
ఆదివారం సెలవు రోజు !
ఇంటిపట్టునే వుండే అవకాశం .
సోమవారం నుండి శనివారం వరకు ఆఫీస్ లకు, బడులకు వెళ్ళాలి.
పని రోజుల్లో వంట చెయ్యడం .. మూడు పూటలా తినడం.. తిన్నాం కాబట్టి టాయిలెట్ కు పోవాల్సి రావడం. టైం తీసుకొనే పనులు.
సోమవారం నుంచి శనివారం దాక సరిపడా వంటల్ని ఆదివారమే వండేసి, అదే రోజు తినేసి.. టాయిలెట్ కార్యక్రమాలు ముగించేసుకొంటే .. వారం రోజులు హ్యాపీ కదా ?
వండేపని ఉండదు .
బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని మూడు పూటలా తినడానికి టైం వేస్ట్ కాదు .
టాయిలెట్ టైం కూడా మిగిలి పోతుంది.
అవిడియా ఎలా ఉంది?
"ఏడ్చినట్టే ఉంది .. వారం తిండి... ఒక్క ఆదివారమే తినే ప్రయత్నం చేస్తే స్టమక్ అప్సెట్ అయ్యి ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం ఖాయం" అనుకొంటున్నారా ?
వారం తిండి ఒక్క ఆదివారమే తింటే స్టమక్ ఓవర్ లోడ్ .. నిజమే .
ఆరో తరగతి లో ఆరు - ఏడు పాఠాలు..
ఏడో తరగతి లో ఎనిమిది - తొమ్మిది తరగతి పాఠాలు..
ఎనిమిది లో పది - ఇంటర్ ఫస్ట్ ఇయర్ ..
ఇలా సాగుతుంది కార్పొరేట్ బడుల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్స్.
తినాల్సిందాని కన్నా ఎక్కువ తింటే స్టమక్ ఓవర్ లోడ్ .
మరి ఎక్కించాల్సిందాని కన్నా ఎక్కువ .. ఎక్కిస్తే బ్రెయిన్ ఓవర్ లోడ్ కాదా ?
అవుతుంది .
దాన్నే కాగ్నిటివ్ ఓవర్ లోడ్ అంటారు .
స్టమక్ ఓవర్ లోడ్ అయితే వాంతులు ..
కాగ్నిటివ్ ఓవర్ లోడ్ అయితే ... చదవాలనే ఆసక్తి చచ్చి పోతుంది. నేర్చుకొనే తత్త్వం పోతుంది .
ఇంత చిన్న లాజిక్ తెలుగు జాతి ఎలా మిస్ అయ్యిందబ్బా?
ప్రపంచం లో అనేక దేశాల్లో ఐఐటీ లాంటి సంస్థలున్నాయి .
కానీ ఆరో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ పేరుతొ కాగ్నిటివ్ ఓవర్ లోడ్.. ఒక్క తెలుగు జాతికే సొంతం .
పేటెంట్ హక్కులు ... కాపీ రైట్లు తెలుగు కార్పొరేట్ బడులవే.
బయట ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి అమోఘమయిన అవిడియాలను కాపీ కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు.
1997 నుంచి నిన్నటి దాక సాఫ్ట్ వేర్ స్వర్ణ యుగం .
తెలుగు నేల... బిడ్డ పుట్టాడు అంటే ..
ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ .. ఇంజనీరింగ్ కోర్స్ .. అమెరికా .. గ్రీన్ కార్డు.
... జీవిత పరమావధి అని డిసైడ్ అయిపొయ్యేది
2000 - 2010 కాలం లో కార్పొరేట్ బడులు వెలిసాయి .
ఇంటర్ అంటే లేట్ అయిపోతుంది. ఆరులోనే ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పాయి. లక్షలాది మంది పిల్లలు ఇదే దారిలో నిలబడ్డారు.
కార్పొరేట్ బడుల యజమానులు మహా తెలివయిన వారు. ఇంతమందికి ఐఐటీ సీట్స్ వచ్చేది లేదు చచ్చేది లేదు..
ఎగ్జామ్స్ పెట్టి వెయ్యిలో ఒకరిని ఇద్దరినీ బయటకు తీసి సెంట్రల్ ఆఫీస్ బ్యాచ్ పేరుతొ... యాభై బ్రాంచ్ లలో వడకట్టిన విద్యార్థులను ఒక చోట చేర్చేవారు .
వీరికే నిజమయిన కోచింగ్. పేపర్ లు పట్టుకొచ్చినా వీరికే లీక్. ఇక్కడినుంచే కాస్తో కూస్తో రిజల్ట్స్. ఇంత చేసినా సరిపడా ఫలితాలు లేదంటే ర్యాంకులు వచ్చిన వారిని కొనడానికి సరి పడ్డా డబ్బుంది.
