Church : ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ తెలంగాణదే.. ఒకేసారి 40,000 మంది ప్రార్థన చేయవచ్చా..!

Published : Oct 30, 2026, 02:16 PM IST

తెలంగాణలో చర్చి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది మెదక్ చర్చి. కానీ దీనికంటే పెద్ద చర్చి ఇదే రాష్ట్రంలో ఇంకోటి ఉంది.. ఇక్కడ ఒకేసారి 40 వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చట. ఇంతకీ ఆ చర్చి ఏది?

PREV
13
ఇండియాలో టాప్ 2 పెద్ద చర్చిలు తెలంగాణవే...

సాధారణంగా తెలంగాణ అంటే చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ రాష్ట్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇక్కడ ఒకేసారి ఏకంగా 40 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చట. ప్రత్యేకమైన నిర్మాణశైలి, విశాలమైన ప్రాంగణం, వేలాది మంది సామూహికంగా ప్రార్థనలు చేసుకునే సౌకర్యం ఈ చర్చిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

ఇదే తెలంగాణలో మరోవైపు వందేళ్ల చరిత్ర కలిగిన మెదక్ చర్చి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించిన ఈ ప్రార్థనా మందిరం అద్భుతమైన గోతిక్ నిర్మాణశైలికి ప్రసిద్ధి. ఒకటి ఆధునిక కాలంలో భారీ నిర్మాణంగా ఆకట్టుకుంటే.. మరొకటి చరిత్ర, కళాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణలోని ఈ రెండు చర్చిల విశేషాలు తెలుసుకుందాం.

23
ఆసియాలోనే అతిపెద్ద చర్చి ఇదే..

హనుమకొండ జిల్లాలోని కరుణాపురం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా మందిరం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ధర్మసాగర్ మండల పరిధిలోని ఈ ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్దదైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ భారీ నిర్మాణం విశాలమైన ప్రార్థనా ప్రాంగణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చర్చిలో ఒకేసారి సుమారు 40 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం ప్రత్యేకత కేవలం దాని పరిమాణం మాత్రమే కాదు... దీన్ని ఇజ్రాయెల్‌లోని పవిత్ర ప్రాంతాలను సందర్శించే అనుభూతి కలిగించేలా రూపొందించారు. ఇందుకోసం 2011లో పాస్టర్లు, ఆర్కిటెక్ట్‌ల బృందం ఇజ్రాయెల్‌ను సందర్శించి అక్కడి నిర్మాణాలను పరిశీలించారు.

ఈ ప్రార్థనా మందిరంలో భారీ అల్యూమినియం డోమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 60 అడుగుల ఎత్తు, 120 అడుగుల వ్యాసంతో ఉన్న ఈ గోపురాన్ని అమెరికా నుంచి తెప్పించారు. అలాగే ఇటలీ మార్బుల్, కేరళ కళాకారులు రూపొందించిన రంగుల అద్దాలు, ప్రత్యేకమైన చెక్క తలుపులు, విదేశీ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. బైబిల్‌లో ప్రస్తావించిన అంశాలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించేలా లోపలి అలంకరణలు రూపొందించారు.

ఈ చర్చి నిర్మాణం వెనుక రెవరెండ్ పాల్సన్ రాజ్ కీలక పాత్ర పోషించారు. 1992లో చిన్న ప్రార్థనా స్థలంగా ప్రారంభమైన క్రీస్తుజ్యోతి ఆధ్యాత్మిక కేంద్రం క్రమంగా విస్తరించి భారీ ప్రార్థనా మందిరంగా రూపుదిద్దుకుంది. 2016లో నిర్మాణ పనులు ప్రారంభించి సుమారు ఏడేళ్లపాటు శ్రమించి 2023 మేలో దీనిని ప్రారంభించారు. నిర్మాణానికి భక్తులు, దాతలు సహకరించడం మరో విశేషం.

నాగాలాండ్ చర్చిని వెనక్కి నెట్టిందా?

అతిపెద్ద చర్చిల ప్రస్తావన వచ్చినప్పుడు నాగాలాండ్‌లోని సుమి బాప్టిస్ట్ చర్చి పేరు ప్రముఖంగా వినిపించేది. నాగాలాండ్‌లోని జున్హెబోటో ప్రాంతంలో ఉన్న ఈ ప్రార్థనా మందిరం కూడా భారీ సామర్థ్యం, విశాలమైన నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ కేవలం 8 వేల మంది ఒకేసారి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది... కానీ తెలంగాణలోని క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరంది 40 వేల సామర్థ్యం. కాబట్టి నాగాలాండ్ చర్చిని తెలంగాణ చర్చి వెనక్కి నెట్టింది.

33
మెదక్ చర్చి.. వందేళ్ల చరిత్ర

తెలంగాణలో చర్చిల గురించి మాట్లాడితే మెదక్ కేథడ్రల్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మెదక్ పట్టణంలో ఉన్న ఈ చర్చి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అద్భుతమైన కట్టడం. దాని నిర్మాణశైలి, ఎత్తైన గోపురం, రంగుల అద్దాల కిటికీలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

ఈ చర్చి నిర్మాణానికి రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ నాయకత్వం వహించారు. ఆయన 1895లో హైదరాబాద్‌కు మిషనరీగా వచ్చారు. ఆ తర్వాత మెదక్ ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో అక్కడ క్రైస్తవుల సంఖ్య పెరగడంతో పెద్ద ప్రార్థనా మందిరం అవసరమైంది. దీంతో ప్రస్తుతమున్న కేథడ్రల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

ఈ మెదక్ చర్చి నిర్మాణం వెనుక ఆసక్తికరమైన సామాజిక నేపథ్యం ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో మెదక్ ప్రాంతం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంది. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పోస్నెట్ చర్చి నిర్మాణ పనులను చేపట్టారు. తద్వారా స్థానికులకు పని దొరకడంతో పాటు ప్రార్థనా మందిరం నిర్మాణం కూడా కొనసాగింది.

1914లో పునాదులు వేసిన ఈ చర్చి నిర్మాణం పూర్తవడానికి పదేళ్లు పట్టింది. 1924 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనల కోసం దీనిని అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కేథడ్రల్ తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

మెదక్ కేథడ్రల్ సుమారు 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించారు. గోతిక్ రివైవల్ నిర్మాణశైలి ఈ చర్చికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చింది. దీని బెల్ టవర్ సుమారు 175 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకేసారి వేలాదిమంది ప్రార్థనలు చేసుకునేలా చాలా విశాలంగా ఈ చర్చి ఉంటుంది. ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి... ఇందులో స్థానిక ప్రజలే కాదు ఇతర ప్రాంతాల నుండి తరలివచ్చి మరీ పాల్గొంటారు.

Read more Photos on
click me!

Recommended Stories