
ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు నదులే జీవనాధారం... ఇండియా వంటి వ్యవసాయ ఆధారిత దేశాలను నదులు లేకుండా ఊహించలేం. కానీ భౌగోళిక పరిస్థితుల వల్ల కొన్ని దేశాల్లో ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. నదులు లేని దేశాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సౌదీ అరేబియా
శాశ్వత నది లేని ప్రపంచంలోనే అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఇక్కడి విశాలమైన ఎడారిలో 'వాడిస్' అనే ఎండిన నదీ లోయలు ఉంటాయి. అప్పుడప్పుడు కురిసే వర్షాలకు ఇవి నిండినా, వెంటనే ఎండిపోతాయి. అందుకే ఈ దేశం భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అలాగే సముద్రపు ఉప్పునీటిని శుద్దిచేసి తాగునీటిగా వాడుకుంటుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
దుబాయ్, అబుదాబి వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలు కలిగిన యూఏఈలో కూడా శాశ్వత నదులు లేవు. తీవ్రమైన పొడి వాతావరణం కారణంగా నదులు ఏర్పడలేవు. వర్షాకాలంలో అక్కడక్కడా లోయల్లో నీరున్నా, అవి ఎక్కువ కాలం నిలవవు. అందుకే తమ రోజువారీ అవసరాల కోసం ఈ దేశం సముద్రపు నీటిని శుద్ధి చేసే అత్యాధునిక డిసాలినేషన్ ప్లాంట్లపై ఆధారపడుతుంది.
ఖతార్
ఖతార్ భూభాగం మొత్తం చదునైన ఎడారి. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. అందుకే నదులు ఏర్పడవు. దేశంలో మంచినీటి సరస్సులు గానీ, ప్రవాహాలు గానీ లేవు. భూగర్భ జలాలు ఉన్నా అవి చాలా పరిమితం. ఇక్కడ కూడా ప్రజల దాహాన్ని తీర్చేది డిసాలినేషన్ ప్లాంట్లే.
కువైట్
కువైత్ దేశ సరిహద్దుల్లో ఒక్క నది గానీ, సరస్సు గానీ లేదు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వల్ల ఇక్కడ సహజంగా మంచినీటిని నిల్వ చేయడం అసాధ్యం. చారిత్రకంగా నీటి కొరతే ఈ ప్రాంతంలో జనావాసాలను ప్రభావితం చేసింది. ప్రస్తుతం సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.
బహ్రెయిన్
బహ్రెయిన్‌లో నదులు లేవు. కానీ ఒకప్పుడు సముద్ర మట్టానికి దిగువన సహజసిద్ధమైన మంచినీటి ఊటలు ఉండేవి. కాలక్రమేణా అధిక వాడకం వల్ల ఈ ఊటలు చాలా వరకు ఎండిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నీటి అవసరాలకు డిసాలినేషన్ ప్లాంట్లే ఆధారం.
ఓమన్
ఓమన్‌లో శాశ్వత నదులు లేవు. కానీ రుతుపవన వర్షాల తర్వాత నీటితో నిండే లోయలు (వాడిస్) చాలా ఉన్నాయి. వర్షాల తర్వాత ఇవి వ్యవసాయానికి తాత్కాలికంగా నీటిని అందిస్తాయి. అయినా ఇక్కడి ఏ ప్రవాహాన్ని పూర్తిస్థాయి నదిగా పరిగణించరు.
మాల్టా
మాల్టాలోనూ నదులు లేవు. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే చిన్న చిన్న వాగులు ఏర్పడతాయి. అవి కూడా కొద్దికాలమే ప్రవహించి ఎండిపోతాయి. ఈ ద్వీపంలోని సున్నపురాయి నేల వల్ల వర్షపు నీరు వేగంగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇక్కడ భూగర్భ జలాలే మంచినీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి.
మాల్దీవులు
మాల్దీవులు పల్లపు ప్రాంతంలో ఉండే పగడపు దీవుల సముదాయం. నదులు ఏర్పడటానికి అవసరమైన ఎత్తైన ప్రదేశాలు ఇక్కడ లేవు. అందుకే ఇక్కడ వాగులు, సరస్సులు వంటి మంచినీటి వనరులు ఏవీ కనిపించవు. వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోతుంది.
వాటికన్ సిటీ
ప్రపంచంలోనే అతిచిన్న దేశమైన వాటికన్ సిటీలో నదులు ప్రవహించడానికి సరిపడా స్థలం కూడా లేదు. ఇది కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉంటుంది... కాబట్టి నదులు ఏర్పడే అవకాశమే లేకుండాపోయింది.
ప్రపంచంలో సుమారు 19 దేశాల్లో నదులు లేవు. వీటిలో ఎక్కువ శాతం మధ్యప్రాచ్య దేశాలు (Middle East) లేదా చిన్న ద్వీప దేశాలు. అయితే .నదులు లేకుండా ఈ దేశాల్లో ప్రజలు ఎలా జీవిస్తున్నాయి..? అనేగా మీ ప్రశ్న. అయితే నదులు లేకపోయినా ఈ దేశాలు అధునాతన సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్నాయి. మంచినీటి కోసం వారు అనుసరించే పద్ధతులు..
డీశాలినేషన్ (Desalination) : సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించి స్వచ్ఛమైన నీరుగా మార్చడం.
భూగర్భ జలాలు (Ground Water) : భూమి లోపల ఉన్న పురాతన నీటి నిల్వలను బోర్ల ద్వారా వెలికి తీయడం.
నీటి శుద్ధి (Water Recycling) : వాడిన నీటిని మళ్ళీ శుద్ధి చేసి వ్యవసాయానికి లేదా పరిశ్రమలకు వాడటం.
వాడీలు (Wadis) : వర్షాకాలంలో వచ్చే తాత్కాలిక ప్రవాహాలను ఆనకట్టల ద్వారా నిల్వ చేయడం.
నీరు ప్రాణాధారం. నదులు లేని దేశాలు నీటి విలువను గుర్తించి, ప్రతి చుక్కను పొదుపుగా వాడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన వనరులు లేకపోయినా, మానవ మేథస్సుతో ఆ కొరతను ఎలా అధిగమించవచ్చో ఈ దేశాలు నిరూపిస్తున్నాయి.