అంటే వెయ్యిలో ఇద్దరికే నిజమయిన కోచింగ్.. మీగడ పాలు . మిగతా 998 మంది పనికి రారని కార్పొరేట్ వాడే తేల్చేసాడు. వీరికి నీళ్ల పాలు.. బతుకు బుగ్గిపాలు.
వీరు కేవలం మహారాజ పోషకులు.
వీరి డబ్బుతోనే సంస్థ నడుస్తుంది. అవినీతి అధికారులకు వీరి డబ్బే. పేపర్లు .. దొంగ ర్యాంకులు కొనేది వీరి డబ్బుతోనే.
మీడియా ప్రకటనలు వీరి డబ్బుతోనే .
మరి ఈ 998 మంది ఏమయ్యారు ?
సాఫ్ట్వేర్ స్వర్ణయుగంలో కోళ్ల ఫారం ఇంజనీరింగ్ కాలేజీ లు వెలిసాయి .
1. ఐఐటీ లు .. ఎన్ఐటీలు... టాప్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజీ లో చదివిన వారు..
2. సాదాసీదా ఇంజనీరింగ్ లో చేరి అటుపై అమీర్పేట్ లో కోచింగ్ లో కుస్తీ పట్టి సిజెక్టు, స్కిల్స్ నేర్చుకొన్న వారు..
3. ఇదేదీ లేకుండా కోళ్లఫారం ఇంజనీరింగ్ కాలేజీలో చేరి గట్టెక్కలేక బొర్లాపడినా దొంగ సర్టిఫికెట్ లు, ప్రాక్సీల సాయంతో అమెరికా వెళ్లిన వారు..
సాఫ్ట్ వెర్ ఉద్యోగాల వెల్లువలో ఇవన్నీ నడిచాయి .
అందరికీ ఉద్యోగాలొచ్చాయి .
సంపాదన సాధ్యమయ్యింది .
ఇప్పుడు కృత్రిమ మేథ వచ్చింది .
వేలాది ఉద్యోగాలను తినేసింది. తినేస్తోంది.
అమెరికాలో గత కొన్ని నెలలుగా ఉద్యోగాలను కోల్పోయి ఇండియా కు తిరిగి వచ్చేసిన వారి సంఖ్య వేలల్లో.
ఇందులో ఐఐటీ వారు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చెల్లని పాత వెయ్యి రూపాయిల నోటు.
1 . ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ పేరుతొ నిన్నటి దాక సాగింది.. విద్యార్థి బుర్రలోకి సమాచారం ఎక్కించడమే . అంటే విద్యార్థి బ్రెయిన్ ను డేటా సెంటర్ గా మార్చేయడం.
ఇప్పుడు డేటా సెంటర్ లు వచ్చాయి.
ఎంత ఎక్కించినా.. ఎంతటి మనిషయినా డేటా విషయంలో చాట్ జిపిటి , గ్రోక్ , మెటా లాంటి వాటితో పోటీ పడలేరు.
పడాల్సిన అవసరం లేదు కూడా .
2 . కృతిమ మేథ చేయలేని పని చేసే వారికే ఇకపై జాబ్స్. కూతూహలం, నిరంతర అధ్యయనం , సృజనాత్మకత , కుశాగ్ర బుద్ధి , మెరుగైన భావవ్యక్తీకరణ శక్తి.. నలుగురితో కలిసి పనిచేసే శక్తి , సామాజిక భావోద్వేగ తేలితేటలు .. లాంటి స్కిల్స్ ఉన్నవారికే ఇక జాబ్స్ .
3. ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ పేరుతొ తెలుగు హిందీ సబ్జెక్టు లను పక్కన పడేసారు.
సాహిత్యం అంటే కేవలం గ్రామర్ కాదు. పోతన, తిక్కన, శ్రీశ్రీ, వేమన, సుమతి, తులసీదాసు, కబీరు ... వీటికి మించిన లైఫ్ స్కిల్స్ లెసన్స్ ఉంటాయా ? చదవని వాడు జీవితంలో శుంఠగా మిగిలిపోడా?
4. క్రీడలు, ఫీల్డ్ ట్రిప్స్ లాంటి ఉండవు.
సామాజిక తెలివితేటలూ భావోద్వేగ తేలితేటలు ఎలా వస్తాయి?
5. చివరికి సోషల్ స్టడీస్ కూడా మమ టైపు . ఇంగిత జ్ఞానం లేని ఒక తరం తయారయ్యిందంటే తప్పెవరిది ?
