వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో ఈ వ్యవసాయ మార్కెట్ యార్డు ఉంది. వరంగల్, హనుమకొండతో పాటు పరిసర ప్రాంతాల రైతులు ఇక్కడ పత్తి, మిర్చి, పసుపు, ధాన్యం వంటి పంటలను విక్రయిస్తుంటారు. మార్కెట్ నిర్వహణను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఎనుమాముల మార్కెట్‌ను ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పలు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఆసియాలో పత్తి వ్యాపారంలో ఇదే ప్రథమ స్థానంలో ఉందనిమాత్రం చెప్పలేము. ఆసియాలోని అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఇది కూడా ఒకటి.
పత్తి కొనుగోళ్లలో రికార్డు
ఎనుమాముల మార్కెట్ చరిత్రలో పత్తి కొనుగోళ్ల పరంగా 2024–25 సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. పలు మీడియా నివేదిక ప్రకారం, ఆ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్‌లో మొత్తం 9,38,841 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగింది.ఇందులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) 7,45,580 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేటు వ్యాపారులు 1,93,260 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. అంతకుముందు 2023–24 సీజన్‌లో మొత్తం కొనుగోళ్లు 9,22,268 క్వింటాళ్లుగా నమోదయ్యాయని తెలుస్తోంది. అంటే, 2024 డిసెంబర్ నాటికే అంతకుముందు సీజన్ మొత్తం కొనుగోళ్లను మార్కెట్ అధిగమించింది.