
అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో సంచలనం సృష్టించి, ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ, ఒక్క హిట్ ప్లీజ్ అంటూ ఎదరుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్ సాధించిన విజయ్ కు, గీత గోవిందం సినిమా తరువాత సరైన హిట్ పడలేదు. ఆతరువాత చేసిన అరడజన్ కు పైగా సినిమాలు నిరాశాను మిగిల్చాయి. ఒకటీ రెండు సినిమాలు తప్పించి ఏసినిమా యావరేజ్ కూడా అనిపించుకోలేదు. దాంతో సాలిడ్ సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రౌడీ హీరో. భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ కూడా విజయ్ కు నిరాశను మిగిల్చింది.
ఇక మెగా హీరోల పరిస్థితి కూడా అంతే ఉంది. గ్లోబల్ హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత రెండు డిజాస్టర్స్ ను ఫేస్ చేశాడు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో రెండు ప్లాప్ లు ఫేస్ చేసిన రామ్ చరణ్ ఆశలన్నీ పెద్దిమీదనే పెట్టుకున్నాడు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒక్క హిట్టు బాబోయ్ అంటున్నాడు. ఆయన నటించిన గాండీవధారి అర్జున, మట్కా సినిమా కూడా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో వరుణ్ అసలు స్క్రీన్ మీద కనిపించకుండాపోయాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఇది అయినా వరుణ్ ను ప్లాప్ ల నుంచి గట్టెక్కిస్తుందా లేదా చూడాలి. ఇప్పుడైతే కొడుకు పుట్టిన సందర్భాన్ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వరుణ్.
ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ది కూడా అదే పరిస్థితి. సాయి తేజ్ తన మేనమామన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బ్రో సినిమా చేశాడు. కాని ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాపై కూడా పెద్దగా హైప్ లేదు. మరి సాయి తేజ్ హిట్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అటు మరో మెగా మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హిట్టు బాబోయ్ అంటున్నాడు. 2023 లో వచ్చిన ఆదికేశవ సినిమా తరువాత వైష్ణవ్ అసలు సినిమాలే చేయలేదు. మరో మెగా హీరో అల్లు శిరీష్ కూడా అంతే.. వరుస ఫెయిల్యూర్స్ చూసిన శిరీష్.. అసలు ఇండస్ట్రీలోనే కనిపించడంలేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.
టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సక్సెస్ లు చూశాడు యంగ్ హీరో నితిన్. కానీ ఇప్పుడు వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు. రంగ్ దే సినిమా తరువాత నితిన్ ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు. వరుసగా 'చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్, రాబిన్ హుడ్ తో పాటు రీసెంట్ గా 'తమ్ముడు సినిమాతో వరుసగా ప్లాప్ సినిమాలు చూశాడు నితిన్. అటు శర్వానంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. శతమానం భవతి' భారీ విజయం తర్వాత వరుసగా ప్లాప్ సినిమాలతో ఇబ్బందుల్లో పడ్డాడు శర్వా. పడి పడి లేచే మనసు, శ్రీకారం, జాను, రణరంగం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌లుగా నిలిచాయి.
ఇక ఇస్మార్ట్ శంకర్ తరువాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా రామ్ ఖాతాలో పడలేదు. చాలా కాలంగా హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు రామ్. మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నించిన రామ్, అది కలిసిరాక మళ్లీ... లవర్ బాయ్ సినిమాలు చేశాడు. అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈమధ్యలో లింగు స్వామి, బోయపాటి లాంటి పెద్ద దర్శకులతో కూడా సినిమాలు చేసి చూశాడు. కానీ ఫెయిల్యూర్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి రామ్ ను. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూక అనేసినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా రామ్ కు సక్సెస్ ను అందిస్తుందా చూడాలి.
టాలీవుడ్ లో ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న యంగ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అక్కినేని హీరో అఖిల్ కు సాలిడ్ హిట్ ఇంత వరకూ పడలేదు. ఇక ఛలో సినిమాతో టాలీవుడ్ చూపు తనవైపు తిప్పుకున్న నాగశౌర్య ఆతరువాత రెండు మూడు హిట్లు కొట్టాడు, కానీ ఇప్పుడు అసలు కనిపించకుండా పోయాడు, అటు విశ్వక్ సేన్ కూడా అంతే, ఆమధ్య వరుస హిట్లతో తెగ హడావిడి చేసిన విశ్వక్ ప్రస్తుతం సైలెంట్ అయ్యాడు. ఇక వరుస ప్లాప్ లు వెంటాడుతున్నా.. పట్టుదలతో సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ మాత్రం రావడంలేదు. అయినా తెలుగు, తమిళ భాషల్లో తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఇలా యంగ్ హీరోలు కొంత మంది హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.