6. కేవలం గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు . అది కూడా బట్టీ పద్దతిలో. టన్నుల కొద్దీ సమాచారం బుర్రలోకి తోసెయ్యడం. దీనితో బుర్ర అలిసి పోతుంది. నేర్చుకోవాలి అన్నతత్త్వం చచ్చిపోతుంది . నిరంతర అధ్యయనం చేసేవారికే .. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవారికి ఇక జాబ్స్ . చదవాలి అన్న ఆసక్తిని కోల్పోయినవారు ఎలా మనగలుగుతారు ?
7. రోబో లు చేయలేనివి మనిషి మాత్రమే చేసేది ఇన్నోవేషన్ . బట్టి చదువులతో బుర్రను అలవగొడితే సృజన పోతుంది . ఇలాంటి వారు ఇన్నోవేషన్ ఏమి చేస్తారు? బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్లుగా మిగిలిపోవడం తప్పించి?
ప్రపంచం వేగంగా మారుతోంది. నిద్రలేవక పొతే ఎలా
"రష్యా తో వ్యాపారం చేస్తే టారిఫ్ లు పెంచేస్తా!" అని ట్రంప్ హెచ్చరించాడు.
వెనక్కు తగ్గాలి.. లేదంటే కనీసం కామ్ గా అయినా కొంత కాలం వెయిట్ చెయ్యాలి .
కానీ నిన్న ఢిల్లీ లో జరిగిందేమిటి ?
విమానాశ్రయానికి వెళ్లి సొంత కారులో పుతిన్ తీసుకొని వెళ్లి విందు భోజనం ఇచ్చాడు దేశ ప్రధాని. పోనీ ఇండియా ప్రధానికి అమెరికా అధ్యక్షుడికి విరోధమా? అంటే లేదు.
ట్రంప్ స్వయంగా "నా మిత్రుడు" అని అనేక సార్లు చెప్పాడు .
1950 - 1991 - ద్వి ధ్రువ ప్రపంచం .. అమెరికా- రష్యా .
1991 - 2025 - అమెరికా నే కింగ్ .
ఇప్పుడు ప్రపంచం వేగంగా మారుతోంది .
చైనా ఇప్పుడు ఎకనామిక్ సూపర్ పవర్ .
రష్యా కూడా చైనా ను అందిపుచ్చుకోవాలని చూస్తోంది.
మరో పక్క జపాన్.
గత ఎనిమిది నెలల్లో అమెరికా లో నాలుగున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయారు.
ఇప్పుడు అక్కడ నిరుద్యోగం తాండవిస్తోంది .
రాబొయ్యే రోజుల్లో చాలామంది జీవితకాల నిరుద్యోగులుగా ఉండిపోతారు . వీరి కోసం అతి చిన్న ఇళ్ల నిర్మాణం ఒక పక్క సీక్రెట్ గా మొదలయ్యింది . వీరికి ఫ్రీ అకామడేషన్ ఇస్తారు. నెలకు ఇంత అని .. బహుశా రెండు వేల డాలర్స్ ఇస్తారు . ఒక పక్క కార్బన్ ఫుట్ ప్రింటింగ్ . డిజిటల్ కరెన్సీ . అంటే ఉద్యోగాలు లేక యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్లుగా మిగిలి పోయినవారు .. నెలకు ఎంత కొనాలి? ఏమి కొనాలి? అని నిర్దేశాలు ఉంటాయి . వారిని స్పాన్సర్ చేసే పెద్ద కంపెనీ లకు వారి గినీ పిగ్స్ అయిపోతారు.
మస్క్ మామ .."ఒరేయ్ .. మీకు డబ్బిచ్చి పోషిస్తున్నాను..నా న్యూరల్ చిప్ వేసుకోండ్రా!" అంటే వేసుకోవాలి.
గేట్ల తాత తన సెటిలైట్ టౌన్షిప్ నయా బానిస సామ్రాజ్యం లో" కొత్త వాక్సీన్ వేసుకోవాలి అంటే మారుమాట్లాడకుండా గుచ్చుకోవాలి.. ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ నయా బానిసలు .. పెళ్లి చేసుకోవాలా వద్దా ? పిల్లల్ని కనాలా వద్దా అని వారి యజమానులు నిర్ణయిస్తారు.
