
మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు రోడ్డుపై వాహనం ఎన్నో మలుపులు తిరగడం గమనిస్తాం. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అయితే రహదారులు పాములా మెలికలు తిరుగుతూ సాగుతాయి. కొన్నిచోట్ల ఒకటిరెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చినా వంకరటింకరగా అనేక ములుపులున్న రోడ్లు ఉంటాయి... ఇలాంటి సమయంలో నేరుగా రోడ్డు వేసి ఉంటే గమ్యస్థానాన్ని త్వరగా చేరుకుంటాం కదా అనిపిస్తుంది. మరి ఇంజినీర్లు రోడ్లను అలా నేరుగా నిర్మించకుండా వంకరటింకరగా ఎందుకు వేస్తారు? నిజంగా మలుపులు ఉండటం వల్ల ప్రయాణ దూరం పెరుగుతుందా? లేక దీని వెనుక మనకు తెలియని శాస్త్రీయ కారణాలు ఉన్నాయా?
వాస్తవానికి రోడ్డు నిర్మాణం అంటే రెండు ప్రాంతాలను కలిపే మార్గాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. వాహనాల భద్రత, భూమి స్వభావం, కొండలు, నదులు, నిర్మాణ వ్యయం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే కొన్ని రహదారులను నేరుగా నిర్మిస్తే, మరికొన్నింటిని మలుపులతో రూపొందిస్తారు. రోడ్లను వంకరటింకరగా నిర్మించడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను తెలుసుకుందాం.
పెద్దపెద్ద హైవేల నుండి గ్రామాల్లో వేసే సిమెంట్ రోడ్ల వరకు మలుపులు లేకుండా నిర్మించడం అసాధ్యం. అయితే కొన్నిసార్లు అవసరం లేకున్నా రోడ్డు మలుపులు తిరిగి ఉంటుంది... దీని వెనక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. రోడ్డు కిలోమీటర్ల దూరం మలుపులు లేకుండా పూర్తి స్ట్రెయిట్ గా ఉంటే డ్రైవింగ్ చేసేవారికి పెద్దగా పని ఉండదు. టాప్ గేర్ లో వాహనాన్ని పోనిస్తూ, స్టీరింగ్ ను పట్టుకుని రోడ్డును చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు "హైవే హిప్నాసిస్" (Highway Hypnosis) గురికావడం లేదంటే నిద్రమత్తులోకి జారుకునే ప్రమాదం ఉంది. దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
ఏమిటి హైవే హిప్నాసిస్?
ఇది డ్రైవర్లు ఎదుర్కొనే ఒక రకమైన మానసిక స్థితి. ప్రయాణంలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా, మైళ్ల దూరం రోడ్డు స్ట్రెయిట్ గా ఉన్నప్పుడు, కారు ఇంజన్ శబ్దం, రోడ్డుపై ఉండే తెల్లటి గీతలను చూస్తూ డ్రైవర్ మనస్సు ఒక రకమైన "ఆటోపైలట్ మోడ్" (Trance-like state) లోకి వెళ్ళిపోతుంది.
కళ్లు తెరిచే ఉంటాయి, చేతులు స్టీరింగ్‌ను తిప్పుతాయి, బండి కూడా కరెక్ట్‌గానే వెళ్తుంది. కానీ డ్రైవర్ మెదడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో పూర్తిగా గ్రహించలేదు. అందుకే కొన్నిసార్లు డ్రైవర్లు "గత 10-20 కిలోమీటర్లు ఎలా వచ్చానో నాకే గుర్తులేదు" అనడం మనం వింటుంటాం, ఇదే హైవే హిప్నాసిస్. ఈ స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినా లేదా ఏదైనా అడ్డంకి వచ్చినా డ్రైవర్ స్పందించే సమయం (Reaction Time) చాలా తగ్గిపోతుంది, దీనివల్ల ఘోర ప్రమాదాలు జరుగుతాయి.
