బ్యాంక్ చెప్పే కారణం సరైనది కాదని మీకు అనిపిస్తే, తర్వాతి స్టెప్‌గా ఆ బ్యాంక్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను కలవండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదు నంబర్ లేదా రసీదు కచ్చితంగా తీసుకోండి. దీనివల్ల తర్వాత ఈ కంప్లైంట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. బ్యాంక్‌కు కంప్లైంట్ ఇచ్చినా సమస్య తీరకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం మీకు ఉంటుంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం… ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీకే మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్‌ను 30 రోజుల్లోగా వాళ్లు పరిష్కరించకపోయినా లేదా వాళ్లు ఇచ్చిన సమాధానం మీకు నచ్చకపోయినా, అప్పుడు మీరు ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సేవలలో లోపాలు ఉంటే పరిష్కరించడానికి ఆర్బీఐ ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
కంప్లైంట్ ఇచ్చే ముందు లోన్ డాక్యుమెంట్, డబ్బులు కట్టిన రసీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్, కుదవపెట్టిన రసీదు, బ్యాంక్‌కు ఇచ్చిన కంప్లైంట్ కాపీ, వాళ్లు ఇచ్చిన రిప్లై అన్నీ మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. "ఆర్బీఐకి కంప్లైంట్ చేయగానే వెంటనే నగలు వచ్చేస్తాయి" అని అనుకోవద్దు. మీరు ఇచ్చే డాక్యుమెంట్లు, వాళ్ల సర్వీస్‌లో ఉన్న లోపం ఆధారంగానే యాక్షన్ ఉంటుంది. అందుకే లోన్ తీసుకునే ముందే అగ్రిమెంట్ పూర్తిగా చదవడం, లోన్ తీరిపోగానే అకౌంట్ క్లోజర్ రికార్డులు తీసుకోవడం చాలా ముఖ్యం.