Motivational story: మన జీవితంలో ఏ పని చేసినా విమర్శించే వాళ్లు ఉంటారు. మనం ఏ దారి ఎంచుకున్నా తప్పు పట్టే వారు సమాజంలో కొరత ఉండదు. వారి మాటలను పట్టించుకుంటూ పోతే మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఈ విషయాన్ని గుర్తు చేసే ఒక చిన్న కథ మీకోసం.
ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే యువకుడు ఉండేవాడు. మంచి చదువుతో బీటెక్ పూర్తి చేశాడు. కుటుంబం కూడా అతనిపై చాలా ఆశలు పెట్టుకుంది. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టాలని అతను కష్టపడుతున్నాడు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఇంటర్వ్యూలకు వెళ్లేవాడు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేవాడు. కానీ అదృష్టం కలిసిరాక ఉద్యోగం మాత్రం దొరకలేదు. అయితే అతని ఇంటి దగ్గర ఉండే కొందరు పెద్దలు మాత్రం అతన్ని చూసి ఇలా మాట్లాడేవారు. “బీటెక్ చదివి కూడా ఏ పని చేయకుండా ఇంట్లోనే తిరుగుతున్నాడు. ఇలా ఉంటే ఎలా? ప్రభుత్వ ఉద్యోగాలకు చదివితే మంచిది కదా!” అని విమర్శించేవారు.
24
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం
ఆ మాటలు రాహుల్ మనసుకు తాకాయి. “వాళ్లు చెప్పింది నిజమే కావచ్చు” అనుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం కావడం ప్రారంభించాడు. రోజూ గంటల కొద్దీ చదవడం మొదలుపెట్టాడు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నాడు. జీవితాన్ని మార్చుకోవాలనే పట్టుదలతో చదువుతున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అదే నలుగురు మళ్లీ వచ్చి మాట్లాడారు. “ఇంత కాంపిటేషన్ ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమా? లక్షల మంది పోటీ పడుతున్నారు. ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెడితే బాగుండేది!” అని మళ్లీ సూచనలు ఇచ్చారు.
34
వ్యాపారం ప్రారంభించిన యువకుడు
ఈసారి కూడా రాహుల్ వాళ్ల మాటలను నమ్మాడు. “బిజినెస్ చేస్తే త్వరగా ఎదగొచ్చు” అనుకుని ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. కొంత అప్పు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే కొద్దిరోజులకే మళ్లీ అదే నలుగురు వచ్చి ఇలా అన్నారు. “ఇప్పటికే అప్పులు ఉన్నాయి. ఇంకా బిజినెస్ పెట్టాడు. లాభం వస్తుందా? ఇంట్లో ఉన్న పొలం చూసుకుంటే సరిపోదా?” అని మాట్లాడుకున్నారు. అది విన్న రాహుల్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. “వాళ్లు చెప్పింది నిజమే కావచ్చు” అనుకుని మరుసటి రోజు నుంచే పొలంలో పని చేయడం ప్రారంభించాడు.
కొన్ని రోజులు పొలంలో పని చేసిన తర్వాత కూడా ఆ నలుగురు ఆగలేదు. “బీటెక్ చదివి చివరికి పొలం పని చేస్తున్నాడు. ఇంత చదువు ఎందుకు? దీనికంటే చదవకపోతే బాగుండేది!” అని విమర్శించారు. ఈ మాటలు రాహుల్ హృదయాన్ని బాగా గాయపరిచాయి. తాను ఏ పని చేసినా తప్పే అని అనిపించింది. చివరికి తీవ్ర నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.
చివరికి తెలిసిన నిజం
రాహుల్ మరణించిన తర్వాత కూడా అదే నలుగురు అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుకున్నారు. “పిచ్చోడు! ఏ పని అయినా చేసుకుని బతకాలే గానీ ఇలా చనిపోతారా? మనిషికి ధైర్యం ఉండాలి!” అని అన్నారు.
కథలోని సందేశం
ఈ కథలో ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మన చుట్టూ మనలను తగ్గించి మాట్లాడే వాళ్లు, నిరుత్సాహపరచే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. వారి మాటలను పట్టించుకుంటే మన జీవితం మన చేతుల్లో ఉండదు. అందుకే జీవితంలో ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇతరులు ఏమంటారనే భయం కాకుండా, మనం నమ్మిన దారిలో ధైర్యంగా ముందుకు సాగడమే నిజమైన విజయం.