2 రూపాయ‌ల నోటుతో రూ. 5 ల‌క్ష‌లు మీ సొంతం.. మీరు కూడా ఇలాంటి వార్త‌లు చ‌దివారా.?

Published : Aug 20, 2025, 11:17 AM IST

సోష‌ల్ మీడియా విస్తృతి భారీగా పెరిగింది. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ మూల‌న ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో అర‌చేతిలో స‌మాచారం వాలిపోతోంది. అయితే ఈ స‌మాచార‌మంతా నిజ‌మేనా అంటే క‌చ్చితంగా అవున‌ని మాత్రం చెప్ప‌లేం. అలాంటి ఓ వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఓల్డ్ క‌రెన్సీ పేరుతో ప్ర‌చారం

ఫేస్‌బుక్‌లో మార్కెట్ ప్లేస్ ఫీచ‌ర్ గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఇందులో పాత వ‌స్తువుల‌ను విక్ర‌యించుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే ఇందులో ఇటీవ‌ల ఈ మార్కెట్ ప్లేస్‌లో పాత క‌రెన్సీని కొనుగోలు చేస్తామ‌ని పోస్టులు చేస్తున్నారు. 2 రూపాయ‌ల నోటుకు రూ. 5 ల‌క్ష‌లు, 10 పైస‌ల నాణేనికి రూ. 18 ల‌క్ష‌లు అంటూ పోస్టులు చేస్తున్నారు. దీంతో కొంద‌రు ఆశ‌ప‌డి వారితో బేర‌సారాలు చేయ‌డం మొద‌లు పెడుతున్నారు. అయితే ఇలాంటి క‌థ‌నాల‌ను కొన్ని మీడియా సంస్థ‌లు కూడా ప‌బ్లిష్ చేయ‌డం గ‌మ‌నార్హం. కొన్ని తెలుగు వెబ్‌సైట్స్ కూడా పాత క‌రెన్సీల‌కు డ‌బ్బులు చెల్లిస్తార‌న్న వార్త‌ల‌ను ప్ర‌చురించాయి. అయితే దీనిపై కాస్త లోతుగా ప‌రిశోధిస్తూ ఇది క‌చ్చితం మోస‌మ‌ని తేలింది.

25
ఎలా మోసం చేస్తున్నారు?

ఫేస్‌బుక్‌లో వందలకొద్దీ గ్రూపులు, పోస్ట్‌ల్లో “పాత నాణేలు కొనుగోలు చేస్తాం” అని ప్ర‌చారం చేస్తున్నారు. వాటిలో ఎక్కువ పోస్టుల్లో వాట్సాప్ నెంబ‌ర్‌ను ఇస్తున్నారు. నాణేల ఫొటోలు, ప్రధాని మోదీ ఫొటో, RBI లోగో, భారత ప్రభుత్వ చిహ్నం వంటి వాటిని ఉప‌యోగించి పోస్టులు చేస్తున్నారు. ఎవ‌రైనా ఆశ‌ప‌డి మెసేజ్ చేస్తే, మొదట మీరు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి అంటారు. ఇందుకు గాను రూ. 750 నుంచి రూ. 8000 వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. ఆ తర్వాత కూడా “GST ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఫీజు, TDS, GPS ఛార్జీలు, RBI నోటీసు ఫీజు” అంటూ మళ్లీ మళ్లీ డబ్బు అడుగుతారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, కంపెనీ ఐడీ వంటి డాక్యుమెంట్లు పంపి నమ్మకం కలిగిస్తారు. కానీ అవన్నీ ఫోటోషాప్ చేసిన ఫేక్ ఫొటోలు.

35
RBI పేరుతో మోసం

ఈ మోసగాళ్లు త‌మ‌ను తాము RBIతో రిజిస్టర్ అయిన కంపెనీగా చెప్పుకుంటారు. పాత నాణేలు మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు చేస్తామ‌ని న‌మ్మిస్తారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం. RBI ఎప్పుడూ పాత నాణేలు కొనుగోలు చేయదు. RBI ఎవరినీ ఏ ఫీజులు వసూలు చేయమని అనుమతించలేదు. ఈ మోసగాళ్లు RBI పేరు, లోగో వాడి ప్రజలను మోసం చేస్తున్నారు.

45
ల‌క్ష‌ల్లో కోల్పోతున్న బాధితులు

ఇలాంటి ఫేక్ నోట్ల బారిన ప‌డి దేశ‌వ్యాప్తంగా చాలా మంది మోస‌పోయారు. మంగ‌ళూరుకు చెందిన ఓ వ్య‌క్తి న‌కిలీగాళ్ల మాయ‌లో ప‌డి ఏకంగా రూ. 58 ల‌క్ష‌లు కోల్పోయారు, బెంగళూరులో మరో వ్యక్తి రూ. 31 లక్షలు పోగొట్టుకున్నాడు. వీరంతా ఫేస్‌బుక్‌, ఓఎల్ఎక్స్‌, కాయిన్ బ‌జార్ వంటి సైట్లలో ప్రకటన చూసి ఈ మోసగాళ్లకు చిక్కారు. కొంత‌మంది అయితే ఏకంగా AI వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో ప్ర‌ముఖ న్యూస్ ఛానళ్ల వాయిస్‌ల‌ను నకిలీ వీడియోలుగా తయారు చేసి ప్రజలను న‌మ్మిస్తున్నారు.

55
RBI హెచ్చరిక

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలకు స్పష్టంగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది:

* “RBI పాత నాణేలు లేదా పాత నోట్లను కొనుగోలు చేయదు.

* RBI పేరుతో ఫీజులు అడిగితే అది 100% మోసంగా భావించాలి.

* RBI ఎప్పుడూ ఆన్‌లైన్‌లో పాత నాణేలు అమ్మే ప్రక్రియలో పాల్గొనదు.

* IndiaMart, OLX వంటి వెబ్‌సైట్లు కేవలం మధ్యవర్తులుగా మాత్రమే ఉంటాయి, కానీ ఏ లావాదేవీకి బాధ్యత వహించవు కాబ‌ట్టి అందులో క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిపే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి.

* ఎవ‌రైనా ఎక్కువ డ‌బ్బులు ఇస్తామ‌ని ఆశ చూపిస్తే క‌చ్చితంగా అందులో మోసం ఉంద‌ని అర్థం చేసుకోవాలి.

* ఎప్పుడూ ఫీజులు, చార్జీలు చెల్లించవద్దు.

* అధికారిక RBI వెబ్‌సైట్ లేదా ప్రభుత్వ సైట్లలో మాత్రమే సమాచారం చూడండి.

* వాట్సాప్ ద్వారా తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయవద్దు. ఒక‌వేళ చేయాల్సి వ‌స్తే వారిని క‌చ్చితంగా భౌతికంగా క‌లిసిన త‌ర్వాతే త‌దుప‌రి నిర్ణ‌యాలు తీసుకోవాలి.

* మీరు మోసానికి గుర‌య్యార‌ని అర్థ‌మైన వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయండి. లేదా సైబ‌ర్ క్రైమ్ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Read more Photos on
click me!

Recommended Stories