Silk Road: సరస్సు అడుగున పురాతన నగరం..800 ఏళ్ల క్రితం ఏం జరిగింది? బయటపడ్డ నిజాలు

Published : Oct 09, 2026, 01:01 PM IST

Silk Road: ఒకప్పుడు వ్యాపారులతో రద్దీగా ఉండే నగరం...ఇప్పుడు నీటి అడుగున శిథిలాలుగా మిగిలిపోయింది. ఇంతకీ ఈ సిటీ నీటిలో ఎలా మునిగిపోయింది? పరిశోధనల్లో ఎలాంటి ఆధారాలు లభించాయి? ఈ పురాతన నగరం ఇప్పుడు పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

PREV
16
సరస్సులో ఎలా మునిగింది?

ఒకప్పుడు వ్యాపారులతో రద్దీగా ఉండే నగరం.. చైనా నుంచి మధ్యధరా సముద్ర ప్రాంతాలకు వెళ్లే సిల్క్ రోడ్‌లో ఉండే కీలక కేంద్రం. అలాంటి నగరం ఇప్పుడు నీటి అడుగున శిథిలాలుగా మిగిలిపోయింది. కిర్గిజిస్థాన్‌లోని అతిపెద్ద సరస్సు ఇస్సిక్-కుల్‌లో బయటపడిన ఈ పురాతన నగరం ఇప్పుడు పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ నగరం నీటిలో ఎలా మునిగిపోయింది? పరిశోధనల్లో ఎలాంటి ఆధారాలు లభించాయి?

26
సిల్క్ రోడ్‌లో కీలక వాణిజ్య కేంద్రం

మధ్య ఆసియాలోని కిర్గిజిస్థాన్ దేశంలో ఉన్న ఇస్సిక్-కుల్ సరస్సు అడుగున టోరు-అయ్‌గిర్ (Toru-Aygyr) అనే పురాతన నగరానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. ఒకప్పుడు సిల్క్ రోడ్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం.. చైనా నుంచి మధ్యధరా సముద్రం వరకు సాగిన వాణిజ్యానికి కేంద్రంగా పనిచేసి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

సిల్క్ రోడ్ అనేది రోడ్ కాదు. ఆసియా, యూరప్ ప్రాంతాలను కలిపిన వాణిజ్య మార్గాల సముదాయం. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. 15వ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ మార్గాల ద్వారా వస్తువులు రవాణా జరిగేది. అంతేకాకుండా సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, మతపరమైన భావాలు ఇతర ప్రాంతాలకు కూడా చేరి, అక్కడి ప్రజలపై ప్రభావం చూపించాయి. ఈ నగరం ఉన్న ప్రాంతాన్ని 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం ప్రారంభం వరకు కరాఖానిద్ రాజవంశం పాలించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పరిశోధకుల అంచనా ప్రకారం.. ఈ నగరం ఐదు చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండవచ్చు. అయితే, దీని అసలు పేరు, జనాభా వివరాలు ఇంకా క్లారిటీ లేదు.

36
నీటి అడుగున ఏమేం కనిపించాయి?

ఈ నగర చరిత్రను వెలికితీసేందుకు 2024లో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిధులతో పరిశోధన ప్రారంభమైంది. 2025లో కిర్గిజిస్థాన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తో కలిసి మరిన్ని పరిశోధనలు చేపట్టారు. సుమారు 20 మంది శాస్త్రవేత్తలు, డైవర్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.

పరిశోధనల్లో అలంకరణలతో కూడిన ఓ పెద్ద భవనం అవశేషాలు బయటపడ్డాయి. అది మసీదు అయి ఉండవచ్చని, లేదా స్నానాల గది, మతపరమైన విద్యాసంస్థ అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో పాటు రెండు శ్మశాన వాటికలు కూడా గుర్తించారు. ఇవి ఆ ప్రాంతంలో ఇస్లాం మతం విస్తరించిన చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడవచ్చని అంచనా వేస్తున్నారు.

46
జంతువుల ఎముకలు, మట్టి పాత్రలు

జంతువుల ఎముకలు, మట్టి పాత్రలు కూడా లభించాయి. వీటి ద్వారా అప్పటి ప్రజల ఆహారపు అలవాట్లు, వస్తువుల తయారీ విధానాలు, నగరం ఏ కాలానికి చెందినదనే విషయాలను తెలుసుకోవచ్చు. చిన్నపిల్లల కోసం ఉపయోగించే 'టువాక్' అనే మట్టి పాత్ర కూడా పరిశోధకులకు లభించింది. ఇది అప్పటి ప్రజల రోజువారీ జీవితంపై ఆధారాలు అందిస్తోంది.

56
భూకంపమే నగరాన్ని ముంచేసిందా?

ఈ నగరం నీటిలో ఎలా మునిగిపోయిందనే ప్రశ్నకు ఇంకా కచ్చితమైన సమాధానం లభించలేదు. అయితే, భూకంపం కారణంగా భూమిలో మార్పులు సంభవించడం, సహజంగా నీటిని అడ్డుకునే నిర్మాణం ఏర్పడటం లేదా కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలను పరిశోధకులు పరిశీలిస్తున్నారు. రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన భూగర్భ శాస్త్రవేత్త ఆండ్రే స్ట్రెల్నికోవ్ అభిప్రాయం ప్రకారం.. గతంలో సంభవించిన భూకంపం ఈ విపత్తుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ నగరం దాదాపు 600 నుంచి 800 ఏళ్ల క్రితం నీట మునిగి ఉండవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఒక్కో రిపోర్ట్ లో ఒక్కోలా ఉంది. అందువల్ల అసలు విపత్తు ఎప్పుడు జరిగిందనే విషయంపై మరింత పరిశోధన అవసరం.

66
పాంపీ నగరంతో పోలిక

ఈ పురాతన నగరాన్ని ఇటలీలోని పాంపీతో పోల్చవచ్చని పరిశోధకులు మాక్సిమ్ మెన్షికోవ్ అభిప్రాయపడ్డారు. క్రీ.శ. 79లో వెసూవియస్ అగ్నిపర్వత బద్దలవ్వడం వల్ల పాంపీ నగరం బూడిదలో కూరుకుపోయింది. అదే విధంగా టోరు-అయ్‌గిర్ కూడా ప్రకృతి విపత్తు కారణంగా కనుమరుగై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ నగరం గురించి మరిన్ని వివరాలు బయటపడితే మధ్య ఆసియా చరిత్రతో పాటు సిల్క్ రోడ్ వాణిజ్యం, అప్పటి ప్రజల జీవన విధానం, మతపరమైన మార్పులపై కొత్త సమాచారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సరస్సు అడుగున దాగి ఉన్న ఈ నగరం.. వందల ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు పరిశోధకులకు కీలక ఆధారంగా మారుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories