
Rayalaseema : తెలుగు నేలలో రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం ఉంది. నేడు మనమందరం ఎంతో గర్వంగా పిలుచుకునే 'రాయలసీమ' అనే పేరు వెనుక ఒక గొప్ప ఆత్మగౌరవ పోరాటం, శతాబ్దాల నాటి రాజకీయ పరిణామాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ వారి కాలంలో 'సీడెడ్' లేదా 'దత్తమండలం'గా పిలువబడిన ఈ ప్రాంతం, రాయలసీమగా ఎలా రూపాంతరం చెందిందో ఇక్కడ తెలుసుకుందాం.
18వ శతాబ్దం చివరి నాటికి దక్కన్ పీఠభూమిలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారాయి. హైదరాబాద్‌ను పాలించే నైజాం నవాబులకు పొరుగున ఉన్న మరాఠాలు, మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ నుంచి తీవ్రమైన భద్రతా ముప్పు ఎదురైంది. మరాఠాల వరుస దండయాత్రలు, దాడి బెదిరింపులను తట్టుకోవడం నిజాం సైన్యానికి కష్టతరంగా మారింది. ఈ క్రమంలో తన రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి నిజాం రాజు ఈస్ట్ ఇండియా కంపెనీ (బ్రిటీష్ వారి) సహాయాన్ని కోరాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన 'సైన్యసహకార పద్ధతి' (Subsidiary Alliance) ఒప్పందంపై నిజాం సంతకం చేశాడు. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటీష్ వారు నిజాం రాజ్యానికి రక్షణగా తమ సైన్యాన్ని ఇక్కడ ఉంచుతారు... అయితే నిర్వహణ, జీతభత్యాల ఖర్చును నిజాం ప్రభుత్వమే భరించాలి. ఇందుకుగాను నిజాం రాజు ప్రతి సంవత్సరం బ్రిటీష్ వారికి భారీ మొత్తంలో డబ్బులు (కప్పం) చెల్లించాల్సి వచ్చేది.
ప్రారంభంలో నిజాం రాజు క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించినప్పటికీ, కాలక్రమేణా ఖజానా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రతి సంవత్సరం బ్రిటీష్ వారికి సైనిక నిర్వహణ ఖర్చులు చెల్లించడం రాజుకు భరించలేని భారంగా మారింది. బాకీలు పేరుకుపోవడంతో డబ్బు చెల్లింపులకు బదులుగా తన రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను బ్రిటీష్ వారికి అప్పగించడానికి నిజాం అంగీకరించాల్సి వచ్చింది.
ఈ క్రమంలో 1800వ సంవత్సరంలో నిజాం రాజు తన ఆధీనంలో ఉన్న నాలుగు ప్రధాన ప్రాంతాలను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి శాశ్వతంగా రాసిచ్చాడు. అవే ప్రస్తుతం మన ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు.
ఆంగ్ల భాషలో 'Cede' అంటే తమ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని లేదా హక్కులను వేరొకరికి అప్పగించడం, రాసివ్వడం లేదా దత్తత ఇవ్వడం అని అర్థం. నిజాం రాజు ఈ నాలుగు జిల్లాలను బ్రిటీషర్లకు అప్పగించాడు...కాబట్టి ఆంగ్లేయులు తమ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంతాన్ని 'సీడెడ్ డిస్ట్రిక్ట్స్' (Ceded Districts) అని పిలిచారు. తెలుగులో వీటిని 'దత్తమండలాలు' అని వ్యవహరించేవారు.
కాలక్రమేణా సినీ పరిశ్రమలో కూడా సీమాంధ్ర పంపిణీ ప్రాంతాలను వర్గీకరించేటప్పుడు ఈ నాలుగు జిల్లాల ప్రాంతాన్ని 'సీడెడ్' అని పిలవడం అలవాటుగా మారింది. ఇప్పటికీ సినిమా బిజినెస్ వర్గాల్లో 'సీడెడ్ రైట్స్' అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం.
భారత స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఈ 'సీడెడ్' అనే పదంపై ప్రజల్లో, మేథావుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. 'సీడెడ్' లేదా 'దత్తమండలం' అనే పదం పరాధీనతకు, బానిసత్వానికి, ఓటమికీ సంకేతంగా ఉందనే భావన పెరిగింది. ఎవరో రాజు తన స్వార్థం లేదా బలహీనత వల్ల పరాయి పాలకులకు అప్పగించిన ప్రాంతం కాబట్టి, ఆ పేరుతో తమను పిలవడం ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి భంగంగా భావించారు.
ఏళ్ల తరబడి బానిసత్వ ముద్రగా మారిన ఈ పేరును తీసేసి, ఈ భూభాగ ప్రాచీన సంస్కృతిని, ఘనమైన చరిత్రను ప్రతిబింబించేలా ఒక కొత్త పేరును పెట్టాలని పండితులు, నాయకులు నిర్ణయించారు. ఈ క్రమంలో 1928వ సంవత్సరంలో నంద్యాలలో 'ఆంధ్ర మహాసభ' సమావేశాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సభకు ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం నుంచి అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు, కవులు, పండితులు, పరిశోధకులు హాజరయ్యారు.
ఈ మహాసభలో 'సీడెడ్' అనే పేరును మార్చే చరిత్రాత్మక ప్రతిపాదన జరిగింది. ప్రముఖ భాషావేత్త, చరిత్ర పరిశోధకుడు, రచయిత చిలుకూరి నారాయణరావు ఈ సభలో సీడెడ్ జిల్లాలను ఇకపై 'రాయలసీమ' అనే పేరుతో పిలవాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభలోని పండితులు, నాయకులు ఏకగ్రీవంగా సపోర్ట్ తెలిపారు. ఈ మేరకు 'సీడెడ్' పేరును 'రాయలసీమ'గా మారుస్తూ సభలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు.
'రాయలసీమ' పేరే ఎందుకు?
చిలుకూరి నారాయణరావు 'రాయలసీమ' అనే పేరును ప్రతిపాదించడానికి బలమైన చారిత్రక నేపధ్యం ఉంది. ఒకప్పుడు ఈ కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ప్రాంతాలన్నీ దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేవి. విజయనగర చక్రవర్తుల్లో అత్యంత ప్రతిభావంతుడైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ప్రాంతం రత్నాలు, పగడాలు వీధుల్లో రాశులుగా పోసి అమ్మినంతగా సిరిసంపదలతో తులతూగింది. కళలు, సాహిత్యం, సంస్కృతి అత్యున్నత శిఖరాలకు చేరాయి. అందుకు గుర్తుగానే రాయలసీమ పేరు పెట్టారు.
'రాయల' అంటే శ్రీకృష్ణదేవరాయలు (విజయనగర రాయలు), 'సీమ' అంటే భూభాగం లేదా ప్రాంతం. అంటే "రాయలు పాలించిన రత్నాల సీమ" అని అర్థం వచ్చేలా 'రాయలసీమ' అనే పేరును ఖరారు చేశారు.
పాలకులు మారినా, కాలాలు మారినా బ్రిటీషర్ల బానిసత్వ ముద్ర అయిన 'సీడెడ్' అనే పేరును తిరస్కరించి, విజయనగర సామ్రాజ్య ఘనతను, శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా వైభవాన్ని గుర్తుచేసేలా 'రాయలసీమ'గా మారిన తీరు తెలుగు వారి ఆత్మగౌరవానికి నిదర్శనం. నేడు రాయలసీమ అనే పేరు కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు... అది పౌరుషానికి, పాండిత్యానికి, సంస్కృతికి, ఘనమైన చారిత్రకు నిలువెత్తు రూపం.