పూర్వకాలంలో ఇప్పటిలాగా జనన ధృవీకరణ పత్రాలు ఉండేవి కావు... వారి ఇంటిపేరు లేదా పేర్ల ఆధారంగానే గుర్తించేవారు. అందుకే చాలామంది తమకు పుట్టిన బిడ్డలకు తండ్రి పేరు పెట్టేవారు... దీంతో ఈ పేరు చెప్పగానే ఇతడు పలానా వ్యక్తి మనవడు అని, పలానా వ్యక్తి కొడుకు అని ఈజీగా గుర్తించేవారు.
పూర్వం ఒకే వంశానికి చెందిన చాలామంది రాజుల పేర్లు ఒకేలా ఉండేవి. ఇలా చరిత్రలో మొదటి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు... మొదటి హరిహర రాయలు, రెండవ హరిహరరాయలు... మొదటి పులకేశి, రెండవ పులకేశి పేర్లు వింటుంటాం. ఆ కాలంలో వంశ ప్రతిష్ఠను, పూర్వీకుల గొప్పతనాన్ని తెలియజేయడానికి మనవళ్లకు తాతల పేర్లు పెట్టేవారని చారిత్రకారులు చెబుతారు.
ఇక పునర్జన్మపై కూడా భారతీయులకు నమ్మకం ఎక్కువ. అందుకే చాలామంది ముసలివారు ఇప్పటికీ 'చచ్చి నీ కడుపున పుడతా' అంటుంటారు. ఇలా తన తల్లిదండ్రులు పిల్లల రూపంలో పుట్టారని భావించేవారు వారి పేర్లను పెట్టేవారు... ఇది కూడా మనవళ్లకు తాతల పేరు పెట్టే సాంప్రదాయానికి కారణమయ్యింది.
కేవలం భారతీయుల్లోనే కాదు ఇతర దేశాల్లోనూ ఈ కల్చర్ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాచీన గ్రీకు, రోమన్ కల్చర్ లో కూడా తాతల పేర్లను మనవళ్లకు పెట్టే సాంప్రదాయం చూడవచ్చు. ఇంకా అనేది దేశాల్లో ఈ కల్చర్ కనిపిస్తుంది.