విషపూరిత పామును తిన్నాక కూడా ముంగిస ఎలా బతుకుతుంది? ఆ విషం ఏమవుతుంది?

Published : Oct 25, 2026, 09:41 AM IST

ప్రకృతిలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తికరమైనది విషపూరితమైన పామును చంపి తిన్నాక కూడా ముంగిస (Mongoose)బ్రతకడం. అత్యంత ప్రమాదకరమైన నాగుపాము (Cobra) విషం సైతం ముంగిసను ఏమీ చేయలేకపోవడం వెనుక ఒక అద్భుతమైన జీవశాస్త్ర కారణం ఉంది.

PREV
13
పాము విషం ముగీసను ఏం చేయలేదా?

ప్రకృతిలో ముంగిసకు పాముతో జరిగే పోరాటం ఆసక్తికరమైన విషయం. నాగుపాము వంటి విషపూరిత పాములను వేటాడి తినగలిగే ముంగిస, పాము విషం నుంచి ఎలా తప్పించుకోగలదు అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. అయితే ముంగీస ఆ విషం నుంచి పూర్తిగా తప్పించుకోలేదు. దాని శరీరంలోని ప్రత్యేక జీవరసాయన లక్షణాలు, చురుకుదనం దీనికి కొంత రక్షణ కల్పిస్తాయి. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి.

పాము ఎంతటి విషపూరితమైనదైనా సరే, ముంగిస దానిని సునాయాసంగా వేటాడి ఆహారంగా తీసుకుంటుంది. విషసర్పం తిన్నా ముంగిస చనిపోకపోవడానికి ప్రధాన కారణం జీర్ణవ్యవస్థ పనితీరు. పాము విషం ప్రాణాంతకమైన ప్రోటీన్లు, ఎంజైములతో నిండి ఉంటుంది. ముంగిస పామును తిన్నప్పుడు ఆ విషం నేరుగా రక్తంలో కలవదు.

అది జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఉత్పత్తయ్యే బలమైన జీర్ణరసాలు, ఎంజైములు విషంలోని ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేసి సాధారణ అమైనో ఆమ్లాలుగా మార్చేస్తాయి. దీనివల్ల విషం ఎలాంటి హాని చేయకుండా మామూలు ఆహారంలా జీర్ణమైపోతుంది. ముంగిస నోటిలో గానీ, కడుపులో గానీ ఎలాంటి లోపలి గాయాలు లేనంత వరకు విషం శరీరానికి ప్రమాదం కలిగించదు.

23
ముంగిస శరీరంలో విష నిరోధకత ఎలా పనిచేస్తుంది?

రెండవ బలమైన కారణం ముంగిస శరీరంలో ఉండే జన్యుపరమైన రక్షణ వ్యవస్థ. తాచుపాము వంటి విషసర్పాల కాటు నరాల వ్యవస్థపై దాడి చేస్తుంది. సాధారణ జంతువులలో ఈ విషం కండరాలు, నరాల మధ్య ఉండే రిసెప్టర్లతో బంధం ఏర్పరచుకుని పక్షవాతం తెప్పిస్తుంది. ముంగిసలోని ఎసిటైల్‌కోలిన్ రిసెప్టర్ల నిర్మాణం భిన్నంగా రూపొంది ఉంటుంది. జన్యుపరమైన మార్పుల వల్ల పాము విషం ఈ రిసెప్టర్లను పట్టుకోలేదు. ఫలితంగా విష ప్రభావం నరాలపై పడదు. శరీరంపై ఉండే దట్టమైన, గట్టి వెంట్రుకలు కూడా మరో సహజ కవచంలా పనిచేస్తాయి. పాము వేగంగా కాటు వేసినప్పటికీ, ఆ కోరలు ముంగిస చర్మం లోపలికి సులభంగా దిగబడవు. ఇది విషం రక్తంలో చేరకుండా ఆపుతుంది.

33
ముంగిసకు చురుకుదనం

చివరిగా ముంగిసకు ఉండే మెరుపు వేగం, అద్భుతమైన చురుకుదనం దానిని కాపాడుతాయి. పాము దాడి చేసే సమయాన్ని ముందే పసిగట్టి తప్పించుకోవడంలో ముంగిస దిట్ట. పామును పదేపదే అలసిపోయేలా చేసి, అదును చూసి దాని తలపై బలంగా దాడి చేస్తుంది. ముంగిసకు పూర్తిగా విషం అంటదని అనుకోవడం పొరపాటు. దాని శరీరం కేవలం కొన్ని రకాల న్యూరోటాక్సిక్ విషాలకే రక్షణ ఇస్తుంది. రక్త నాళాలను దెబ్బతీసే ఇతర విషాల నుంచి పూర్తి రక్షణ లభించదు. కింగ్ కోబ్రా వంటి పెద్ద పాములు ఒకేసారి ఎక్కువ మోతాదులో విషాన్ని శరీరంలోకి ఎక్కిస్తే ముంగిస కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. శారీరక రోగనిరోధక శక్తి, అప్రమత్తత కలిసి ముంగిసను బతికిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories