతాల్లో తమ కార్లు వేసుకుని పక్కనే ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు వెళ్తుంటారు. ఎందుకంటే జర్మనీలో కిలో చికెన్ కేవలం ₹800 లోపే దొరుకుతుంది. గుడ్లు కూడా సగం ధరకే లభిస్తాయి. అందుకే అక్కడి ప్రజలు కిరాణా సరుకులు, గుడ్లు, చికెన్ కోసం సరిహద్దు దాటి షాపింగ్ చేసి వస్తుంటారు. దీనిని అక్కడ 'షాపింగ్ టూరిజం' అని పిలుస్తారు.
55
ఆ అలవాటుకు ప్రభుత్వ కళ్ళెం
ప్రజలంతా ఇలా పక్క దేశాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం వల్ల స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఒక వ్యక్తి రోజుకు గరిష్ఠంగా 150 స్విస్ ఫ్రాంక్స్ విలువైన సరుకులను మాత్రమే పన్ను లేకుండా తెచ్చుకోవాలి. ముఖ్యంగా మాంసం విషయంలో ఒక వ్యక్తి కేవలం ఒక కిలో చికెన్ లేదా మాంసం మాత్రమే తీసుకురావాలి. అంతకంటే ఎక్కువ తెచ్చి అధికారులకు చెప్పకుండా దాచిపెడితే అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది, భారీగా జరిమానా విధిస్తారు.