Longest Living Animals On Earth: ఈ భూమిపై అత్యధిక కాలం జీవించే జీవులు ఏవో మీకు తెలుసా? కుక్కలు, ఏనుగుల నుండి 4,300 ఏళ్లు బతికే బ్లాక్ కోరల్ వరకు భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మన చుట్టూ ఉండే జంతువులు, పక్షులు ఎంతకాలం బతుకుతాయో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. కొన్ని జీవులు కొద్ది సంవత్సరాలే బతికితే, మరికొన్ని జీవులు ఏకంగా వేల సంవత్సరాల పాటు భూమిపై జీవిస్తూనే ఉంటాయి. జీవుల శరీరం, ఉండే ప్రదేశం, తినే ఆహారం, సహజ పరిస్థితులు వాటి ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రీసెంట్‌గా 'వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' (World of Statistics) ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన డేటా ప్రకారం భూమిపై ఉన్న వివిధ జీవుల ఆయుష్షుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
26
చిన్న జీవుల ఆయుష్షు ఎంత ఉంటుంది?
మన ఇళ్లలో సాధారణంగా కనిపించే ఎలుక సగటు ఆయుష్షు కేవలం 1 సంవత్సరం మాత్రమే. అలాగే గువ్వలు లేదా పావురాలు దాదాపు 5 సంవత్సరాలు, కంగారూలు సుమారు 6 సంవత్సరాలు జీవిస్తాయి. కోళ్ల విషయానికి వస్తే వీటి వయస్సు దాదాపు 10 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే చిన్న జీవుల ఆయుష్షు చాలా తక్కువగా ఉంటుంది. వాటి జీవన శైలి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం.
36
కుక్కలు, పులులు, ఏనుగులు ఎన్ని రోజులు బతుకుతాయి?
మానవులకు అత్యంత దగ్గరగా ఉండే పెంపుడు కుక్కలు సగటున 13 సంవత్సరాలు బతుకుతాయి. అయితే వీటి జాతి, సంరక్షణను బట్టి ఈ వయస్సు మారవచ్చు. అడవిలో ఉండే పులి ఆయుష్షు దాదాపు 15 ఏళ్లు కాగా, ఆవులు సుమారు 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అడవిలో ఉండే జీవులకు వేట, అనారోగ్యం, ఆహార కొరత వంటి అనేక సవాళ్లు ఉంటాయి.
గుర్రాలు దాదాపు 25 సంవత్సరాలు, బర్మీస్ రాక్ పైథాన్ సుమారు 30 సంవత్సరాలు జీవిస్తాయి. ఇక పెద్ద క్షీరదాల విషయానికి వస్తే, ఒరాంగుటాన్ దాదాపు 45 సంవత్సరాలు బతుకుతుంది. భూమిపై నివసించే అతిపెద్ద జంతువులలో ఒకటైన ఏనుగు ఆయుష్షు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది.
గులాబీ రంగులో అందంగా కనిపించే ఫ్లెమింగో పక్షి ఏకంగా 60 సంవత్సరాల వరకు జీవిస్తుందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుదీర్ఘ ఆయుష్షు కలిగిన పక్షుల్లో ఇది ఒకటి. ఇక గాలాపాగోస్ రాక్షస తాబేలు 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. గాలాపాగోస్ దీవుల్లో ఉండే ఈ తాబేళ్లు చాలా పెద్ద శరీరాన్ని కలిగి ఉండి, అత్యంత మెల్లగా నడుస్తాయి. ఇవి భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవులలో ప్రముఖమైనవి.
56
సముద్ర గర్భంలో 200 ఏళ్లకు పైగా జీవించే మహా జీవులు
సముద్రపు జీవుల దగ్గరకు వచ్చేసరికి ఈ ఆయుష్షు లెక్కలు మనుషుల ఊహకు అందనంతగా మారతాయి. బోహెడ్ వేల్ దాదాపు 200 సంవత్సరాలు జీవిస్తుంది. అత్యంత ఎక్కువ కాలం బతికే క్షీరదంగా ఇది నిలిచింది. ఇక గ్రీన్లాండ్ షార్క్ ఆయుష్షు ఏకంగా 272 సంవత్సరాల వరకు ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. అంటే మనుషుల కొన్ని తరాల జీవితకాలం ముగిసినా ఈ షార్క్‌లు సముద్రంలో ఈదుతూనే ఉంటాయి. చల్లని నీరు, నెమ్మదిగా జరిగే శారీరక ఎదుగుదలే వీటి సుదీర్ఘ ఆయుష్షుకు రహస్యం.
66
4,300 ఏళ్ల బ్లాక్ కోరల్.. నాగరికతలు మారినా చావని జీవి
అన్నింటికంటే షాకింగ్ మేటర్ ఏంటంటే, సముద్రంలో ఉండే కొన్ని విచిత్ర జీవులు ఏకంగా వేల సంవత్సరాలు బతుకుతాయి. జెయింట్ బారెల్ స్పాంజ్ అనే జీవి ఆయుష్షు దాదాపు 2,300 సంవత్సరాలుగా నమోదైంది. ఇక అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, కొన్ని 'బ్లాక్ కోరల్' కాలనీల వయస్సు సుమారు 4,300 సంవత్సరాల కంటే ఎక్కువేనని అంచనా వేశారు. మానవ చరిత్రలో ఎన్నో నాగరికతలు మారినప్పటికీ, ఈ జీవులు సముద్రంలో ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. కేవలం పెద్దవి, బలమైనవి మాత్రమే కాదు, సముద్రంలో ఉండే అత్యంత సాధారణ జీవులు కూడా ఆయుష్షులో రికార్డులు సృష్టిస్తున్నాయని ఈ డేటా నిరూపిస్తోంది.