Gold Loan : మీరు గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేకపోతున్నారా? బంగారం వేలం వేయకుండా ఆపే సింపుల్ ట్రిక్స్

Published : Jun 16, 2026, 12:40 PM IST

అధిక వడ్డీతో తీసుకున్న గోల్డ్ లోన్ కట్టలేకపోవడంతో మీ బంగారం వేలానికి పోతోందా..? కష్టపడి సంపాదించుకున్న నగలను వేలంలో కోల్పోకుండా, తెలివైన పద్ధతుల్లో ఎలా విడిపించుకోవాలో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. 

PREV
16
మీ బంగారం వేలం వేయకుండా జాగ్రత్తపడండి

భారతీయ కుటుంబాల్లో మరీముఖ్యంగా మధ్యతరగతి, పేద ప్రజలకు బంగారం ఒక పెద్ద ఆర్థిక భరోసా. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వ్యవసాయం లేదా చిన్న వ్యాపార పెట్టుబడి.. ఇలా ఏ కష్టం వచ్చినా మనల్ని ఆదుకునేది ఇంట్లో ఉన్న నగలే. "అవసరానికే కదా తాకట్టు పెట్టేది, డబ్బు రాగానే విడిపించుకోవచ్చు" అనే నమ్మకంతోనే చాలామంది గోల్డ్ లోన్ తీసుకుంటారు. కానీ వడ్డీ కట్టలేక, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోవడంతో ఇబ్బందుల్లో పడతారు.. "మీ బంగారం వేలానికి వస్తుంది" అని బ్యాంకు నోటీసు పంపినప్పుడు గుండె ఆగినంత పనవుతుంది. ఎంతో కష్టపడి ఇష్టంగా కొన్న బంగారం ఇలా వేలానికి వెళ్లడం చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఆర్థిక అవసరాల కోసం తాకట్టుపెట్టిన బంగారం వేలానికి పోకుండా సులభంగా, తెలివిగా ఎలా విడిపించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

26
సరైన సంస్థను ఎంచుకొండి

నగలు వేలానికి పోవడానికి ప్రధాన కారణం మనం తప్పుడు ఫైనాన్స్ సంస్థలను ఎంచుకోవడమే. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు నెలకు 2% నుంచి 4% వరకు వడ్డీ వసూలు చేస్తాయి. అంటే ఏడాదికి 24% నుంచి 48% వరకు వడ్డీ పడుతుంది. సామాన్యుల నెల జీతంతో ఈ వడ్డీ కట్టడమే కష్టం, ఇక అసలు ఎలా తీరుస్తారు? దీనికి బదులుగా మీ మొదటి ఛాయిస్ ఎప్పుడూ ప్రభుత్వ రంగ బ్యాంకులు (SBI, ఇండియన్ బ్యాంక్) లేదా స్థానిక సహకార బ్యాంకులు మాత్రమే అయి ఉండాలి. ఇక్కడ వార్షిక వడ్డీ కేవలం 8% నుంచి 11% వరకే ఉంటుంది. అంటే ప్రైవేట్ సంస్థల్లో మీరు ఒక నెలకు కట్టే వడ్డీ ఇక్కడ 3 లేదా 4 నెలల వడ్డీకి సమానం. వడ్డీ భారం తగ్గితే బంగారం వేలానికి పోయే ప్రమాదం సగానికి సగం తగ్గిపోతుంది.

36
ఒకేసారి కాదు విడతలవారిగా లోన్ చెల్లించండి

చాలామంది చేసే పెద్ద తప్పు "బాగా డబ్బులు వచ్చాక ఒకేసారి కట్టి నగలు విడిపించుకోవచ్చు" అని ఊరికే ఉండటమే. సామాన్యులకు పెద్ద మొత్తం ఒకేసారి రావడం కష్టం. కాలం గడిచేకొద్దీ వడ్డీ పెరిగిపోయి, బ్యాంకు మీ నగలను వేలం జాబితాలో పెడుతుంది. బ్యాంకుల్లో 'పాక్షిక చెల్లింపు' (Part Payment) అనే అద్భుతమైన సౌకర్యం ఉంది. మీ చేతికి రూ.500, రూ.1000 లేదా రూ.2000 ఎప్పుడు వచ్చినా, వెంటనే దాన్ని మీ గోల్డ్ లోన్ ఖాతాలో కట్టండి. దీనివల్ల మీరు కట్టిన డబ్బు నేరుగా మీ 'అసలు' (Principal) మొత్తాన్ని తగ్గిస్తుంది. అసలు తగ్గితే తర్వాతి నెల వడ్డీ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఉదాహరణకు రూ.50,000 అప్పులో మీరు రూ.10,000 కడితే తర్వాతి నెల వడ్డీని రూ.40,000 రూపాయలకే లెక్కిస్తారు. ఇలా కొద్దికొద్దిగా కడుతూ ఉంటే వేలం నోటీసు రాదు, నగలు కూడా త్వరగా చేతికి వస్తాయి.

