
ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్రపడుతోంది... తాజాగా కార్తీక దీపం వివాదంతో TVK (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వానికీ ఇలాంటి పేరే వస్తోంది. స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినా అనాదిగా కొనసాగుతున్న కార్తీక పౌర్ణమి ఆచారాన్ని అవమానించేలా విజయ్ సర్కార్ వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న (నవంబర్ 24, మంగళవారం) కార్తీక పౌర్ణమి రోజున మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపైని దీపత్తూన్ పై కార్తీక దీపం వెలిగించకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది... టివికె ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు తిరుప్పరంకుండ్రంలో ఈ ఒక్కసారికి కార్తీక దీపం వెలింగించుకునేందుకు అనుమతి ఇచ్చింది... అయితే దీన్ని తమిళనాడు ప్రభుత్వం అమలుచేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణకు పాల్పడిన టివికె ప్రభుత్వాన్ని రద్దు చేయాలని హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టికల్ 356 ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని.... తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కొందరు కోరుతున్నారు. ఇలా విజయ్ సర్కార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 (Article 356) ఒక రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన కొనసాగించడం సాధ్యం కాని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీనినే సాధారణంగా రాష్ట్రపతి పాలన అంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల ప్రకారం వ్యవహరించడంలేదని రాష్ట్రపతి భావించినప్పుడు ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కేంద్రం ఆధీనంలోకి వెళ్తాయి.
రాష్ట్ర గవర్నర్ రిపోర్ట్ ఆధారంగా లేదా ఇతర మార్గాల్లో అందిన సమాచారం ఆధారంగా, రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం నడవడం సాధ్యం కాదని రాష్ట్రపతి భావిస్తే ఈ చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా అధికారాలను రాష్ట్రపతి స్వీకరించవచ్చు... గవర్నర్ లేదా ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగించవచ్చు.
అయితే రాష్ట్రపతి పాలన విధించడం అంత తేలికైన విషయం కాదు... చిన్నచిన్న విషయాలను పరిగణలోకి తీసుకుని ఇంతపెద్ద నిర్ణయం తీసుకోలేరు. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడం కూడా ఇలాంటిదేనని... దీనిపై 356 ఆర్టికల్ ఉపయోగించే అవకాశాలు లేవని టివికే పార్టీ నాయకుల అభిప్రాయం. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ కార్తీక దీపం వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు టివికే సపోర్టర్స్.
మధురై సమీపంలోని సికిందర్ బాదుషా దర్గా దగ్గర తిరుపరంకుండ్రం కొండపై ఓ ఆలయం కూడా ఉంది. ఇక్కడి పురాతన రాతి స్తంభమైన దీపత్తూన్ పై ప్రతి ఏటా కార్తీక దీపం వెలిగిస్తారు... దీనిపైనే ఇప్పుడు వివాదం నడుస్తోంది. దర్గాకు ఈ ప్రాంతం దగ్గరగా ఉందని... శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే కారణాలతో స్థానిక అధికారులు నవంబర్ 2025లో కొండపైన దీపం వెలిగించడానికి అనుమతి నిరాకరించడంతో వివాదం మొదలైంది... ఇది ఈ కార్తీక పౌర్ణమికి మరింత ముదిరింది.
డిసెంబర్ 2025లో మద్రాస్ హైకోర్టుకు చెందిన సింగిల్ జడ్జి.. దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఈ స్తంభం దర్గాకు 50 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉందని హైకోర్టు పరిశీలించింది. జనవరి 6, 2026న ఒక డివిజన్ బెంచ్ కూడా ఈ ఆదేశాన్ని సమర్థించింది. అయితే ఈ ప్రదేశం వారసత్వ హోదాను పరిగణనలోకి తీసుకుని పోలీసులతో, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)తో సమన్వయం చేసుకుని దీపం వెలిగించే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ నిర్వహణకు సూచించింది.
హైకోర్టు నిర్ణయాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 2026లో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 20న జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. షరతులతో కూడిన అనుమతితో నవంబర్ 24న అంటే ఈ కార్తీక పౌర్ణమికి ఒక్కసారి మాత్రమే దీపం వెలిగించేందుకు అనుమతించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై తక్షణ స్టే కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలున్నా నిన్న(నవంబర్ 24, మంగళవారం) కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించలేదు… దీంతో విజయ్ ప్రభుత్వంపై హిందూసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి... టిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే డిమాండ్ కూడా మొదలయ్యింది.