ఈ హైవే హిప్నాసిస్ కు డ్రైవర్లు గురికాకుండా ఉండేదుకు కొన్నిసార్లు రోడ్డు స్ట్రైట్ గా వేసే అవకాశం ఉన్నా కాస్త మలుపులు ఉండేలా చూస్తారు. అయితే వాహనాల రద్దీ తక్కువగా ఉండే రోడ్లు మలుపులు తిరిగివున్నా డ్రైవర్లు హిప్నాసిస్ కు గురయ్యే అవకాశాలుంటాయి. అందుకే దూర ప్రయాణాలు చేసేవారు అలసటను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి సురక్షితమైన ప్రదేశంలో వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. నిద్రమత్తు వస్తే పాటలు వినడం లేదా ఇతరులతో మాట్లాడటం ద్వారా దాన్ని అధిగమించడానికి ప్రయత్నించకుండా, వాహనాన్ని సురక్షితంగా ఆపి నిద్రపోవాలి. తగినంత నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయకూడదు.
కొండలు, లోయలను దాటేందుకు
రోడ్లకు మలుపులు ఉండటానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి… వీటిలో ఒకటి భూభాగ స్వభావం. మైదాన ప్రాంతాల్లో రహదారులను వీలైనంత నేరుగా నిర్మించే అవకాశం ఉంటుంది. కానీ కొండలు, లోయలు, పెద్ద బండరాళ్లు ఉన్న ప్రాంతాల్లో అదే విధంగా రోడ్లు వేయడం సాధ్యం కాదు.
ఒక కొండను ఉదాహరణగా తీసుకుంటే... దాని దిగువ నుంచి పైకి వెళ్లేందుకు నేరుగా రోడ్డు వేస్తే చాలా ఎక్కువ వాలు ఏర్పడవచ్చు. అటువంటి రహదారిపై వాహనాలు ఎక్కడం కష్టమవుతుంది. దిగువకు వచ్చేటప్పుడు బ్రేకులపై అధిక ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా భారీ వాహనాలకు ప్రమాదం పెరుగుతుంది. అందుకే కొండల చుట్టూ మలుపులు తిరుగుతూ రహదారులను నిర్మిస్తారు. ఇలా చేయడం వల్ల రోడ్డు పొడవు పెరిగినా, వాలు తగ్గుతుంది. వాహనాలు కొండను క్రమంగా ఎక్కేందుకు, దిగేందుకు వీలవుతుంది. వీటినే సాధారణంగా ఘాట్ రోడ్లు అంటారు
ప్రమాదాలను తగ్గించడానికి రోడ్ల డిజైన్
రోడ్లను నిర్మించేటప్పుడు వాహనాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి రహదారిని పూర్తిగా నేరుగా నిర్మించడం సాధ్యం కాకపోవడానికి భూభాగం ఒక కారణమైతే, వాహనాల వేగం, మలుపుల వద్ద నియంత్రణ వంటి అంశాలు కూడా ముఖ్యమైనవే.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మలుపులు ఉన్నంత మాత్రాన రోడ్లు సురక్షితంగా మారవు. మలుపు ఎంత పదునుగా ఉంది? రహదారి వెడల్పు ఎంత? వాహనం ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? రోడ్డుపై పట్టు ఎలా ఉంది? వంటి అంశాల ఆధారంగా ప్రమాదం జరిగే అవకాశం మారుతుంది.
అందుకే ఇంజినీర్లు రహదారులను రూపొందించేటప్పుడు మలుపుల కోణం, వంపు వ్యాసార్థం, రహదారి వాలు, కనిపించే దూరం వంటి అంశాలను లెక్కిస్తారు. ముఖ్యంగా మలుపుల వద్ద డ్రైవర్లు ముందున్న రహదారిని స్పష్టంగా చూడగలిగేలా డిజైన్ చేయడం అవసరం.
చాలా పొడవైన, నేరుగా ఉండే రహదారులపై డ్రైవర్లు వేగాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ముందున్న రహదారి స్పష్టంగా కనిపిస్తుండటంతో కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడపవచ్చు. దీనివల్ల వేగ నియంత్రణ, ప్రమాద నివారణ మరింత కీలకంగా మారతాయి.
అయితే రోడ్లకు కావాలనే ప్రమాదకరమైన మలుపులు ఏర్పాటు చేయడం వేగ నియంత్రణకు సరైన పరిష్కారం కాదు. మలుపుల వద్ద వేగం తగ్గించకపోతే వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే రహదారి రూపకల్పనతో పాటు వేగ పరిమితులు, హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వంటి భద్రతా చర్యలు ఉపయోగిస్తారు. అంటే రహదారి నేరుగా ఉందా, మలుపులతో ఉందా అన్నదానికంటే దాని డిజైన్, నిర్వహణ, డ్రైవర్ ప్రవర్తన ఎక్కువ ప్రభావం చూపుతాయి.
