
ప్రపంచంలో అతిపెద్ద పాములు అనగానే అనకొండ పేరు గుర్తుకొస్తుంది. భారీ శరీరం, పొడవైన ఆకారంతో అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాముల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మరి ప్రపంచంలోనే అతి చిన్న పాము ఏది? దాని పొడవు ఎంత ఉంటుంది? ఎక్కడ నివసిస్తుంది? అది కూడా పెద్ద పాముల్లాగే ప్రమాదకరమైనదేనా? ఇలాంటి ప్రశ్నలకు చాలామంది దగ్గర సమాధానం ఉండదు. అయితే ప్రపంచంలోనే అతి చిన్న పాముగా గుర్తింపు పొందిన బార్బడోస్ థ్రెడ్స్నేక్ (Barbados Threadsnake) గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది చూడటానికి అచ్చం చిన్న వానపాములా, సన్నని దారంలా కనిపిస్తుంది.
ప్రపంచంలోనే అతి చిన్న పాము ఇదే
బార్బడోస్ థ్రెడ్స్నేక్ను ప్రపంచంలోనే అతి చిన్న పాము జాతిగా గుర్తించారు శాస్త్రవేత్తలు. పూర్తిగా ఎదిగిన ఈ పాము సాధారణంగా 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంటే దాదాపు 4 అంగుళాలు... గరిష్ఠంగా 10.4 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. శరీరం చాలా సన్నగా ఉండటంతో పాము కంటే వానపాములా కనిపిస్తుంది. దారంలా సన్నగా ఉండే దీని శరీరాన్ని సాధారణంగా కంటితో గుర్తించడం కూడా కష్టమే.
దీని బరువు కేవలం 0.6 గ్రాముల స్థాయిలో ఉంటుంది. అంటే ఒక గ్రాము కంటే కూడా తక్కువ... చిన్న పిన్నీసంతా బరువు ఉంటుందన్నమాట. ఇంత చిన్న పరిమాణంలో ఉండటం వల్లే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
పేరులోనే ఉన్నట్లుగా బార్బడోస్ థ్రెడ్స్నేక్ ప్రధానంగా కరేబియన్ ప్రాంతంలోని బార్బడోస్ ద్వీపంలో కనిపిస్తుంది. ఇది ఆ ద్వీపానికే ప్రత్యేకమైన పాము జాతి. అక్కడి అడవులు, తేమతో కూడిన నేలలు, ఆకులు పేరుకుపోయిన ప్రదేశాలు దీని నివాసానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా నేలపై బహిరంగంగా తిరగవు. భూమిలోపల, రాళ్ల కింద, చెట్ల వేర్ల దగ్గర ఉండే చిన్న ఖాళీల్లో దాక్కుని జీవిస్తాయి. భూమిలోపల నివసించే అలవాటు, అతి చిన్న శరీర పరిమాణం కారణంగా వీటిని గుర్తించడం చాలా కష్టం. పరిశోధకులు కూడా వీటి ఉనికిని గుర్తించేందుకు చాలా కాలం ప్రయత్నించాల్సి వచ్చింది.
విషం ఉంటుందా? మనుషులకు ప్రమాదకరమా?
బార్బడోస్ థ్రెడ్స్నేక్ విషపూరితమైన పాము కాదు. మనుషులకు హాని చేసే విషం దీని శరీరంలో ఉండదు. పెద్ద పాముల మాదిరిగా జంతువులను వేటాడే సామర్థ్యం కూడా దీనికి లేదు. దీని ప్రధాన ఆహారం చీమలు, చెదపురుగులు, వాటి గుడ్లు, లార్వాలు వంటి అతి చిన్న జీవులు. నేలలో లేదా చెదల పుట్టల్లో ఆహారం వెతుక్కుంటూ జీవిస్తుంది.
చాలా చిన్నగా ఉండటం, భూమిలోపలే ఎక్కువ సమయం గడపడం వల్ల దీన్ని సాధారణంగా చూడటం కష్టం. ఒకవేళ కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏ పామునైనా అనవసరంగా చేతితో పట్టుకోవడం లేదా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు.
ఈ పాము గురించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 2008లో శాస్త్రవేత్త బ్లెయిర్ హెడ్జెస్ దీనిని ప్రత్యేక జాతిగా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ఆ తర్వాత దాదాపు 20 ఏళ్ల పాటు పరిశోధకులకు ఇది కనిపించలేదు. దీంతో ఈ జాతి అంతరించిపోయిందేమోనని కూడా కొందరు ఆందోళన చెందారు. చివరకు 2025 మార్చి 20న బార్బడోస్లోని ఒక అడవిలో రాళ్ల కింద ఈ పామును పరిశోధకులు మళ్లీ గుర్తించారు.
ఒకసారి ఒకే గుడ్డు
ఇంత చిన్న శరీరం ఉండటంతో ఈ పాము సంతానోత్పత్తి విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది గుడ్లు పెట్టే పాము. సాధారణంగా ఒక్కసారి ఒక చిన్న గుడ్డును మాత్రమే పెడుతుంది. పిల్ల పాము గుడ్డు నుండి బయటకు వచ్చినప్పటికే పూర్తిగా ఎదిగి ఉంటాయి... తల్లి పాము పొడవులో దాదాపు సగం పరిమాణంతో ఉంటాయి.
మొత్తానికి ప్రపంచంలో అతిపెద్ద పాముల గురించి మాట్లాడినప్పుడు అనకొండ గుర్తుకొస్తే, అతి చిన్న పాము గురించి తెలుసుకోవాలంటే బార్బడోస్ థ్రెడ్స్నేక్ను గుర్తుంచుకోవాలి. కేవలం 10 సెంటీమీటర్ల పొడవుతో వానపాములా కనిపించే ఈ పాము ప్రకృతిలోని జీవ వైవిధ్యానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ.