
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏది అని అడిగితే చాలామందికి వెంటనే వెదురు గుర్తొస్తుంది. అయితే ఈ విషయంలో ఒక ట్విస్ట్ ఉంది. మొక్కల పెరుగుదలను మనం నిలువు ఎత్తు ఆధారంగా కొలుస్తున్నామా లేక దాని సంఖ్య, బరువు రెట్టింపు కావడం ఆధారంగా చూస్తున్నామా అనే దానిపై అసలైన విన్నర్ ఎవరో ఆధారపడి ఉంటుంది. నిలువు ఎత్తు విషయంలో జెయింట్ బాంబూ టాప్‌లో ఉంటే, బయోమాస్ రెట్టింపు చేయడంలో వాటర్మీల్ అనే అతిచిన్న మొక్క రికార్డు సృష్టిస్తోంది.
సాధారణంగా వెదురును మనం ఒక చెట్టు అనుకుంటాం. కానీ శాస్త్రీయంగా ఇది గడ్డి జాతికి చెందిన ఒక కలప గడ్డి మొక్క మాత్రమే. ముఖ్యంగా డెండ్రోకలమస్ సైనస్, మోసో బాంబూ జాతులు ఒక్క రోజులోనే ఏకంగా 91 సెంటీమీటర్లు ఎత్తు పెరగగలవు. అంటే గంటకు దాదాపు 4 సెంటీమీటర్ల చొప్పున ఇది పైకి దూసుకెళ్తుంది. ప్లాంట్ సెల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ప్రత్యేక పరిస్థితుల్లో మోసో బాంబూ ఒక్క రోజులో 114.5 సెంటీమీటర్ల వరకు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
సాధారణ చెట్లు ఏళ్ల తరబడి కొత్త కణాలను తయారు చేసుకుంటూ నెమ్మదిగా పెరుగుతాయి. కానీ వెదురు మొలక భూమిలోంచి బయటకు వచ్చేటప్పుడే దానికి కావాల్సిన కణాలన్నీ లోపల సిద్ధంగా ఉంటాయి. ఆ కణాల్లోకి నీరు వేగంగా చేరి, అవి ఈజీగా సాగడం వల్లే వెదురు ఇంత వేగంగా ఎత్తు పెరుగుతుంది.
దీనికి తోడు భూమి లోపల ఉండే రైజోమ్స్ అనే వేర్ల వ్యవస్థ భారీగా శక్తిని, కార్బోహైడ్రేట్లు, నీటిని నిల్వ చేసుకుని కొత్త మొలకలకు అందిస్తుంది. వెదురు మొలక మొదటి రోజు ఎంత వెడల్పుతో పుడుతుందో జీవితాంతం అంతే వెడల్పు ఉంటుంది, కేవలం ఎత్తు మాత్రమే పెరుగుతూ లోపల సిలికాతో గట్టిపడుతుంది.
బయోమాస్ లేదా తన సంఖ్యను వేగంగా పెంచుకోవడంలో వాటర్మీల్ ప్రపంచంలోనే టాప్ లో ఉంది. మంచి నీటి కొలనుల్లో ఆకుపచ్చని మొక్కజొన్న పిండి రేణువుల్లా తేలియాడే ఈ మొక్క, భూమిపై ఉన్న అత్యంత చిన్న పుష్పించే మొక్క. దీని పరిమాణం 1 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉంటుంది.
దీనికి వేర్లు, కాండం, ఆకులు ఏమీ ఉండవు. ఇది కేవలం ప్రతి 24 నుండి 30 గంటలకు ఒకసారి తన సంఖ్యను రెట్టింపు చేసుకుంటుంది. అలైంగిక విధానంలో కొత్త మొక్కలను పుట్టిస్తూ, ఎవరూ అడ్డుకోకపోతే కొన్ని నెలల్లోనే భూమి పరిమాణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోకి వ్యాపించగలదు. ఇందులో 40 శాతం ప్రోటీన్ ఉండటం వల్ల థాయ్‌లాండ్‌లో దీనిని సూపర్ ఫుడ్ గా తింటారు.
వెదురు గడ్డి జాతి కాబట్టి, నిజమైన చెట్ల విషయానికి వస్తే ఎంప్రెస్ ట్రీ మొదటి ఏడాదిలోనే 4.5 నుండి 6 మీటర్లు పెరుగుతుంది. దీని వెడల్పాటి ఆకులు కిరణజన్య సంయోగక్రియను వేగంగా జరపడం వల్ల ఇది సాధ్యమవుతుంది. మరోవైపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, మలేషియాలో పెరిగిన మొలుక్కన్ అల్బిజియా అనే చెట్టు కేవలం 13 నెలల్లో 10.74 మీటర్లు పెరిగి చెట్ల విభాగంలో ప్రపంచ రికార్డు సాధించింది. ఇక సముద్రంలో పెరిగే జెయింట్ కెల్ప్ అనే నాచు మొక్క రోజుకు 60 సెంటీమీటర్లు పెరుగుతుంది.
కేవలం వేగంగా పెరగడమే కాకుండా వెదురు వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దీని లోపలి భాగం డొల్లగా ఉండి, కణుపులతో కూడి ఉండటం వల్ల బరువు తక్కువగా ఉండి, బలమైన గాలులను కూడా విరిగిపోకుండా తట్టుకుంటుంది. అందుకే దీనిని భవన నిర్మాణాల స్కాఫోల్డింగ్, ఫ్లోరింగ్, ఫర్నిచర్ తయారీలో వాడుతున్నారు. ఆసియా వంటకాల్లో లేత వెదురు కొమ్ములను ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా వస్త్రాల తయారీలో, నేల కోతను అరికట్టి పర్యావరణాన్ని కాపాడటంలో వెదురు కీలక పాత్ర పోషిస్తోంది.