ఖర్చులు తగ్గించేందుకు
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నేరుగా రోడ్డు వేయాలంటే ఆ మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించడం సాధ్యమా అనే విషయాన్ని పరిశీలించాలి. కొన్నిచోట్ల నివాస ప్రాంతాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, సాగుభూములు ఉండవచ్చు. మరికొన్ని చోట్ల అడవులు, చెరువులు లేదా ఇతర పర్యావరణపరంగా కీలకమైన ప్రాంతాలు ఉండొచ్చు. అలాంటి ప్రాంతాల మీదుగా రోడ్డు నిర్మించాలంటే భూమిని సేకరించడం, భవనాలకు నష్టపరిహారం చెల్లించడం, పర్యావరణ అనుమతులు పొందడం వంటి ప్రక్రియలు అవసరమవుతాయి. కొన్నిసార్లు వంతెనలు, సొరంగాలు నిర్మించాల్సి రావచ్చు. ఇవన్నీ ప్రాజెక్టు ఖర్చును పెంచుతాయి.
అందువల్ల ఇంజినీర్లు, ప్రణాళికా నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తారు. కొంత మలుపు తీసుకున్నా, నిర్మాణ వ్యయం తగ్గి, పర్యావరణ నష్టం పరిమితమై, ప్రజలకు తక్కువ ఇబ్బంది కలిగించే మార్గం ఉంటే దానిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే రోడ్డు పొడవు పెరిగిన ప్రతిసారీ ఖర్చు తగ్గుతుందని కాదు. మార్గం పొడవు, నేల స్వభావం, వంతెనలు, భూమి ధరలు, నిర్వహణ వ్యయం వంటి అంశాలన్నింటినీ కలిపి లెక్కిస్తారు.
రోడ్డు నిర్మించాలంటే నేల ఎంత గట్టిగా ఉంది? వర్షం పడినప్పుడు నీరు ఎలా ప్రవహిస్తుంది? భూమి కుంగిపోయే ప్రమాదం ఉందా? వంటి అంశాలను పరిశీలించాలి. కొన్ని ప్రాంతాల్లో మట్టి నేలలు, చిత్తడి నేలలు, వరద మైదానాలు ఉండవచ్చు. మరికొన్ని చోట్ల భూమి అడుగున నీరు ఎక్కువగా ఉండటం లేదా నేల బలహీనంగా ఉండటం వల్ల నిర్మాణానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరమవుతాయి. అలాంటి చోట్ల సరైన పునాది, మట్టి బలోపేతం, నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయకపోతే రహదారి కుంగిపోవచ్చు లేదా దెబ్బతినవచ్చు.
అందుకే రోడ్డు నిర్మాణానికి ముందు భూగర్భ పరిశీలనలు, నేల పరీక్షలు నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి మార్గాన్ని మార్చడం లేదా అదనపు ఇంజినీరింగ్ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ నిర్ణయాలు రహదారి దీర్ఘకాలిక స్థిరత్వానికి ఉపయోగపడతాయి.
నదులు, చెరువులు, అడవులను దాటడం అంత సులభం కాదు
ఒక రహదారిని మ్యాప్‌పై నేరుగా గీసినంత మాత్రాన భూమిపై అదే మార్గంలో నిర్మించడం సాధ్యం కాదు. మధ్యలో నదులు, సరస్సులు, చెరువులు, అడవులు లేదా వరదలు వచ్చే ప్రాంతాలు ఉండవచ్చు. నదిపై రోడ్డు వేయాలంటే వంతెన అవసరమవుతుంది. కొండల మధ్య రహదారి నిర్మించాలంటే కొన్నిసార్లు సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. అడవుల గుండా రహదారులు వేయడం వల్ల వన్యప్రాణుల నివాసాలు విభజించబడే ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తారు. అయితే నదులు లేదా అడవులను తప్పించడమే ప్రతి సందర్భంలో సరైన నిర్ణయం కాదు. ప్రయాణ దూరం, వరద ముప్పు, పర్యావరణ ప్రభావం, నిర్మాణ వ్యయం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి తుది మార్గాన్ని నిర్ణయిస్తారు.