అమెరికాలో క్రెడిట్ కార్డు బతుకులు. ముప్పై ఏళ్ళ ఇన్కమ్ ను తాకట్టు పెట్టి ఇల్లుకొన్నారు. ఇప్పుడు ఉద్యోగం కాస్త పోయింది. EMI ఎలా కట్టాలి ? దానికి కూడా ఒక ప్లాన్ రెడీ అవుతోంది. EMI కట్టలేక డిఫాల్ట్ అయిన ఇళ్లను కొనడానికి బడాబాబులు డబ్బులు రెడీ చేసుకొంటున్నారు. అయిదు లక్షల డాలర్స్ ఇల్లు . ఇప్పటి దాక రెండు లక్షలు కట్టావు. మూడు ప్లస్ కట్టాలి. "నువ్వు కట్టిన రెండు లక్షలకు బదులుగా ఇరవై వేలు ఇస్తా . అవునయ్యా .. ఇప్పుడు రేట్స్ పడిపోయినాయి. ఇస్తే ఇవ్వు లేక పొతే బ్యాంకు స్వాధీనం చేసుకొని వేలం వేస్తుంది. వేలంలో కారు చౌకగా కొట్టేస్తా !"
చదువుతుంటే భయం వేస్తుందా ?
డబ్బులు సరిపోక కొత్తగా కరెన్సీ ప్రింటింగ్ కోసం అమెరికా చూస్తోంది. ఒక పక్క చైనా జపాన్ బాండ్స్ విడుదల చేస్తున్నాయి. దీంతో కాపిటల్ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఆసియా దేశాల వైపు . మరో పక్క అమెరికా లో కొన్ని కంపెనీస్ మలేషియా ఇండియా లాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ .
ఇవన్నీ చదువుతుంటే గందరగోళంగా ఉందా ?
ఎస్ . ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో .. అందుకే బంగారం ధరలు అలుపు లేకుండా పెరుగుతున్నాయి .
ఈజీ గా జరుగుతుంది .. పుసుక్కున జరుగుతుంది అని చెప్పడం లేదు . జరగాలని నేను కోరుకోవడం లేదు కూడా .. కానీ ఒక అవకాశం ఏంటంటే అమెరికా లో హైపర్ ఫ్లేషన్ .
ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని అమెరికా కేవలం ఒక రీజినల్ పవర్ గా అంటే నేటి ఇంగ్లాండ్ స్థాయికి పడిపోవడం .
ప్రపంచం పెద్దపెట్టున మారుతోంది .
ఇంకా మీరు ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ ..అమెరికా ..అని పాతకాలం కలల్లో ఉంటే ఎలా ?
నిద్రలేవండీ .. గతం లో బతకొద్దు !
చెల్లని నోట్లు కాదు . కొత్త నోట్లు తెచ్చుకోండి .
1 . 360 డిగ్రీల కోణం లో విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి పై ద్రుష్టి నిలిపే బడుల్లో పిల్లని చేర్పించండి .
2 . ఐఐటీలు గొప్ప సంస్థలు. వాటిలో సీట్ కోసం పోటీ పడాలి. దాని కోసం పేపర్ కావాలి. కానీ ఇప్పుడున్న ఐఐటీ ఫౌండేషన్ పద్ధతిలో కాదు.
కాన్సెప్ట్ నేర్వాలి. విశ్లేషణ చెయ్యాలి. సమస్యల పరిష్కారానికి మార్గాలు వెదకాలి . ఇదీ చదువు సాగాల్సిన తీరు .
౩. బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చెయ్యండి . కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు సైన్స్ మ్యాగజైన్స్ .. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్స్ .. టీవీ న్యూస్ .. ఏజ్ బట్టి .
4 . క్రీడలు , ఫీల్డ్ ట్రిప్స్ , ఎన్సీసీ , రోబోటిక్స్ , కృతిమ మేథ, ప్రాజెక్ట్ వర్క్స్ .. విద్యార్థిలో ఇన్నోవేషన్, కుతూహలం లాంటి వాటికి సాన పట్టేలా ..
5. కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి .
6. గుర్తుంచుకోవడం కోసం కాదు ..నేర్చుకునేందుకు చదవాలి .
7. బిడ్డ ఇంటికొచ్చిందే హోమ్ వర్క్ చెయ్యి .. గదిలో కెళ్ళి తలుపేసుకో అని కాదు.. సమయం గడపండి . మీ బాల్యం గురించి చెప్పండి . మీ కష్టాలు చెప్పండి. చుట్టూరా జరిగేదాన్ని చర్చించండి .
ఇన్ని మాటలొద్దు .. ఒక్క మాటలో చెబుతా ..
మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారో అలాగే మీ పిల్లని పెంచండి .
మధ్యలో వచ్చిన కార్పొరేట్ బడులు బాల్యాన్ని కిడ్నాప్ చేసేశాయి . పిల్లల బాల్యాన్ని తిరిగీ వారికివ్వండి .
పిల్లలని పిల్లలుగా పెంచితే.. 1985 కు ముందు ప్రతి బడిలో సాగిన నిజమయిన చదువు వారికందిస్తే .. కొత్త ప్రపంచంలో వారే విజేతలుగా నిలుస్తారు.