Telangana Village: తెలంగాణాలోని ఒక గ్రామంలో 40 ఏళ్ల నుంచి బోరు వేస్తే చాలు వేడి నీరు ఉబికి వస్తుంది. ముట్టుకుంటే చేతులు కాలేంత వేడి నీరు. అయినా కూడా ఆ నీటినే వ్యవసాయానికి వాడుతున్నారు రైతులు. ఎలా వాడుతున్నారో? అసలు అంత వేడి నీళ్లు ఎందుకు వస్తున్నాయి?
ఎక్కడైనా బోరు వేస్తే చల్లని తాగునీరు వస్తుంది, లేదా కాస్త ఉప్పునీరు పడుతుంది. కానీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో విచిత్రం జరిగింది. ఇక్కడి బోరుబావుల నుంచి ఏకంగా పొగలు కక్కుతూ సలసల కాగే వేడి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఎటువంటి మోటార్లు, ఆయిల్ ఇంజన్లు, విద్యుత్ అవసరం లేకుండానే సహజ పీడనంతో ఆ నీరు చిమ్ముతుండటం విశేషం. దాదాపు నలభై ఏళ్లుగా నిరంతరం 365 రోజులూ ఈ వేడి నీటి జలధారలు వస్తూనే ఉన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం భూగర్భ సర్వే సంస్థ, సింగరేణి అధికారులు మైనింగ్ అన్వేషణలో భాగంగా కిలోమీటరుకు పైగా లోతుతో వేసిన బోరుబావుల్లో ఇలాంటి నీరు పడింది. భూమి లోపలి పొరల్లో ఉండే అధిక ఉష్ణోగ్రత, గంధకం ప్రభావంతో దాదాపు అరవై డిగ్రీల సెల్సియస్ వేడితో ఈ నీరు నిరంతరం బయటకు ప్రవహిస్తోంది.
23
ఆ నీటితోనే వ్యవసాయం
సలసల కాగే ఈ నీళ్లే ఇప్పుడు పగిడేరు రైతులకు వరప్రసాదంగా మారాయి. సుమారు రెండు వందల ఎకరాల పంట భూములకు ఈ వేడి నీళ్లే ప్రధాన జీవనాధారమయ్యాయి. మరిగే నీటిని రైతులు నేరుగా పంటలకు పారించలేరు కాబట్టి, ముందుగా సమీపంలోని కుంటల్లోకి మళ్లిస్తారు. ఆ నీటిని ఒక రోజంతా ఆరబెట్టి, పూర్తిగా చల్లారిన తర్వాతే వరి పొలాలకు వదులుతారు. గతంలో నీటి ఎద్దడితో ఒకే పంట వేయడానికి ఇబ్బంది పడిన అన్నదాతలు ఇప్పుడు రెండు పంటలను దర్జాగా సాగు చేసుకుంటున్నారు. అయితే మధ్యలో వచ్చిన చిన్న భూకంపం వల్ల రెండు బోర్లు మూసుకుపోవడంతో, మిగిలిన బోర్లకు మరమ్మతులు చేసి కొత్తవి తవ్వించాలని రైతులు కోరుతున్నారు. ఈ వేడినీటి బావులను చూడటానికి పక్క ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా భారీగా తరలివస్తున్నారు.
33
విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నాలు
ఈ వేడి నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సింగరేణి సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భూగర్భ ఉష్ణశక్తిని వినియోగించి దిల్లీలోని సైన్స్ సంస్థ సహకారంతో ఇరవై కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి పైలట్ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాంకేతికతతో కరెంటు తీసే ప్రయత్నం విజయవంతమైతే ఈ మారుమూల పల్లె సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఉత్పత్తి అయిన కరెంటును మొదట గ్రామ వీధి దీపాలకు వాడాలని స్థానికులు కోరుతున్నారు. భూగర్భం నుంచి సహజంగా వస్తున్న ఈ వేడి నీళ్ల ప్రవాహం పగిడేరు గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.