46
నెలనెల కాదు రోజువారి ఆదా

రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులకు నెలనెలా ఆదాయం పెద్దగా ఉండదు. కానీ రోజువారీ ఆదాయం ఉంటుంది. కాబట్టి బంగారు నగలను వేలం నుంచి కాపాడుకోవడానికి రోజువారీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. రోజూ 50 లేదా 100 రూపాయలు పక్కన పెడితే నెలకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు జమ అవుతుంది. ఈ డబ్బును ఒక డబ్బాలో లేదా పోస్టాఫీసులో దాచుకోవచ్చు. నెల చివర్లో ఈ మొత్తాన్ని నేరుగా గోల్డ్ లోన్‌కు కట్టేయాలి. ఇలా చేయడం ద్వారా మీ అప్పులో చాలా భాగం తీరిపోయి, బంగారం వేలానికి వెళ్లే ప్రమాదం పూర్తిగా తొలగిపోతుంది.

56
వడ్డీ చెల్లిస్తే చాలు...

ఒకవేళ పేదరికం లేదా ఉద్యోగం కోల్పోవడం వల్ల మీరు అసలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారనుకుందాం. "నగలను వేలం వేయబోతున్నాం" అని బ్యాంకు నుంచి చివరి హెచ్చరిక నోటీసు వచ్చింది. ఇలాంటప్పుడు భయపడకండి. నేరుగా బ్యాంకు మేనేజర్‌ను కలవండి. గోల్డ్ లోన్ గడువు సాధారణంగా ఒక సంవత్సరం (12 నెలలు) ఉంటుంది. 

ముఖ్యమైన ట్రిక్ : మీరు మొత్తం అప్పు తీర్చలేకపోయినా ఆ ఏడాది కాలంలో పెరిగిన 'వడ్డీ మొత్తాన్ని' అయినా ఎలాగోలా కట్టేయండి. వడ్డీ మొత్తం కట్టేస్తే బ్యాంకు మీ గోల్డ్ లోన్‌ను మరో ఏడాదికి 'పునరుద్ధరిస్తుంది' (Renewal/Re-pledge). అంటే పాత అప్పు ముగిసి, ప్రస్తుత బంగారం విలువ ప్రకారం కొత్త అప్పుగా మారుతుంది. దీనివల్ల మీ బంగారం వేలానికి పోకుండా వెంటనే ఆపొచ్చు. నగలు విడిపించుకోవడానికి మీకు మరో 12 నెలల అదనపు సమయం దొరుకుతుంది.

66
ఆడంబరాలు వద్దు..

నగలు తాకట్టులో ఉన్నప్పుడు ఇంట్లో ఆడంబరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి. కొత్త బట్టలు కొనడం, అనవసరమైన గృహోపకరణాలను ఈఎంఐ (EMI)లో కొనడం, పండగలకు అప్పు చేసి ఖర్చు చేయడం వంటివి పక్కన పెట్టండి. మీ మొదటి లక్ష్యం తాకట్టులో ఉన్న నగలను విడిపించుకోవడమే అయి ఉండాలి. "ఈ నెల సినిమాకు పెట్టే 500 రూపాయలు మిగిలిస్తే, అది నగల అప్పుకు కట్టొచ్చు" అనే ఆలోచన ప్రతి కుటుంబ సభ్యుడికి రావాలి.

తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోవడం అసాధ్యమేమీ కాదు. అది మీ సరైన ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకు నోటీసు చూసి భయపడకుండా పైన చెప్పిన 'పాక్షిక చెల్లింపు', 'పునరుద్ధరణ' వంటి ట్రిక్స్‌ పాటిస్తే ఏ సంస్థ కూడా మీ నగలను తాకలేదు. బంగారం కేవలం ఆభరణం కాదు, అది సామాన్యుల జీవితాల్లో ఒక భరోసా. ఆ నమ్మకాన్ని వేలం పాటలో కోల్పోకండి. ఈరోజే మీ గోల్డ్ లోన్ వివరాలు చెక్ చేసుకోండి, కొద్దికొద్దిగా పొదుపు చేసి మీ కష్టార్జితాన్ని సులభంగా విడిపించుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories