ఓ గ్రామం భారతదేశంలోనే ఉంటుంది... కానీ మనదేశానికి చెందినది కాదు. ఆ గ్రామానికి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు తప్పనిసరి. ఆ గ్రామం మనదేశంలో ఉన్నా కూడా పొరుగుదేశానికి ఎలా చెందింది? ఆ గ్రామం ఏది? ఆ విలేజ్ ప్రత్యేకతలు తెలుసుకోండి.
మన దేశంలోనే ఉన్న గ్రామానికి వెళ్లాలంటే మరో దేశానికి వెళ్లినట్లుగా పాస్‌పోర్ట్, వీసా అవసరమని చెబితే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పశ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రాంతానికి సంబంధించి ఇలాంటి ప్రత్యేక పరిస్థితి ఉంది. అదే పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్ జిల్లాలో ఉన్న దహాగ్రామ్ – ఆంగర్పోటా ప్రాంతం. ఈ ప్రాంతం నాలుగు వైపులా భారత భూభాగంతో చుట్టుముట్టి ఉంటుంది. అయినప్పటికీ ఇది బంగ్లాదేశ్‌కు చెందిన ప్రాంతం. ఇక్కడ సుమారు 20 వేల మంది బంగ్లాదేశ్ పౌరులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. అక్కడి ప్రజలు భారత రూపాయి కాకుండా బంగ్లాదేశ్ కరెన్సీ అయిన టాకాను ఉపయోగిస్తారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ సేవలు కూడా బంగ్లాదేశ్ నుంచే అందుతాయి. అందుకే ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
23
బంగ్లదేశ్ తో రాకపోకలు
ఈ ప్రాంతానికి బంగ్లాదేశ్ ప్రధాన భూభాగంతో సంబంధాలు కొనసాగించేందుకు టిన్ బిఘా కారిడార్ ఉపయోగపడుతుంది. దీని పొడవు సుమారు 178 మీటర్లు, వెడల్పు 85 మీటర్లు మాత్రమే. 1974లో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ మార్గం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 1992లో ఈ మార్గాన్ని బంగ్లాదేశ్ ప్రజల రాకపోకలకు అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి ఉండేది. 2011 నుంచి 24 గంటల పాటు తెరిచి ఉంచుతున్నారు. 2015లో భారత్, బంగ్లాదేశ్ మధ్య భూ సరిహద్దు ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యాయి. అయితే దహాగ్రామ్ – ఆంగర్పోటా ప్రాంతం మాత్రం బంగ్లాదేశ్‌లో భాగంగానే కొనసాగుతోంది.
33
పాస్ పోర్టు, వీసా ఉండాల్సిందే
మరి భారతీయులు ఈ ప్రాంతంలోకి నేరుగా వెళ్లవచ్చా? అంటే అంత సులభం కాదు. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించిన సున్నితమైన ప్రాంతం కావడంతో భద్రతా ఆంక్షలు ఉన్నాయి. సాధారణ పర్యాటకులు ఇష్టానుసారంగా లోపలికి వెళ్లడానికి వీలుండదు. ప్రత్యేక అనుమతులు, అవసరమైన ప్రయాణ పత్రాల పరిశీలన తర్వాతే ప్రవేశానికి అవకాశం ఉంటుంది. వీసా, పాస్ పోర్టు కూడా ఉండాలి. ఈ ప్రాంతం భారత భూభాగం మధ్యలోనే ఉన్నా ఉన్నా బంగ్లాదేశ్ పాలనలో కొనసాగుతుండటం విశేషం. అందుకే ఈ గ్రామం గురించి తెలుసుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు.